Sunday, January 19, 2025

అలరించిన దక్షిణ భారత భాషల సాహిత్య సమ్మేళనం

- Advertisement -
- Advertisement -

సాహిత్య సృజన ఏ భాషలో ఉదయించినా చదువరుల హృదయాల్లో వికసిస్తూనే వుంటుందని బెంగళూరులో ఆగస్టు 9, 10, 11 తేదీల్లో జరిగిన దక్షిణాది రచయితల ‘బుక్‌బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్’లో ఈ మూడు రోజులు పాల్గొన్నప్పుడు మళ్ళీ మళ్ళీ తోచింది. ‘బుక్‌బ్రహ్మ’ గత ఐదేళ్ళుగా సాహిత్యంలో అనేక కార్యక్రమాలని నిర్వహిస్తున్న గ్లోబల్ డిజిటల్ వేదిక. దక్షిణాది భాషా రచయితలను, ప్రచురణకర్తలను ప్రతి ఏటా కలిస్తే బాగుంటుందని, కొత్త దారులకు వెలుగవుతుందని ‘బుక్‌బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్’ నిర్వాహకులు సతీశ్ చప్పరికె భావించారు. వారి సంకల్ప బలం ఉన్నతమైనదవటంతో దక్షిణాది భాషల సాహిత్యోత్సవం ఎంతో కోలాహలంగా, ఆలోచనాత్మకంగా జరిగింది.

దాదాపు రెండు వందలకి పైగా వక్తలు తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల నుంచి ‘బుక్‌బ్రహ్మ సాహితీ ఉత్సవం’లో పాల్గొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈ ఉత్సవంలో పాల్గొనవచ్చు. అలా ఎంతో మంది తెలుగు సాహితీకారులు, సాహిత్య అభిమానులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. సాహిత్యం పట్ల ఉన్న గౌరవంతో ఈ బెంగుళూరు కార్యక్రమానికి అనేక వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు ప్రాయోజకత్వం ఇచ్చాయి. ఎంతోమంది విద్యార్థులు, యువతీ యువకులు స్వచ్ఛందంగా, ఉత్సాహంగా పని చేశారు. వందలాదిమందికి వసతినిచ్చిన ప్రాంగణం పువ్వులతో… మొక్కలతో… చెట్లతో కళకళలాడుతూ ఉంది. బోలెడన్ని పక్షుల సన్నని రాగాలు.

ఇంత పెద్ద సాహితీ ఉత్సవం నిర్వహణతో ఎంతో బిజీగా ఉన్నా, వచ్చిన ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, ఆహ్వానించారు ‘బుక్ బ్రహ్మ’ నిర్వాహకులు సతీశ్ చప్పరికె. అలానే తెలుగుకి క్యూరేటర్‌గా వ్యవహరించిన విలువైన కవి, అనువాదకులు, చక్కని చదువరి అజయ్ వర్మఅల్లూరి తెలుగు నుంచి ఈ కార్యక్రమంలో వక్తలుగా పాల్గొనటానికి ఆహ్వానించిన వారిని, ఆసక్తి, అభిమానంతో ఉత్సాహంగా ఈ సభలకి వచ్చిన రచయితల్ని, సాహితీ పాఠకుల్ని, అభిమానుల్ని సంతోషంగా ఆహ్వానిస్తూ అందర్నీ చాలా చక్కగా చూసుకుంటూ, ఎవరూ కొత్తప్లేస్‌లో ఉన్నామని ఫీల్ కాకుండా కంఫర్ట్‌గా ఫీల్ అయ్యేట్టు అందర్నీ వారు చూసుకున్న పద్ధతి ఎంతో ప్రశంసనీయం.

