Sunday, December 22, 2024

తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బోనాలు

- Advertisement -
- Advertisement -

భోజనం అనే సంస్కృత పదానికి వ్యావహారిక రూపమే బోనం. అమ్మవారికి సమర్పించే నైవేద్యమే బోనం. ఈ పండుగకు కొత్త కుండలను మాత్రమే వాడుతారు. శుచిగా, పవిత్రంగా అన్నం వండి, ఘటంలో అంటే కుండలో ఉంచుతారు.సదరు ఘటానికి పసుపు, కుంకుమలతో పూజలు చేసి, వేపాకులతో అలంకరిస్తారు. డప్పుచప్పుళ్ల మధ్య మహిళలు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి ఘటాలను సమర్పిస్తారు. ఇలా బోనం తలకెత్తుకున్న మహిళలను అమ్మశక్తికి ప్రతీకగా భావిస్తారు. ఆషాఢమాసంలో అమ్మవారు పుట్టింటికి వెళుతుందన్నది భక్తుల నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో వ్యవహరిస్తారు. భక్తిశ్రద్ధలతో అలాగే ప్రేమానురాగాలతో బోనాలను నైవేద్యం గా సమర్పిస్తారు. దీనిని ఊరడి అని కూడా అంటారు.

ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరంలో బోనాల సందడి ఎక్కువగా కనిపిస్తుంది. బోనాల పండుగ అనగానే తెలంగాణ ప్రాంత ప్రజల మనస్సులు పులకరిస్తాయి. తెలంగాణ సంస్కృతిలో బోనాల ఒక ముఖ్యఘట్టం. తెలంగాణలో అసంఖ్యాక ప్రజలు జరుపుకునే ఆనందోత్సాహాల సంరంభమే బోనాల పండుగ. జంట నగరాలు అమ్మవారి ఆగ్రహాన్ని చవిచూసిన నేపథ్యంలో బోనాల పండుగ ఆవిర్భవించింది. 1869వ సంవత్సరంలో హైదరాబాదు, సికింద్రాబాదు నగరాల్లో ప్రాణాంతకమైన మలేరియా వ్యాధి ప్రబలింది. చూస్తుండగానే, వేలాది మంది ఆ వ్యాధికి బలయ్యారు.ప్రకృతి ప్రకోపాన్ని గమనించిన పెద్దలు, ఆ ప్రకృతిమాతను ప్రసన్నం చేసుకోవడానికి ఉత్సవాలు, జాతరలు జరపాలని నిర్ణయించారు. ఉసురుతీసే ప్రాణాంతక వ్యాధులు తమకు రాకకుండా భక్తజనం అమ్మవారిని వేడుకోవాలని నిర్ణయించుకున్నారు.

దీని కోసం అమ్మను ప్రసన్నం చేసుకోవడానికి బోనం సమర్పించడం ప్రారంభించారు. భాగ్యనగరంలో ప్రతి కూడలిలో అమ్మవారి ఆలయాలను ఆకుపచ్చని తోరణాలతో, జిగెలుమనే విద్యుత్ దీపకాంతులతో శోభాయమానంగా అలంకరిస్తారు. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, బెల్లం, కొన్ని సార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగికుండలలో తలపై పెట్టుకుని, డప్పుల నేపథ్యంలో అమ్మవారి ఆలయానికి వెళతారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక తెల్ల ముగ్గుతో అలంకరిస్తారు. అంతేకాదు దీనిపై ఒక దీపం కూడా ఉంచుతారు.

మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ ఈ అమ్మవారి ఆలయాలన్నిటినీ బోనాల పండుగ సందర్భంగా దేదీప్యమానంగా అలంకరిస్తారు. పూర్వకాలంలోబోనాల పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం దున్నపోతులకు బదులు కోడి పుంజులను, మేకపోతులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. బోనాల పండుగ రోజున మహిళలు పట్టుచీరలు, నగలు ధరిస్తారు. బోనాలను తల మీద పెట్టుకుని తీసుకువెళుతున్న మహిళలను దేవీ అమ్మవారు ఆవహిస్తారన్నది ఒక విశ్వాసం. సహజంగా మహంకాళి అంశ రౌద్రాన్ని పతిబింబిస్తుంది. దీంతో ఆమెను శాంతపరచడానికి ఈ మహిళలు ఆలయాన్ని సమీపించే సమయంలో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళు కుమ్మరిస్తుంటారు.

దేవీ అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి ఈ పండుగ సమూహాన్ని నడిపించడం ఒక ఆనవాయితీ. పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి సహజంగా బలశాలిగా ఉంటాడు. ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు కలిగి, చిన్న ఎర్రని ధోతీని ధరించి డప్పు వాయిద్యానికి అనుగుణంగా నర్తిస్తుంటాడు. బోనాల పండుగలో కీలకమైనది రంగం ఘట్టం. ఈ రంగం కార్యక్రమంలో పోతరాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది. దీంతో ఆగ్రహాన్ని తగ్గించడానికి అక్కడవున్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును అందిస్తారు. పోతురాజు భక్త సమూహం ముందు ఫలహారం బండి వద్ద నర్తిస్తాడు. పోతురాజును పూజా కార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడతాడు. కొరడాతో బాదుకొంటూ, వేపాకులను నడుముకు చుట్టుకుని, అమ్మవారి పూనకంలో ఉన్న భక్తురాండ్రను ఆలయంలోని అమ్మవారి సమక్షానికి తీసుకెళతాడు. భాగ్యనగరంలో కులీకుతుబ్ షాల హయాంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

అప్పటి నుంచి ప్రతి ఏడాది భాగ్యనగరంలో దాదాపు నెల రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. గోల్కొండ ఖిల్లాలోని జగదాంబికా ఆలయంలో జరిగే బోనాలకు అయిదు వందల ఏళ్ల చరిత్ర ఉంది. అలాగే సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి బోనాలకు దాదాపు రెండు వందల ఏళ్ల చరిత్ర ఉంది. భాగ్యనగరంలో ప్రతి ఏటా మొట్టమొదట గోల్కొండ బోనాలతో సందడి షురూ అవుతుంది. అటు నుంచి లష్కర్ బోనాలుగా అందరూ పిలిచే సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి ఈ ఉత్సవాలు చేరుకుంటాయి.

ఎస్. అబ్దుల్ ఖాలిక్
63001 74320

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News