యడియూరప్ప స్పష్టీకరణ
బెంగళూరు: వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందే కర్నాటకలో ముఖ్యమంత్రిని మారుస్తారంటూ జోరుగా సాగుతున్న వదంతులను రాష్ట్ర బిజెపి సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటారని, ముఖ్యమంత్రి మార్పుపై పార్టీలో ఎటువంటి చర్చ జరగలేదని బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ప్రస్తుత రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ పదవీకాలం పూర్తయిన తర్వాతే తదుపరి పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ఎంపికపై పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి తాను, మిగిలిన రాష్ట్ర నాయకులు రాష్ట్రమంతా పర్యటిస్తామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి మార్పుపై పార్టీలో ఎటువంటి చర్చ లేదని, అసలు ఆ అవసరమే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఎన్నికలకు మరో ఏడు, ఎనిమిది నెలల ముందు ముఖ్యమంత్రి మార్పు జరిగే అవకాశమే లేదని ఆయన చెప్పారు.