పిల్లలతో తల్లిదండ్రుల జీవనమే ఓ కుటుంబం. బిడ్డ జన్మించగానే తండ్రి వచ్చి ఆ శిశువును చేతుల్లోకి తీసుకొని, ప్రేమగా గుండెల్లో పొదుపుకోవడం… ముద్దూ మరి పెం తీర్చుకోవడం సర్వసాధారణం. ఈ నులివెచ్చటి స్పర్శతో పితృభావనలు ఉప్పొంగుతాయి. ఆప్యాయత, అనురాగపరంగానే కాదు, శాస్త్రీయంగానూ దీనివల్ల అటు తండ్రికి, ఇటు బిడ్డకు ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మాటలకందని అలౌకిక స్పర్శభాషతో తల్లిదండ్రులు పిల్లల మధ్య బంధాలు బలపడుతాయి. పిల్లల భావోద్వేగాన్ని కట్టిపడేయడంలో తండ్రి, ప్రేమతో లాలించడంలో తల్లి వెరసి పిల్లల ఉన్నతమైన భవిష్యత్తుకు దారులు పరుచుకుంటాయి. బాధ్యతగా పెంచడంలోనూ, నడవడిక నేర్పడంలోనూ నాన్న పాత్ర ఎనలేనిది.
తాను ఎంత కష్టపడినా ఫర్వాలేదు కానీ, తన పిల్లలు సంతోషంగా పెరగాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. భారతీయ సమాజంలో తల్లికి ఏ స్థానం ఉందో, తండ్రికి అంతే ప్రాధాన్యం ఉంది. పిల్లలను కనడమే కాదు, వారి తలరాతనూ తీర్చిదిద్దే శక్తి తల్లిదండ్రులకు ఉంది. పసిబిడ్డలకు ఉగ్గుపాలు పట్టించడం దగ్గర్నుంచీ వారికి నడక, నడత, మాటలు, ఆటపాటలు నేర్పించే తొలి గురువులు అమ్మానాన్నలు. బడికి వెళ్లే వయసులో ఎవరైనా తిట్టినా, కొట్టినా బుంగమూతి పెట్టుకుని ఇంటికి వచ్చాక చెప్పుకొనేది తల్లిదండ్రులకే. అలాంటి తల్లిదండ్రుల మధ్య పొరపచ్చలు ఏర్పడటంతో పిల్లల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది.ఒకరికొకరు గౌరవం, బాధ్యతను కలిగి వుండటం కుటుంబం నేర్పిస్తుంది.
కుటుంబం ద్వారా ఏర్పడిన పునాది పిల్లల భవిష్యత్తులో విజయాలపై ప్రభావితం చేస్తుంది. తల్లిదండ్రులుగా పిల్లలకు జీవితంలో ఉత్తమమైన జీవనాన్ని అందించాలని తపన పడుతుంటారు. 1980లలో ఐక్యరాజ్యసమితి కుటుంబానికి సంబంధించిన సమస్యలపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. కుటుంబ సమస్యలు, అవసరాలు తీర్చడానికి సమర్థ వంతమైన మార్గాల గురించి 29 మే 1985 నాటి 1985/29 తీర్మానంలో, కౌన్సిల్ తన నలభై మొదటి సెషన్ తాత్కాలిక ఎజెండాలో ‘అభివృద్ధి ప్రక్రియలో కుటుంబాలు’ అనే అంశాన్ని చేర్చడానికి జనరల్ అసెంబ్లీని ఆహ్వానించింది. ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు, ప్రజాభిప్రాయం పట్ల నిర్దేశింపబడిన సమస్యలపై ప్రపంచ అవగాహనను అభివృద్ధి చేసే ప్రక్రియను ప్రారంభించాలని సెక్రటరీ జనరల్‌ను అభ్యర్థించడంతో అంతర్జాతీయ స్థాయిలో కుటుంబ వ్యవస్థకు గుర్తింపు లభించింది.
దీంతో ప్రతి ఏటా మే 15న ‘అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం’ జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా మెరుగైన జీవన ప్రమాణాలు, సామాజిక పురోగతిని ఆశిస్తున్నప్పటికీ తల్లిదండ్రుల మధ్య ఏర్పడుతున్న భేదాభిప్రాయాలు కుటుంబ విచ్ఛిన్నతికి కారణమవుతున్నాయి. దీంతో బాల్యం చిగురుటాకులా వణికిపోతోంది.
అమ్మానాన్నలు రోజూ దెబ్బలాడుకుంటూనే ఉంటారు. నాన్నకున్న దురలవాట్లు అందుకు కారణం. దీంతో పిల్లలు చదువు మీద దృష్టి నిలపలేకపోతున్నారు. ఒక్కోసారి ఆత్మహత్యా ప్రయత్నాలకు వెనుకాడటం లేదు. తల్లిదండ్రులు పోట్లాడుకునే సమయంలో తమ కదలికలను కన్నబిడ్డలు సునిశితంగా గమనిస్తున్నారని మరచిపోతున్నారు.
