Thursday, January 16, 2025

బోరిస్ జాన్సన్ నిష్క్రమణ

- Advertisement -
- Advertisement -

Corona again in india చాలా పెనగులాట తర్వాత బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అత్యంత అయిష్టంగా రాజీనామా సమర్పించారు. తాను తప్పు చేసినట్టు ఒప్పుకోలేదు. తన పాలన బాగా సాగుతున్నప్పటికీ, అనేక సమస్యల పరిష్కారంలో ముందుకు వెళుతున్నప్పటికీ పార్టీ తనను వంచించి ఈ స్థితికి నెట్టివేసిందని బ్రిటన్ ప్రజలకు తెలియజేసుకుంటూ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. పాలక కన్సర్వేటివ్ పార్టీ కొత్త నాయకుడిని ఎంపిక చేసే వరకు పదవిలో కొనసాగుతానని అన్నారు. అందుకు కనీసం ఆరు వారాల సమయం పడుతుందని భావిస్తున్నారు. ఆలోగా విధానపరమైన నిర్ణయాలేమీ తీసుకోకుండా వుంటానని జాన్సన్ హామీ ఇచ్చారు. కొత్త ప్రధాని ఎన్నిక అధికార పార్టీలోనే జరగవలసి వుంది. అది సుదీర్ఘ ప్రక్రియ. ప్రభుత్వానికి పన్నులు సవ్యంగా కట్టిన పార్టీ సభ్యులందరూ ప్రధాని పదవి పోటీలో పాల్గోవచ్చు. పార్టీ పార్లమెంటు సభ్యులు ఈ ఎన్నికలో పాల్గొంటారు. అతి తక్కువ ఓట్లు పడే అభ్యర్థిని తొలగిస్తూ పోతూ అనేక విడతలుగా ఈ ఎన్నిక జరుగుతుంది. ఇద్దరే ఇద్దరు అభ్యర్థులు బరిలో మిగిలిన తర్వాత వారి మధ్య అంతిమ పోటీ వుంటుంది.

చివరి పోటీలో దేశంలోని కన్సర్వేటివ్ పార్టీ సభ్యులందరూ ఓటు వేస్తారు. వారు లక్ష 80 వేల మంది వరకు వుంటారు. పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకుంటారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. అందుచేత మరి కొంత కాలం ప్రధాని పదవిలో కొనసాగాలని బోరిస్ జాన్సన్ కోరుకుంటున్నారు. ఈయనకు ముందరి ప్రధాని థెరిసా మే రాజీనామా చేసిన తర్వాత నెల రోజులకు పైగా ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగా రు. బోరిస్ జాన్సన్ తొలగిపోవాలని కోరుతూ దాదాపు 60 మంది మంత్రులు రాజీనామా చేశారు. ప్రధానిగా కొనసాగాలనే ఉద్దేశంతో వారందరి స్థానంలో కొత్త మంత్రులను కూడా జాన్సన్ నియమించారు. కాని పార్టీలో ఆయనకు ఎదురుగాలి తీవ్రంగా వీస్తున్నది. తనపై వచ్చిన ఆరోపణల విషయంలో తరచూ అబద్ధాలు ఆడాడని, నియమ ఉల్లంఘనలకు పాల్పడ్డారని దాని వల్ల పార్టీ ప్రతిష్ఠ దిగజారిపోయిందనే అభిప్రాయం గూడు కట్టుకున్నది.

బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ మూడేళ్ళ పాటు ఉన్నారు. యూరపు యూనియన్ నుంచి దేశం విడిపోయే కార్యక్రమాన్ని గమ్యానికి చేర్చడంలో విఫలమై థెరెసా మే ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత పార్టీ విశ్వాసాన్ని చూరగొని జాన్సన్ అధికారంలోకి వచ్చారు. అతి క్లిష్టంగా తయారైన బ్రెగ్జిట్ అనిశ్చితి నుంచి దేశాన్ని జాగ్రత్తగా గట్టెక్కించడంలో సఫలమై చరిత్ర సృష్టించారు. ఆ క్రమంలో 2019 లో పార్లమెంటుకు ఆకస్మిక యెన్నికలు కూడా జరిపించారు. అందులో కన్సర్వేటివ్ పార్టీ ఘనమైన విజయం సాధించింది. 80 స్థానాల అత్యధిక మెజారిటీతో గెలిచింది. ఆ విజయం జాన్సన్ ఖాతాలో చేరింది. అందుచేత బ్రిటన్ విశిష్ట ప్రధానుల వరుసలో చోటు సంపాదించుకొంటాడని అనుకొన్నారు. కానీ కథ అడ్డం తిరిగి పాలనకు సంబంధం లేని అనైతిక ఆరోపణలపై పార్టీలో యేకాకి అయిపోయి దిగిపోవలసి వచ్చింది.

గత నెలలోనే పార్టీలో అవిశ్వాస తీర్మానం నుంచి అతికష్టంగా బయటపడ్డ బోరిస్ జాన్సన్ కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో తన అధికార భవనాల్లో ‘పార్టీ’లకు అనుమతించారన్న ఆరోపణను యెదుర్కొన్నారు. ప్రభుత్వ భవనంలో జరిగిన వొక పార్టీకి హాజరై వస్తుండగా జాన్సన్‌కు లండన్ మెట్రో పాలిటన్ పోలీసులు జరీమానా విధించారని సమాచారం. వొక డిన్నర్ పార్టీలో ఇద్దరు మగవాళ్లతో సరసలాడిబోయిన క్రిస్ పించ్ అనే వ్యక్తికి ఆ సమాచారం తెలిసి కూడా తన ప్రభుత్వంలో కీలక పదవి కట్టబెట్టారన్న ఆరోపణ జాన్సన్‌ను బోనెక్కించింది. తన హోమ్ మంత్రి ఉల్లంఘనలను సమర్ధించాడనే ఆరోపణ, బ్రెగ్జిట్ సంక్షోభ సమయంలో పార్లమెంట్ సమావేశాలను అపూర్వమైన రీతిలో ప్రోరోగ్ చేయించి రాణి ఆమోదం పొందడంలో ఆమెను తప్పుదోవ పట్టించాడనే అభిప్రాయం వంటివి ఆయనపై పార్టీ సభ్యుల్లో పేరుకుపోయాయి. క్రిస్ పించ్ ఉదంతంతో జాన్సన్ మంత్రివర్గ సభ్యులు వరుసగా రాజీనామాలు సమర్పించారు. దానితో ఆయన పార్టీలో ఒంటరివాడైపోయారు.

అందుచేత కన్సర్వేటివ్‌లు జాన్సన్‌ని ఆపద్ధర్మ ప్రధానిగా కూడా వుండనివ్వరాడని కోరుకొంటున్నారు. జాన్సన్ మాత్రం మంద మనస్తత్వంతో తన మీద సాగిన దుష్ప్రచారానికి విలువ యిచ్చి పార్టీ తనను అన్యాయంగా దించేసిందని అంటున్నారు. బ్రిటన్ పార్లమెంటుకు మాములుగా 2024 డిసెంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రధాని కోరుకుంటే ఆకస్మిక యెన్నికలు జరిపించి ప్రజల తీర్పును కోరవచ్చు. జాన్సన్ వారసుడుగా ఆయన మంత్రివర్గంలోని రక్షణ మంత్రి బెన్ వాల్లాక్‌ను యెన్నుకోవచ్చన్నది వొక అంచనా. ఇంకా వాణిజ్య మంత్రి పెన్నీ మోర్దాంట్, మాజీ ఆర్ధిక మంత్రి సునాక్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. కొన్ని సంవత్సరాల పాటు తెగకుండా, ముడిపడకుండా వేధించిన బ్రెగ్జిట్ ను విజయవంతంగా జరిపించాడన్న కీర్తిని మూటగట్టుకొన్న ప్రధాని వ్యక్తిగత శీలసమగ్రతకు సంబంధించిన ఆరోపణలతో నిష్క్రమిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News