Tuesday, November 5, 2024

కలవర పెడుతున్న విష జ్వరాలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో విషజ్వరాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండటం, పారిశుద్ధ లోపం కారణంగా వైరల్ ఫీవర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దాంతో ఆసుపత్రుల ముందు జనాలు క్యూ కడుతున్నారు. వీటితో పాటు మలేరియా, డెంగీ అనుమానిత కేసులు వెలుగుచూస్తుండటం ఆందోళనకు గురిచేస్తున్నాయి. వీటికి ప్రధాన కారణం దోమలు, పారిశుద్ధ్య లోపం. సీజనల్ వ్యాధులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. వర్షాలు, పారిశుద్ధ లోపం కారణంగా వచ్చే విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌తో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

వైద్య సేవలు, తీసుకోవాల్సిన చర్యలపై వైద్యాధికారులకు తగిన సూచనలు ఇవ్వడం, జిల్లాలలో విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా జ్వరాలు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపడుతోంది. నివారణ చర్యలు చేపడుతూనే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, ఎక్కువగా దాహం వేయడం, రుచి, వాసన తెలియకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్షం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకుని, చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

దోమల సంతానోత్పత్తికి ఇవే కారణాలు..
ఎక్కడ నీళ్లు నిల్వ ఉంటే అక్కడ డెంగీ దోమలు సంతానోత్పత్తి చేస్తుంటాయి. ఉదాహరణకు ఇంటి ఆవరణలో కొబ్బరి చిప్పలు, పాత నీళ్ల బాటిళ్లు, టైర్లు, పెంకులు ఇలా రకరకాల వస్తువుల్లో నీళ్లు నిల్వ ఉంటే లార్వా వృద్ధి చెందుతుంది. ఇలాంటి ప్రాంతాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో నీళ్లు నిల్వ ఉండటం వల్లనే దోమలు వ్యాపించి, వాటి ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సంక్రమిస్తాయని చెబుతున్నారు. ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుని, దోమలు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News