Saturday, November 23, 2024

నేటి నుంచి బోనాలు

- Advertisement -
- Advertisement -

గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక అమ్మవారికి నేడు తొలి బోనం సమర్పణ
ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రులు
గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు 
బోనాల ఉత్సవాలు తెలంగాణ సబ్బండ వర్ణాల గంగ జమున తెహజీబ్‌కు ప్రతీకలు : ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: భాగ్యనగరం బోనమెత్తేందుకు ముస్తాబయ్యింది. చారిత్రక నగరంలో ఆధ్యాత్మిక సంబురాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గోల్కొండ కోటలో కొలువైన జగదాంబికా అమ్మవారికి నేడే తొలిబోనాన్ని సమర్పించనున్నారు. బోనాల ఊరేగింపు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో బోనాలు ఉత్సవాలు ఆ రంభం కానున్నాయి. అటు పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఆ షాఢం రాగానే మహానగరం ఆధ్యాత్మిక వనంగా మారుతుంది. గల్లీగల్లీల్లో అమ్మవార్లకు బోనాలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఆషాఢంలో వచ్చే తొలి ఆదివారం రోజున గోల్కోండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారు. ఉత్సవాల సందర్భంగా పటిష్ట భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. జిహెచ్‌ఎంసీ, ఆర్కిటెక్ డిపార్ట్‌మెంట్ సమన్వయంతో ఈ భద్రతను ఏర్పాటు చేస్తోంది. 2వేల మంది పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాట్లు చేయగా, గోల్కొండ కోటలో నేడు జరిగే ఉత్సవాల కోసం వెయ్యి మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు.
లంగర్ హౌస్ చౌరస్తా నుంచి గోల్కొండ కోట వరకు 300 నుంచి 400 కెమెరాలు
లంగర్ హౌస్ చౌరస్తా నుంచి గోల్కొండ కోట వరకు దాదాపు 300 నుంచి 400 సిసి కెమెరాలు ఉన్నాయి. గోల్కొండ కోటలో అదనంగా 36 కెమెరాలతో పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. భద్రత ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం మొబైల్ టీంలు, స్పెషల్ టీంలను రంగంలోకి దింపారు. హైదరాబాద్ సిపి అంజనీకుమార్ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. తొట్టెల ఊరేగింపు కొనసాగే బంజారాదర్వాజా, ఫతేదర్వాజా ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. కూడళ్ల వద్ద పికెట్లు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులతో సమావేశమై అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతంగా ఉత్సవాలు జరిగేలా చర్యలు చేపట్టారు. బోనాల ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు ఏర్పాట్లు సిద్ధం చేశారు.
గోల్కొండలో షురూ..
ప్రతిఏటా గోల్కొండ జగదాంబికా ఆలయంలో ప్రారంభమయ్యే బోనాల సంబురం, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో, హైదరాబాద్ పాతబస్తీలోని శాలిబండ అక్కన్న, మాదన్న మహంకాళీ, లాల్ దర్వాజ మహంకాళీ దేవాలయాల్లో మొత్తం 14 ప్రధాన అమ్మవార్ల దేవాలయాల్లో కన్నులపండువగా జరుగుతాయి ఆషాఢమాసంలో జంటనగరాల్లో బోనాల సందడి అంతాఇంతా కాదు. సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి జాతరతో ఈ సంబురం అంబరాన్నంటుతోంది.
ఘటోత్సవం..
కలశంలో అమ్మవారిని ఆవాహనచేసి అత్తింటి నుంచి పుట్టింటికి ఎదుర్కోని రావడమే ఘటోత్సవం. మంగళవాద్యాలు, భక్తుల నృత్యాల నడుమ వైభవంగా అమ్మవారికి స్వాగతం పలుకుతారు.
పోతురాజు..
ఈ పండుగలో ప్రత్యేకమయ్యింది పోతరాజు వేషం. ఒళ్లంతా పసుపు పూసుకుని, ఎర్ర ధోతి కట్టుకుని, చేతిలో కొరఢా పట్టుకుని, కాళ్లకు గజ్జెలు, మెడలో పూలదండ వేసుకుని డప్పుల చప్పుళ్లకు అనుగుణంగా చిందులేస్తూ బోనాల ముందు కదిలివస్తాడు.
రంగం..
బోనాల పండుగ తరువాత రోజు ఉదయం అమ్మవారిని ఆవహించిన అవివాహిత స్త్రీ భవిష్యవాణి వినిపిస్తుంది. భవిష్యత్‌లో జరిగే విషయాలను అమ్మవారి మాటగా పలుకుతుంది. బోనాల సంబురానికి ప్రధాన ఆకర్షణగా రంగం నిలుస్తోంది.
నేటి నుంచి ప్రభుత్వం తరఫున వస్త్రాలు
బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని ఆయా ఆలయాలకు ప్రభుత్వం తరఫున మంత్రులు శ్రీనివాస్‌యాదవ్, మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావులు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. దీనికి సంబంధించి మెమో నెంబర్ 14290/ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ జారీ చేసింది. శ్రీ జగదాంబిక మహంకాళి ఆలయం, గోల్కొండ ఫోర్ట్ (11వ తేదీన), శ్రీ ఎల్లమ్మ పోచమ్మ ఆలయం(బల్కంపేట) (13వ తేదీన), శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం, సికింద్రాబాద్ (25వ తేదీన), శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయం, కార్వాన్ (వచ్చే నెల 01వ తేదీ), శ్రీ సింహవాహిని ఆలయం, లాల్ దర్వాజ (వచ్చే నెల 01వ తేదీ), శ్రీ భాగ్యలక్ష్మి ఆలయం, చార్మినార్ (వచ్చే నెల 01వ తేదీ), శ్రీ మహంకాళి ఆలయం, మీరాలమండి (వచ్చే నెల 01వ తేదీ), శ్రీ నల్లపోచమ్మ దేవి, శ్రీ మహంకాళమ్మ ఆలయం, సబ్జీమండి (వచ్చే నెల 01వ తేదీ), శ్రీ కట్టమైసమ్మ ఆలయం, చిలకలగూడ (వచ్చే నెల 01వ తేదీ), శ్రీ అక్కన్న మాదన్న ఆలయం, హరిబౌలి (వచ్చే నెల 01వ తేదీ)లో ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను మంత్రులు సమర్పించనున్నారు.

Bonalu Festival begins from today in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News