యడియూరప్ప స్పష్టీకరణ
చామరాజనగర్(కర్నాటక): కర్నాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బసవరాజ్ బొమ్మై తన మంత్రివర్గాన్ని పూర్తి స్వేచ్ఛతో ఎంపిక చేసుకుంటారని, ఇందులో తాను జోక్యం చేసుకోబోనని మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప శుక్రవారం స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన తన అభిమాని కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించి వారికి రూ. 5లక్షల చెక్కును అందచేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను పార్టీని పటిష్టం చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తానని చెప్పారు. పార్టీ నాయకత్వంతో సంప్రదించి తన సొంత క్యాబినెట్ జట్టును ఎంపిక చేసుకునే పూర్తి స్వేచ్ఛ బొమ్మైకు ఉంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలో బొమ్మై ఉన్నారని, కేంద్ర నాయకులతో మాట్లాడి తన కేబినెట్‌లో ఎవరిని చేర్చుకోవాలో ఆయన నిర్ణయిస్తారని యడియూరప్ప తెలిపారు. ఈ విషయంలో తాను ఎటువంటి సలహాలు ఇవ్వబోనని ఆయన తేల్చిచెప్పారు.