తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన తెలంగాణ టైగర్ ఆలే నరేంద్ర వర్థంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ దేశం, ధర్మం, డెవలప్మెంట్ అంశాలతో పరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. దేశంలో అత్యధిక కుటుంబాలు జీవిస్తున్నది ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌పై ఆధారపడేనని అన్నారు. ఈ రంగమే జీడీపీలో ప్రధానపాత్ర పోషిస్తుందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మెన్నుముక లాంటిది ఎంఎస్‌ఎంఈ సెక్టార్ అని అన్నారు.
ఎంఎస్‌ఎంఈ రంగంలో భాగంగా ఎలాంటి పూచీకత్తు లేకుండా ముద్ర లోన్లను ప్రవేశపెట్టారని అన్నారు. దేశంలో మోదీ ప్రభుత్వంలో 52 కోట్ల మంది చిన్న పారిశ్రామికవేత్తలకు రూ.32 లక్షల కోట్లు సెబీ బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేయడంతో కోట్లాది మంది ఉపాధి పొందడంతో పాటు మరికొంత మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 71 సంవత్సరాల పాలనలో ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూసిందన్న ఆయన మోడీ మాత్రం శక్తీకరణ చేస్తున్నారని తెలిపారు.