Wednesday, January 22, 2025

‘ఉక్రెయిన్‌పై రష్యా దాడుల’ ఉధృతి

- Advertisement -
- Advertisement -

 

Bombing of several Ukrainian cities, including Kiev

కీవ్ సహా పలు ఉక్రెయిన్ నగరాలపై బాంబుల వర్షం
రాజధాని కీవ్‌లో భీతావహ స్థితి
ఖార్కివ్‌పై దాడులు తీవ్రం : 11 మంది పౌరుల మృతి
కీవ్ దిశగా కదులుతున్న రష్యా బలగాలు
65 కిలోమీటర్ల మేర సేనల వాహనాలు
ఒక్‌తిర్కా సైనిక స్థావరం ధ్వంసం: 70 మంది ఉక్రెయిన్ సైనికుల మృతి
రష్యాకు భారీ నష్టం: ఉక్రెయిన్
లక్షం నెరవేరే వరకు దాడులు ఆపం: రష్యా

కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు విఫలమైన నేపథ్యంలో.. వరసగా ఆరో రోజూ ఇరుదేశాల మధ్య సైనిక పోరు కొనసాగుతోంది. రష్యాపై అంతర్జాతీయ సమాజం ఆంక్షలు కఠినతరం చేస్తున్నప్పటికీ ఆ దేశం వెనక్కి తగ్గినట్లు కనిపించడం లేదు. ఉక్రెయిన్‌లో రెండో పెద్దనగరమైన ఖార్కివ్‌పై దాడులను మళ్లీ తీవ్రం చేసింది. నివాసప్రాంతాలపైనా బాంబుల వర్షం కురిసిస్తోంది. దాంతో రష్యాకు ప్రవేశాన్ని నిషేధిస్తూ నౌకాశ్రయాలు, కాల్వలు, విమానాశ్రయాలు అన్నీ మూసివేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.

మరో వైపు రష్యా తన లక్షం నెరవేరే వరకు ఉక్రెయిన్‌పై దాడులను కొనసాగిస్తుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా ఖార్కివ్‌పై జరిగిన బాంబు దాడుల్లో 11 మంది పౌరులు మృతి చెందినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. అలాగే ఈ యుద్ధంలో రష్యాను తీవ్రంగా నష్టపరిచినట్లు కూడా ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రకటించింది. మృతి చెందిన వవారు, గాయపడిన వారితో కలుపుకొని రష్యా దాదాపు 5,710 మంది సైనికులను నష్టపోయిందని, 29 విమానాలను కూల్చి వేశామని ప్రకటించింది. అలాగే 29 హెలికాప్టర్లు, 198 యుద్ధ ట్యాంకులు, 846 సాయుధ శకటాలు,305 వాహనాలు, 60 ఇంధన ట్యాంకులు, రెండు పడవలు, ఏడు డ్రోన్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది. అలాగే 200 మంది రష్యా సైనికులను పట్టుకున్నట్లు కూడా ప్రకటించింది.

40 మైళ్ల పొడవున రష్యా సైనిక కాన్వాయ్

మరో వైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్షంగా పుతిన్ బలగాలు ముందుకు సాగుతున్నాయి. దీంతో నగరంలో అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఆరు రోజులుగా రష్యా, ఉక్రెయిన్ నగరాలపై దాడులు చేస్తున్నప్పటికీ జెలెన్‌స్కీ ప్రభుత్వం ఎంతమాత్రం తగ్గేదే లే అంటోంది. దీంతో రాజధాని నగరాన్ని స్వాధీనం చేసుకోవడమే లక్షంగా రష్యా పావులు కదుపుతోంది. కీవ్ వైపు వెళ్లే రోడ్లపై దాదాపు 65 కిలోమీటర్ల( 40 మైళ్ల) మాస్కో సేనల వాహనాలు బారులు తీరడంతో రాజధాని నగరాన్ని ఆక్రమించుకునే లక్షంతో రష్యా పెద్ద ఎత్తున బలగాలను తరలిస్తున్నట్లు పశ్చిమ దేశాలు అనుమానిస్తున్నాయి. ఆ కాన్వాయ్‌కి చెందిన చిత్రాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. సోమవారం నాటి ఆ చిత్రాలను మాక్సర్ టెక్నాలజీస్ సేకరించింది. రాజధాని నగరానికి ఉత్తరం వైపున 40 మైళ్ల మేర ఈ కాన్వాయ్ విస్తరించింది. మొదట అది 17 మైళ్ల్లే అని నివేదికలు వచ్చినా.. అంతకు రెట్టింపు స్థాయిలోనే ఈ బలగాలు కదులుతున్నట్లు ఈ ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఆంటనోవ్ విమానాశ్రయంనుంచి ప్రిబిర్క్‌పట్టణం మధ్య ఉన్న రహదారి మొత్తం ఈ సైనిక వాహనాలు, ట్యాంకులు,ఫిరంగి దళాలతో నిండిపోయినట్లు తెలుస్తోంది.

