బెంగళూరు డాక్టర్ల ఘనత
బెంగళూరు: పాకిస్తాన్‌కు చెందిన ఒక రెండున్నరేళ్ల చిన్నారికి నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బోన్ మ్యారో మార్పిడి(బిఎంటి) విజయవంతంగా జరిగింది. కరాచీకి చెందిన క్రికెట్ కామెంటేటర్ సికందర్ బక్త్ కుమార్తె అమీరా సికందర్ ఖాన్ ఇటీవల బెంగళూరులోని నారాయణ హెల్త్‌కేర్ ఆసుపత్రిలో బోన్ మ్యారో మార్పిడి చికిత్స ద్వార మ్యూకోపాలిసాచ్చరిడోసిస్ టైప్ 1(ఎంపిఎస్ 1) వ్యాధి నుంచి కోలుకుంది. ఎంపిఎస్ 1 అనే వ్యాధి అత్యంత అరుదైనదని, ఇది కళ్లు, మెదడుతోసహా అనేక అవయవాల పనితీరును దెబ్బతీయగలదని ఆసుపత్రి చైర్మన్, వ్యవస్థాపకులు దేవి షెట్టి బుధవారం విలేకరులకు తెలిపారు. తండ్రి దానం చేసిన బోన్ మ్యారోను ఉపయోగించి రెండేళ్ల ఆరు నెలల అమీరాను కాపాడినట్లు ఆయన చెప్పారు. ఎంపిఎస్ 1 వ్యాధి వల్ల శరీరంలో ఒక ఎంజైమ్ మాయమవుతుందని, ఆ ఎంజైమ్ లోపం కారణంగా రోగి శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుని కాలేయం, ప్లీహం(స్లీన్) పెరగడంతోపాటు ఎముకలలో మార్పులు వస్తాయని ఆ చిన్నారికి చికిత్స అందచేసిన డాక్టర్ సునీల్ భట్ తెలిపారు. ఈ వ్యాధితో బాధపడే రోగులు 19 ఏళ్ల వయస్సు వచ్చేసరికి అంగవైకల్యం చెందుతారని, తమ రెండు పదుల వయసులోనే మరణిస్తారని ఆయన చెప్పారు. అత్యంత అరుదైన ఈ వ్యాధికి బోన్ మ్యారో మార్పిడి ఒక్కటే సరైన చికిత్స అని ఆయన వివరించారు.