Friday, November 22, 2024

బోనమెత్తుడే

- Advertisement -
- Advertisement -

30న గోల్కొండలో తొలి బోనం జులై 17న
సికింద్రాబాద్, 24న హైదరాబాద్ బోనాలు
26 దేవాలయాల్లో ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల
సమర్పణ అన్ని శాఖలు సమన్వయంతో
పనిచేయాలి రెండేళ్ల తర్వాత ఘనంగా బోనాల
ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు : మంత్రులు
తలసాని, మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి

మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి చాటేలా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై హోంమంత్రి మహమూద్ అలీ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ప్రభుత్వ విప్ ప్రభాకర్‌రావుతో కలిసి ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 30 నుంచి అషాడ బోనాల ఉత్సవాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. 30న గోల్కొండ బోనాలు, జులై 17 న సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు, 18న రంగం, భవిష్యవాణి, 24వ తేదీన హైదరాబాద్ బోనాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జులై 25న ఉమ్మడి దేవాలయాల ఘట్టాలను ఊరేగింపుతో పాటు 28న గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ముగియనున్నాయని వెల్లడించారు.

హైదరాబాద్ బోనాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రెండేళ్లుగా కరోనా కారణంగా బోనాలను ఘనంగా నిర్వహించక లేకపోయాం. ఈ సంవత్సరం ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. బోనాలను వైభవంగా నిర్వహించాలనే ఆలోచనతో ప్రభుత్వం రూ.15 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. వీటితో పాటు వివిధ శాఖల పరంగా మరిన్ని నిధులు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలతో పాటు బస్తీల్లోని దాదాపు 3 వేల దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు.

ఎలాంటి ఆటంకాలు లేకుండా బోనాల ఉత్సవాలను నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో రహదారుల మరమ్మతులు, శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో దేవాలయాల పరిసరాలలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 26 దేవాలయాలలో ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. అమ్మవారి ఊరేగింపు కోసం ప్రభుత్వం అంబారీలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే పూర్తి ఖర్చులను భరిస్తుందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం పలు ప్రాంతాల్లో ఎల్‌ఈడి స్క్రీన్‌లు, త్రీడీ మ్యాపింగ్ లు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. పలు ఆలయాల వద్ద ప్రత్యేకంగా స్టేజీలు ఏర్పాటు చేసి సాంస్కృతిక శాఖ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు తోపులాటకు గురికాకుండా పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రశాంత వాతావరణంలో బోనాల ఉత్సవాలు జరిగేలా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి సిసి కెమెరాల ద్వారా శాంతి భద్రతలను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. భక్తుల కోసం వాటర్ ప్యాకెట్ లను అందుబాటులో ఉంచడం జరుగుతుందని చెప్పారు.

అదే విధంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు, అంబులెన్స్ లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రభుత్వ పరమైన ఏర్పాట్లు అవసరమైతే సంబంధిత అధికారులకు తెలియజేయాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ఉత్సవ ఏర్పాట్లు, నిర్వహణలో సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు పనులను వెంటనే చేపట్టాలని సిఎస్ సోమేష్‌కుమార్ ఆదేశించారు. ఉత్సవాలకు వారం రోజుల ముందే ఆలయాల వద్ద ఏర్పాట్లు పూర్తిచేయాలని సూచించారు. సమావేశంలో విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్‌శర్మ, హోంశాఖ ప్రిన్స్ పల్ సెక్రెటరీ రవిగుప్తా, జిఎడి సెక్రటరీ శేషాద్రి, ఆర్&బి సెక్రెటరీ శ్రీనివాస రాజు, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, బేతి సుభాష్ రెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్, కలెక్టర్‌లు శర్మన్, అమయ్, వాటర్ వర్క్ ఎండి దానకిషోర్, పోలీసు కమిషనర్ లు సివి ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, మహేష్ భగవత్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఆలయ, ఉత్సవ కమిటీల సభ్యులు, నిర్వహకులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News