కరోనా వైరస్ పరిస్థితే కారణం
లండన్: భారతదేశంలో కరోనా వైరస్ పరిస్థితి దృష్టా ముందుగా నిర్ణయించినప్రకారం వచ్చే వారం జరగవలసి ఉన్న తన భారత పర్యటనను బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రద్దు చేసుకున్నారు. దీనికి బదులుగా ఈ నెలలోనే బ్రిటన్-భారత్ భవిష్యత్ భాగస్వామ్యంపై వర్చువల్ విధానంలో భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన చర్చలు జరుపుతారని బ్రిటిష్, భారత ప్రభుత్వం తరఫున ఒక సంయుక్త ప్రకటన సోమవారం ఇక్కడ వెలువడింది.
ఈ ఏడాదిలోనే బ్రిటన్, భారత్ ప్రధానమంత్రులు ప్రత్యక్షంగా సమావేశమవుతారని కూడా ఆ ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ ప్రస్తుత పరిస్థితి కారణంగా బోరిస్ జాన్సన్ వచ్చే వారం భారత్‌కు ప్రయాణించే పరిస్థితిలో లేరని అందులో తెలిపారు. బ్రిటన్, భారత్ మధ్య భవిష్యత్ భాగస్వామ్యానికి చెందిన ప్రతిపాదనలపై వారిద్దరూ వర్చువల్‌గా చర్చించిన అనంతరం వారిరువురూ తరచు సంప్రదింపులు జరుపుతూ దీన్ని ముందుకు తీసుకెళతారని ప్రకటన పేర్కొంది.