చరఖా తిప్పిన బొరిస్ జాన్సన్
గాంధీజీపై ప్రశంసల వర్షం
నేడు ఢిల్లీలో ప్రశాని మోడీతో సమావేశం
అహ్మదాబాద్: బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం భారత్ చేరుకున్నారు. గుజరాత్‌లో దిగిన ఆయనకు రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేద్ర పటేల్ స్వాగతం పలికారు. తర్వాత ఆయన సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ చరఖా తిప్పారు. ‘ ఈ ఆశ్రమానికి రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. ప్రపంచాన్ని కదిలించడానికి ఆయన సత్యం, అహింస వంటి సాధారణ సూత్రాలతో ఎలా ముందుకెళ్లారో అర్థం చేసుకున్నాను’ అని జాతిపిత మహాత్మాగాంధీగురించి ఆశ్రమంలోని సందర్శకుల పుస్తకంలో పేర్కొన్నారు. మహాత్ముడు రాసిన పుస్తకాల్లో ఒకటైన, ప్రచురణ కాని ‘ గైడ్ టు లండన్’తో పాటుగా బ్రిటన్‌లో జన్మించిన గాంధీజీ శిష్యురాలు, మీరాబెహన్‌గా పిలవబడే మేడలిన్ స్లేడ్ ఆత్మకథ ‘ది స్పిరిట్స్ పిలిగ్రిమేజ్’ అనే మరో పుస్తకాన్ని ఆశ్రమ నిర్వాహకులు జాన్సన్‌కు బహూకరించారు. దశాబ్దానికి పైగా బ్రిటీష్ సామ్రాజ్యవాద పాలనపై గాంధీజీ చేపట్టిన స్వాతంత్య్ర పోరాటానికి కేంద్రస్థానమైన సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన తొలి బ్రిటీష్ ప్రధాని జాన్సన్ కావడం గమనార్హం.
వాస్తవానికి 1947 తర్వాత గుజరాత్ ఆశ్రమాన్ని సందర్శించిన తొలి బ్రిటీష్ ప్రధాని కూడా ఆయనే . తన రెండు రోజుల పర్యటనలో భాగంగా జాన్సన్ ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసేదిగా భారత ప్రభుత్వంతో చర్చలు జరపనున్నారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్న ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచాలనే లక్షంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా వారి మధ్య చర్చలు జరుగుతాయని తెలుస్తోంది. అలాగే ఇండోపసిఫిక్ ప్రాంత పరిస్థితులు, ఇంధన భద్రత, రక్షణ విషయాల్లో భాగస్వామ్యం వంటి అంశాలు చర్చకు రానున్నాయి. జాన్సన్ పర్యటనలో భాగంగా పరిశ్రమల్లో పెట్టుబడులు, వైద్య, పరిశోధనా రంగాల్లో కలిసి పని చేయడంపై ప్రకటనలు వెలువడవచ్చని తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా జాన్సన్ బ్రిటన్ వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులకు మరిన్ని వీసాలు ఆఫర్ చేసే అవకాశాలున్నాయి. ఇక ఉక్రెయిన్ సంక్షోభ వేళ జాన్సన్ భారత పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే ఉక్రెయిన్ సంక్షోభం గురించి భారత్‌కు ఉపన్యాసాలు ఇవ్వకుండా మన దేశ అభిప్రాయాలను విననున్నారు.