వాలంటీర్స్ అయితే మనం దేనికీ తడుముకోనక్కరలేకుండా ఎంతో తోడూ నీడగా వున్నారు. దక్షిణాది రచయితలు అనేక వేదికలపై వారివారి భాషలోనే వారి గొంతుని స్పష్టంగా వినిపించారు ‘బుక్‌బ్రహ్మ’ లిటరేచర్ ఫెస్టివల్లో కొన్ని వేదికల మీద నాలుగు భాషల రచయితలు ఇంగ్లీషులో తమ గొంతుని వినిపించారు. కన్నడ సాహిత్య, సాంస్కృతిక, ఆతిథ్య అభిరుచులు, రుచులూ ఈ సాహిత్యోత్సవంలో ఎంతోమందికి అనుభవంలోకి వచ్చాయి. గొప్ప సృజనకారులైన రచయితల్ని కలుసుకోవటం, మాట్లాడటం, వినటం విలువైన అనుభవం. ప్రారంభ వేదిక మీద హెచ్. ఎస్.శివ ప్రకాష్, జయమోహన్, ఓల్గా, వివేక్ శానభాగ్, కె. సచ్చిదానందన్ ప్రసంగించారు.

‘తెలుగు అనువాదాలు కొత్త ఒరవడి’ అనే అంశం మీద కాత్యాయిని, పూర్ణిమా తమ్మిరెడ్డి, అవినేని భాస్కర్, ధూర్జటి వెంకట శుభశ్రీ అనువాదాలు చెయ్యటంలోని విషయాల్ని వీలైనంత వివరంగా మాటాడారు. ‘స్త్రీవాదం నుండి దళిత స్త్రీవాదం వైపు’ అనే అంశం మీద చల్లపల్లి స్వరూపరాణి, జూపాక సుభద్ర, ఎం.ఎం. వినోదిని, మానస ఎండ్లూరి వారివారి అభిప్రాయాల్ని పంచుకున్నారు. ‘సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్: ది క్వశ్చన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్’ అనే అంశం మీద జరిగిన ప్యానల్ డిస్కషన్‌లో పాల్గొన్న ఒ.ఎల్. నాగభూషణ స్వామి, పాల్ జకారియా, పెరుమాళ్ మురుగన్, వాడ్రేవు చినవీరభద్రుడు, ప్రతిభా నందకుమార్ ప్రస్తుతం ఆయా భాషలు ఎదుర్కొంటున్న సవాళ్ళు, వస్తున్న మార్పుల్ని, బలాల్ని చర్చించారు. సమకాలీన తెలుగు నవల మీద అక్కినేని కుటుంబరావు, కె.ఎన్. మల్లీశ్వరి, ఉణుదుర్తి సుధాకర్, అరవింద్ ఎ.వి. సమకాలీన తెలుగు నవల ఎలా వుందో వివరించారు.

‘తెలుగులో స్త్రీల ఆత్మకథలు’ మీద సి. మృణాళిని, కాత్యాయిని విద్మహే, కె.ఎన్. మల్లీశ్వరి, పి. జ్యోతి మాట్లాడారు. ఈ సమావేశంలో ఆత్మకథలు రాసేటప్పుడు ఏయే విషయాలు సెన్సార్ చేసుకుంటున్నారు, కొన్నిసార్లు ఎందుకు సెన్సార్ చేసుకోవాలో… తెగింపు ధోరణితో వ్యక్తీకరించినంత మాత్రాన ఆ ఆత్మకథ విలువైనదవుతుందా అనే విషయాలు చర్చకు వచ్చాయి. ‘మీడియా ప్రిజెర్వ్‌స్ లిటరేచర్ అండ్ కల్చర్’ అంశం మీద మయూర శ్రేయామ్స్ కుమార్, కె. శ్రీనివాస్, ఎస్.ఆర్. రామకృష్ణ, బాగేశ్రీ తమ విలువైన గమనింపుల్ని చెప్పారు.

