లండన్ : బ్రిటన్‌లో లాక్‌డౌన్ ఆంక్షలను తొలగించే ప్రయత్నంలో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అనేక చర్యలు తీసుకునే యోచనలో ఉన్నారు. ఈమేరకు కొవిడ్ పాస్ పోర్టుల ద్వారా సామూహిక కార్యక్రమాలను, ట్రాఫిక్ లైట్స్ సిస్టమ్ ద్వారా విదేశీ ప్రయాణాలను అనుమతించడానికి ప్రణాళిక రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ప్రణాళికలు ఖరారుకు కేబినెట్ సమావేశం నిర్వహించిన తరువాత జాన్సన్ పాత్రికేయుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తారు. రానున్న నెలల్లో నిర్వహించనున్న వివిధ కార్యక్రమాలకు, క్రీడలకు తగిన వెలుతురు, వెంటిలేషన్ ఉండేలా పరిశీలించడంతోపాటు కార్యక్రమాలు ఆరంభం లోను, ముగిసిన తరువాత ప్రేక్షకులకు కరోనా పరీక్షలు చేస్తారు. దీనికి కొవిడ్ స్టాటస్ సర్టిఫికేషన్ అనే పద్ధతిని అనుసరించడానికి నమూనా స్కీమ్‌లు ప్రవేశ పెడతారు. విదేశీ ప్రయాణాలను అనుమతించడానికి కొవిడ్ రిస్కు స్థాయిల బట్టి దేశాలను ఎరుపు, జేగురు పసుపు, ఆకుపచ్చ రంగుల కింద విశ్లేషిస్తారు. దీన్ని ట్రాఫిక్ లైట్స్ సిస్టమ్‌గా రూపొందించారు. ఇవన్నీ కేబినెట్ సమావేశంలో చర్చించిన తరువాత అమలు చేస్తారు.