కర్నాటక సిఎం బొమ్మై పిలుపు
బయోకాన్ కిరణ్‌కు స్పందన
సామాజిక అంశాలపై జాగ్రత్త
బెంగళూరు : సమాజంలోని అన్ని వర్గాలు సంయమనం సామరస్యంతో వ్యవహరించాలని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పిలుపు నిచ్చారు. బయోకాన్ సంస్థ అధినేత్రి కిరణ్ మజుందార్ షా కర్నాటకలో మత వైషమ్యాల పట్ల ఆందోళన వ్యక్తం చేసి, ఈ విభేదాలను సిఎం రూపుమాపాల్సి ఉందని కోరారు. ఈ నేపథ్యంలో గురువారం సిఎం స్పందించారు. సున్నితమైన సామాజిక అంశాలపై ఎవరు కూడా తొందరపడి బహిరంగ వ్యాఖ్యలకు దిగరాదని, సంయమనం పాటించాలని సిఎం కోరారు. కర్నాటక చిరకాలంగా శాంతి పురోగతికి పెట్టింది పేరు అని , ఈ సదాచారం ఇక ముందు ఇదే విధంగా కొనసాగేందుకు అంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక బయో ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ ఛైర్ పర్సన్ బిలియనీరు అయిన కిరణ్ కర్నాటకలో ఇటీవలి పరిణామాలు రాష్ట్ర పురోగతికిఆటంకం కల్పిస్తాయని తెలిపారు. కర్నాటకకు మతపరమైన రంగు పులుమకుండా చూడాల్సి ఉందన్నారు. రాష్ట్రం ఎప్పుడూ అందరి సమిష్టి కృషితో ఆర్థిక అభివృద్ధి దిశలో ఉంది.
ఐటి /బిటి సెక్టార్లు మతపరమైన భావనలో కూరుకుపోతే ఇక కర్నాటకు ఉన్న ఐటి ప్రాధాన్యతలు గ్లోబల్‌లీటర్ షిప్ పోటీతత్వం హరించుకుపోతుందని తెలిపారు. కర్నాటకలోని దేవాలయాల పరిసరాలలో హిందువేతరులు వ్యాపారాలు చేసుకోకుండా కర్నాటక ప్రభుత్వం అనుమతిని నిరాకరించినట్లు వచ్చిన వార్తలపై కిరణ్ మజుందార్ స్పందించారు. ఇటువంటివి ఇతరత్రా మలుపులకు దారితీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి జవాబిస్తూ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో హిజాబ్ ఇతర పలు అంశాలు ప్రస్తావనకు వస్తూ ఉన్నాయి. ప్రజలు అత్యంత కీలకమైన విషయాలపై శాంతిభద్రతల ప్రాధాన్యతల క్రమంలోనే వ్యవహరించాలని, సంయమనం వల్లనే సామరస్యం సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు.