Saturday, November 23, 2024

దళితబంధుతో దళితుల జీవితాల్లో వెలుగులు

- Advertisement -
- Advertisement -

నిర్మల్: అట్టడుగున ఉన్న దళితులు శాశ్వత ఉపాధి పొంది ఆర్థిక ఎదగాలనే ఉద్దేశ్యంతో సియం కెసిఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం బుధవార్‌పేట్ లో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు అటవీ పర్యావరణ , న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సియం కెసిఆర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం కొరకు అనేకమైన పథకాలను ప్రవేశపెట్టి నేరుగా ప్రజలు లబ్ధి పొందే విధంగా కృషి చేస్తున్నారని అన్నారు. అదే విధంగా దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ దళితబంధు పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. ప్రతి దళిత కుటుంబానికి లబ్ది చేకూర్చాలన్న సదాశయంతో ప్రభుత్వం దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని పేర్కొన్నారు.

దళితబంధుతో అనేక మంది దళితులు ఆర్థికంగా వృద్ధి సాధించారని, కూలీ నాలీ చేసుకునే రోజులు పోయాయని చెప్పారు. అనేక మంది తమ యూనిట్లను ఏర్పాటు చేసుకుని తమ కుటుంబ సభ్యులకు కూడా ఉపాధి కల్పిస్తున్నారని వెల్లడించారు. నిర్మల్ నియోజకవర్గానికి 11 వందల యూనిట్లు మంజూరయ్యాయని తెలిపారు. నిరుపేదలైన 11 వందల కుటుంబాలు ప్రత్యక్షంగా లబ్ధిపొందనున్నాయని, దీంతో ఇన్నేళ్లు ఒకరి దగ్గర పని చేసిన దళితులు తమే యాజమానులుగా మారి ఇంకో నలుగురికి ఉపాధి చూపుతున్నారని వివరించారు. అయితే యూనిట్ల ఎంపిక విషయంలో లబ్ధిదారులకే పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని, వారికి అనుభవం ఇష్టం కలిగి ఉన్న రంగాల్లో యూనిట్లను నెలకొల్పేందుకు తోడ్పాటును అందించాలని అధికారులకు సూచించారు. మార్కెట్ స్థితిగతులు, లాభనష్టాల గురించి అన్ని అంశాలను పరిశీలించాకే లబ్ధిదారులు తమకో ఏది లాభదాయకమో ఆలోచించి యూనిట్లను నెలకొల్పాలని చెప్పారు.

తెలంగాణలో రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహనీయుడు డాక్టర్ బాబా సాహెబ్ ఆశయాలకు అనుగుణంగా దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆయన సేవలకు గుర్తుగా నూతన సచివాలయానికి డాక్టర్. బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టామని గుర్తు చేశారు. అంతేకాకుండా భారతదేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నామని ఏప్రిల్ 14న ఆయన విగ్రహాన్ని ప్రారంభించుకుంటున్నామని, ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.మరోవైపు మతం, కులం పేరుతో కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం సమాజంలో విభజన తెస్తుందని బడుగు బలహీన వర్గాలను నిర్లక్షం చేస్తుందని చెప్పారు. దళితుల మీద ప్రేమ ఉంటే నూతనంగా నిర్మించుకున్న పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టరని ప్రశ్నించారు.

అంబేద్కర్ పేరు పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మరోవైపు అన్ని కులాలను గౌరవిస్తూ , ప్రతి ఒక్కరు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. పేద ప్రజలు వివాహ ఇతర శుభ కార్యాలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి గ్రామాలు, పట్టణాల్లో బీసీ, ఎస్సీ, మైనార్టీ కమ్యూనిటీ హాళ్ళ నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News