అలాగే ఆ రహదారికి పక్కన ఉన్న భవనాలు కాలిపోతున్నట్లు చిత్రాల్లో కనిపిస్తున్నాయి. రాజధానితో సహా ప్రధాన పట్టణాలను స్వాధీనం చేసుకోవాలని రష్యా ప్రయత్నిస్తుండగా, ఉక్రెయిన్ బలగాలు అంతే దీటుగా ప్రతిఘటిస్తున్నాయి. ఇప్పటివరకు రష్యా దాడుల్లో 352 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. వీరిలో 14మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఉక్రెయిన్‌లోని ఒక్‌తిర్కా నగరంలో ఉన్న సైనిక స్థావరంపై రష్యా ఆదివారం రాత్రి జరిపిన దాడిలో 70 మంది ఉక్రెయిన్ సైనికులు మృతి చెందినట్లు స్థానిక వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఈ దాడిలో మిలిటరీ యూనిట్ పూర్తిగా ధ్వంసం కాగా, ఆ శిథిలాల కింద సైనికుల మృత దేహాల వెలికితీత కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ నగరాల్లో మంగళవారం ఉదయంనుంచి ఎయిర్ సైరన్ల మోతలు వినిపిస్తున్నాయి. కీవ్‌తో పాటుగా పశ్చిమ నగరాలయిన టెర్రోపిల్, రివ్నో తదితర ప్రాంతాల్లో ఈ సైరన్లు వినిపించాయని స్థానికులు తెలిపారు. ఉక్రెయిన్‌లో రెండో పెద్ద నగరమైన ఖార్కివ్ నడిబొడ్డులోని నివాస స్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలపై రష్యా క్షిపణి దాడులకు పాల్పడుతోందని ఆ ర్రీజియన్ హెడ్ ఒలేగ్ సైనెగుబోవ్ మంగళవారం ప్రకటించారు. ఉక్రెయిన్‌లో రష్యా మారణకాండకు పాల్పడుతోందని తీవ్రంగా విమర్శించారు. ఈ దాడుల్లో క్షతగాత్రుల సంఖ్య ఇంకా తెలియరాలేదని తెలిపారు.

ఇక నౌకలపై నిషేధం!

ఇప్పటివరకు రష్యా విమానాలపై ఆంక్షలు విధిస్తూ వచ్చిన ఆయా దేశాలు ఇప్పుడు ఆ దేశ నౌకల కట్టడి దిశగా కదులుతున్నాయి. రష్యాతో సంబంధం ఉన్న అన్ని ఓడలను తమ నౌకాశ్రయాల్లోకి రాకుండా నిషేధించే బిల్లును ఆమోదించినట్లు బ్రిటన్ మంగళవారం ప్రకటించింది.ఈ విధమైన చర్య తీసుకున్న తొలి దేశం తమదేనని కూడా తెలిపింది. మరో వైపు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్‌లోని ఆయన కమాండర్లు యుద్ధ నేరాలకు సంబంధించిన తీవ్ర అభియోగాలను ఎదుర్కోవలసి ఉంటుందని బ్రిటన్ హెచ్చరించింది. రష్యా దారికి రానంతవరకు ఆ దేశంపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. పోలండ్ పర్యటనలో ఉన్న బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్ మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ, ఉక్రెయిన్ పౌరులపై రష్యా మిలిటరీ దాడులను ఖండించారు. వాటిని అనాగరిక చర్యలుగా అభివర్ణించారు. తమను తాము రక్షించుకోవాలన్న ఉక్రెయిన్ ప్రజల కాంక్షను, పాశ్చాత్య దేశాల ఐక్యతను పుతిన్ తక్కువ అంచనా వేస్తున్నారన్నారు.

సైనిక చర్యలో పాల్గొనే ఆలోచన లేదు: బెలారస్

ఉక్రెయిన్‌లో రష్యా చేపడుతున్న సైనిక చర్యలు పాల్గొనే ఆలోచన తమకు లేదని బెలారస్ అలెగ్జాండర్ లుకషెంకో మంగళవారం వెల్లడించారు. బెలారస్ భూభాగంనుంచి రష్యాదళాలు ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్నాయనే ఆరోపణలనూ ఆయన ఖండించారని అధికార వార్తాసంస్థ బెల్టా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News