కుటుంబంలో మనస్పర్ధలు సాధారణమైనప్పటికీ, బడికి వెళ్లొచ్చిన పిల్లలకు చికాకు తెప్పించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అక్కడ ఎవరు గెలిచినా ఇద్దరి మధ్య చిన్నారులు నలిగిపోతున్నారు. సంసార జీవితంలో సర్దుకుపోలేక కొంతమంది దంపతులు విడిపోయేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ తరహా కేసులు ఏటా 20 శాతం మేరకు జరుగుతున్నాయి. ఆర్థిక స్వేచ్ఛతో తాము ఒంటరిగా జీవించగలమనే ధైర్యంతో విడాకులు పొందేందుకు సంసిద్ధులవుతున్నారు. వారి దాంపత్యానికి గుర్తుగా భూమ్మీదకు వచ్చిన కన్నబిడ్డలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారనే సున్నితమైన అంశాన్ని మరచిపోతున్నారు. తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరి పెంపకంలో ఉండే పిల్లలైనా అభద్రతా భావంతో పెరుగుతున్నారు. ప్రేమ, ఆప్యాయతలకు దూరమైన వారు ఇతర ఆకర్షణలు, ప్రలోభాలకు గురవుతున్నారు.
తల్లిదండ్రుల ఆదరణకు నోచుకోలేని చాలామంది పిల్లలు వీధులు, పాఠశాల గదుల్లో గొడవలు, రహదారులపై కొట్లాటలు, విందు, వినోదాల పేరిట తప్పటడుగులు, మాదకద్రవ్యాల వినియోగం నుంచి వీధి పోరాటాల వరకూ నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు.‘అమ్మా… నువ్వెక్కడున్నా త్వరగా రా. నువ్వు వెళ్లినప్పటి నుంచి నాన్న ఇటువైపు రాలేదు. మమ్మల్ని పట్టించుకోవడం లేదు’ అంటూ చిన్నారుల ఆర్తనాదాలు తరచుగా ఎక్కడినుండో వినిపిస్తూనే ఉన్నాయి. తల్లి ఇల్లు వదిలివెళ్లిన రోజు నుంచి తండ్రి ఇంటికి రాకపోవడంతో బిక్కుబిక్కుమంటున్న పిల్లలు సభ్యసమాజంలో ఎంతోమంది కనిపిస్తున్నారు. ‘అన్నం అడిగితే అమ్మ కొడుతోంది. వేళకు అన్నం పెట్టదు. ఒక్కోసారి నేను తింటుంటే పళ్లెం లాక్కొని విసిరేస్తుంది’ అంటూ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్న పిల్లలు కూడా ఉంటున్నారు. పిల్లలపై మమకారం చూపించకపోవడానికి నాన్న చెడు అలవాట్లు తల్లి మనస్సు మారడానికి కారణమవుతోంది.
మద్యానికి బానిసైన తండ్రులు కన్న కూతుర్ని అమ్మేస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అనారోగ్యం, దుర్భర దారిద్య్రంతో తల్లి మరణించడంతో అమ్మలేని పిల్లల జీవితాలు తెగిన గాలిపటాలవుతున్నాయి. ఇక పెంపుడు తల్లిదండ్రులు పెడుతున్న హింసలు చెప్పనలవికానివి. ఏకంగా కన్నతండ్రి లైంగిక వేధింపులకు గురిచేశాడని ప్రముఖ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ తన బాల్యాన్ని గుర్తు చేసుకోగా, తండ్రి లైంగిక వేధింపులు భరించలేక, మంచం కింద దాక్కొన్న సందర్భాలున్నాయని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మాలివాల్ కూడా తన చేదు అనుభవాన్ని వివరించడం వెనుక ఉత్తమ మహిళలుగా ఎదిగిన వారు ఎంతటి మానసిక క్షోభకు గురయ్యారో అర్థమవుతోంది. ఆలోచించే శక్తి, తెలివితేటలు ఉన్న మనుషులు తమ కడుపున పుట్టిన బిడ్డల్ని చంపి ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు ఇటీవల పెరిగాయి.
కన్నవారి చేతుల్లో హత్యకు గురవుతున్న వారిలో ఐదేళ్లలోపు పిల్లలు ఎక్కువగా ఉంటున్నారని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసెన్ అధ్యయనంలో తేలింది. ఆసియా, మధ్య ప్రాచ్యదేశాలలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు తరుచుగా చోటుచేసుకుంటున్నాయి. తల్లిదండ్రులు పిల్లలను తమ ఆస్తిగా భావిస్తుండడం వల్ల, వారిపై సర్వహక్కులు తమకే ఉన్నాయన్న మానసిక స్థితి తమ పిల్లలను చంపడానికి కారణమవుతోందని తరుణీ స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. కన్నవారి ఆప్యాయత మధ్య పెరిగే బాల్యం ఆత్మవిశ్వాసంతో ఎదుగుతుందని తల్లిదండ్రులు తెలుసుకొని పిల్లలు ఒంటరితనానికి గురికాకుండా చూడాలి. తల్లిదండ్రుల గొడవల్లోంచి అధిగమించి బయటపడటం గురించి ఆలోచించే మానసిక స్థయిర్యాన్ని అందివ్వాలి. మానసికంగా, ఆర్థికంగా స్థిరపడటానికి ప్రయత్నించేలా తీర్చిదిద్ది, సమాజంలో నిలబడగలిగేందుకు గట్టి పునాదిని వేయాలి.
– కోడం పవన్‌కుమార్ -98489 92825