కూతురుపై తండ్రి పైశాచికం
వైరుతాడుతో కొట్టి, నేలకేసి చితకబాదిన వైనం
సోషల్ మీడియాలో వైరల్, తండ్రిపై కేసు నమోదు
మనతెలంగాణ/మెదక్ అర్బన్: కన్నతండ్రే పసిపాపపై రాక్షసత్వంతో విచక్షణ కోల్పోయి వైరు తాడుతో కొట్టడమే కాకుండా పలుసార్లు నేలకేసి బాదాడు. ఆ దృశ్యాలను పక్కింటివారు వీడియో చిత్రీకరించగా అట్టి వీడియో జిల్లాలో వైరల్‌గా మారింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లగా సోమవారం కసాయి తండ్రి నాగరాజుపై కేసు నమోదు చేస్తున్నట్లు డిఎస్పీ సైదులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగరాజు అనే వ్యక్తి మెదక్ మున్సిపాలిటీలో చెత్త తోలే ట్రాక్టర్‌కు డ్రైవర్‌గా అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇతనికి గతంలో కామారెడ్డి జిల్లా పోల్కంపేట గ్రామానికి చెందిన మౌనికతో వివాహం జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల పాప గగణశ్రీ, మూడు సంవత్సరాల కుమారుడు ఉన్నారు.
కుటుంబ కలహాలతో మౌనిక నాగరాజును వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టగా తిరిగి కాపురానికి ఒప్పుకుని వినాయక చవితి పండగకు ఇంటికి వచ్చింది. అప్పటికే నాగరాజు మరొక స్త్రీతో సహజీవనం గడుపుతున్నాడు. ఆమెను గుట్టుచప్పుడు కాకుండా మరొక అద్దె ఇంట్లో ఉంచి వ్యవహారం కొనసాగిస్తున్నాడు. ఈ తరుణంలో ఆదివారం తన కూతురు గగణశ్రీతో కలిసి తాను సహజీవనం గడుపుతున్న మరొక యువతి ఉంటున్న ఇంటికి వెళ్లి అక్కడ తన భార్యపై ఉన్న కోపంతో కూతురును విచక్షణ రహితంగా కొట్టడమే కాకుండా నేలకేసి బాదాడు. ఇదంతా తనతో సహజీవనం గడుపుతున్న యువతి చూస్తూ పైశాచిక అనందాన్ని పొందిందేగాని కనీసం మానవత్వంతో ఆపలేకపోవడం పలువురిని కంటతడి పెట్టించింది. చిన్నారి పట్ల వీరు వ్యవహరించిన తీరు చాలా బాధాకరమైనదని పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని పక్కనే ఉన్నవారు వీడియో చిత్రీకరణ చేసి వాట్సాప్‌లలో పోస్టు చేయగా విషయం ఊరంతా పొక్కింది. దీంతో పోలీసులు స్పందించి చిన్నారిపట్ల రాక్షసుడిగా వ్యవహరించిన తండ్రి నాగరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని డిఎస్పీ సైదులు తెలిపారు.
Booked case filed against man hit his daughter in Medak