‘తెలుగు సబాల్టర్న్ స్వరాలు’ అంశం మీద జరిగిన చర్చా కార్యక్రమంలో గోగు శ్యామల, మల్లిపురం జగదీశ్, వేంపల్లి షరీఫ్, రమేష్ కార్తీక్ నాయక్ సంభాషించారు. ఈ ఏడాది యువ పురస్కారం పొందిన రమేష్ కార్తిక్ నాయక్ సమావేశాన్ని నిర్వహించారు. మల్లిపురం జగదీశ్ కొండప్రాంతాల్లోకి మందుల కంటే ముందుగా మందు బుడ్డీలు వస్తున్నాయని తమ ప్రాంతపు సమస్యల్ని, పరిస్థితుల్ని వివరిస్తూ, తన మట్టిని గురించి, తన వాళ్ళను గురించి రాయడమే తన కర్తవ్యమని అన్నారు. ‘తెలుగు కథా ప్రపంచం’ అంశం మీద వివినమూర్తి, మహమ్మద్ ఖదీర్ బాబు, కుప్పిలి పద్మ, పూడూరి రాజిరెడ్డి తెలుగు కథా విభిన్న ప్రపంచాల్ని పంచుకున్నారు. ఇప్పటి వరకూ ఉన్న కథ, కథకుల ముందున్న సవాళ్ళు మొదలుగు విషయాల్ని చర్చించారు.

‘నోవెల్: ఎ సెలబ్రేటెడ్ ఫార్మ్?’ అనే అంశం మీద ఓల్గా, పెరుమాళ్ మురుగన్, బెన్యమిన్, వసుధేంద్ర మాట్లాడారు. ఓ వేదిక మీద ‘భారతదేశపు పుస్తక ప్రచురణ’ పై జరిగిన సమావేశంలో కణ్ణన్ సుందరం, వసుధేంద్ర, గీతా రామస్వామి, డి.సి.బుక్స్ రవి పాల్గొని ఆయా భాషలకు సంబంధించిన నేటి స్థితిగతులని పంచుకుంటూ యువత పుస్తకాలు చదవటంలేదని ఎవరైనా మాటాడితే యువతకి వాళ్ళు దూరంగా ఉన్నట్టేనన్నారు కణ్ణన్.

మలయాళీ చదువర్ల సాహితీ తృష్ణకి ఈ సంఘటన ఓ ఆనవాలు. కరోనా సమయంలో పుస్తకాల అమ్మకాన్ని కొనసాగించడానికి స్విగ్గీతో ఒప్పందం చేసుకుని ఆహార పదార్థాలతో పాటు పుస్తకాలనూ అమ్మేరు. కరోనా సమయంలో పుస్తకాలను నిత్యావసరమైనవిగానే కేరళ ప్రభుత్వం పరిగణించింది. పుస్తకాల షాపులు, సెలూన్లు తెరిచే ఉంచినప్పుడు అలా ఉంచటం చట్టానికి వ్యతిరేకమని కేంద్రం హెచ్చరికలు చేసినప్పుడు సెలూన్లను మాత్రమే మూసివేశారు. ఈ సంఘటన కేరళలో పుస్తకాలు చదివేవారి ప్రత్యేకమైన చూపుని దర్శింపచేసింది.

ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు జరిగేవి. ఆదివారం ఉదయం ఎనిమిదిన్నరకు వెంకటేశ్ కుమార్ హిందుస్థానీ సంగీత కచేరీకి ఆడిటోరియం కిక్కిరిసిపోయింది. కన్నడ శైవవచనాల ఆలాపనల ఆ మధుర సంగీతంలో హృదయం ఆనందమయూరమై దాదాపు పదినిమిషాల స్టాండింగ్ వొవేషన్‌తో సంతోషాన్ని, కృతజ్ఞతని వారికి కానుక చేశారు శ్రోతలు. ఆ తరువాత అదే ఆడిటోరియంలో ప్రకాశ్‌రాజ్ అద్భుతమైన ఏకాభినయం.

తన బృందం నేపథ్యసంగీతం అందిస్తుంటే దక్షిణ భాషలలోని ప్రసిద్ధ కవిగీతాలను ఆలాపిస్తుంటే ముగ్ధులయ్యాము. అన్ని భాషలలోనూ వారి సందేశం మాట్లాడమనడమే. ‘ఆడు, మాతాడు’! అంటుంటే ఎంతో ఉద్వేగం… స్ఫూర్తి ఉరకలేసింది. శ్రీశ్రీ కవితను భావావేశంతో చదివినప్పుడు మనసు పులకించింది. శ్రీశ్రీ గారి కవితకి చివర్లో తెలుగు వారు గొంతు కలిపాము. హాలంతా కరతాళధ్వనులు ప్రకాష్ రాజ్ ‘ఆడు, మాతాడు’కి. జయమోహన్ కథలని తెలుగులోకి అవినేని భాస్కర్ అనువదించిన ఛాయా వారు ప్రచురించిన ‘నెమ్మి నీలం’ ఆవిష్కరణ సభలో వివేక్ శానభాగ్, వసుధేంద్ర, మృణాళిని మాట్లాడారు. తెలుగు రచయితలు, సాహితీ అభిమానులు ఈ సమావేశాల్లో జయమోహన్‌తో మాట్లాడారు. కథల పుస్తకం మీద ఆటోగ్రాఫ్ తీసుకున్నారు.

‘బుక్ బ్రహ్మ సాహిత్య పురస్కారం 2024’ జయమోహన్‌కి అందచేసిన కార్యక్రమంలో సతీష్ చప్పరికె, హంపా నగరాజయ్య, మల్లేపురం జి వెంకటేష్, నరహహళ్ళి బాలసుబ్రహ్మణ్య పాల్గొన్నారు. జయమోహన్, శివప్రకాష్, వివేక్ శానభాగ్, గిరీశ్ కాసరళ్ళి, పెరుమూళ్ మురుగన్, బెన్యమిన్‌గార్లని వినటం భలే సంతోషంగా అనిపించింది. ఈ ఉత్సవాన్ని ప్రతి ఏటా కొనసాగించాలని నిర్వాహకుల ఆకాంక్ష. అంటే ఇక నుంచి ప్రతి ఏటా ఆగస్టులో దక్షిణాది భాషల రచయితలు కలవబోతున్నారు. ఈ తలపోత చాలా విలువైనది. అవసరమైనది. వాలంటీర్‌గా వచ్చి డిగ్రీ చదువుకుంటున్న యువతి ‘ఇటువంటి సాహిత్య సభలూ, రచయితలు నాకు కొత్త. ఇదంతా చాలా ఉత్సాహంగా, ఆశ్చర్యంగా అనిపించింది. వేరే భాషల్లోవి కూడా చదవాలనే ఆసక్తి కలిగింది.’ అన్నారు.

కొత్త తరం రచయితలూ పాఠకులూ ఇటువంటి సాహిత్య సుసంబరాల నుంచి జనిస్తారు అనడానికి ఇంతకంటే ఆనవాలు ఏం కావాలి? చదువరిగానే ఆమె ఆగకపోవచ్చు.ఈ ఉత్సవానికి వచ్చిన యువతీ యువకుల్లో ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ఈ బుక్ బహ్మ ఇచ్చిన స్ఫూర్తితో రాయాలనిపించింది అని భవిష్యత్తులో చెప్పటం మనం వింటామనిపించింది. సంతోషమేసింది. దక్షిణాది భాషల మేలిమి సాహిత్య స్నేహ స్ఫూర్తిని దేదీప్యమానంగా వెలిగించే ఆలోచన చేసి ఆచరణలోకి తీసుకొచ్చిన ‘బుక్ బ్రహ్మ’ సతీశ్ చప్పరికెకు, వారి టీమ్‌కి అభినందనలు. శుభాకాంక్షలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News