Monday, December 23, 2024

మణిపూర్ హోరు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభల వర్షాకాల సమావేశాలు తూతూమంత్రంగా సాగి శుక్రవారం నుంచి నిరవధికంగా వాయిదాపడ్డాయి. మణిపూర్ ఘర్షణలపై ప్రధాని మోడీ ప్రకటనకు ప్రతిపక్షాలు పట్టుపట్టడం, చర్చ ఉంటుంది కానీ, నేరుగా ప్రధాని మాట ప్రసక్తే లేదని అధికార పక్షం స్పష్టం చేయడంతో గత నెల 11న ఆరంభమైన సెషన్ ప్రజోపయోగ విషయాలపై ఎటువంటి నిర్మాణాత్మక చర్చలు లేకుండానే అనుకున్న విధంగా ఆగస్టు 11వ తేదీన ( శనివారం) వాయిదా పడ్డాయి. సభలలో గందరగోళ పరిస్థితుల నడుమనే పలు కీలక బిల్లులను ప్రభుత్వం మూజువాణి ఓటుతో నెగ్గించుకుంది. ఓ దశలో లోక్‌సభలో ఎంపిల తీరు సరిగ్గా లేదని , సభామర్యాదలను వారు పాటించనంతవరకూ తాను సభలోకి వచ్చేది లేదని స్పీకర్ ఓం బిర్లా నిరసన కూడా వ్యక్తం చేశారు. నెగ్గిన బిల్లుల్లో వివాదాస్పదమైన ఢిల్లీ ప్రభుత్వోద్యోగుల సేవలను కేంద్రానికి కట్టబెట్టే బిల్లు కూడా ఉంది.

ఇక లోక్‌సభలో ప్రధాని మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన అవిశ్వాస తీర్మానం, దీనిపై చర్చ, ప్రతిపక్షాల వాకౌట్ల తరువాత తీర్మానం వీగిపోవడం జరిగాయి. కాగా లోక్‌సభ నుంచి కాంగ్రెస్ పక్ష నేత అదీర్ రంజన్ చౌదరిపై సస్పెన్షన్ వేటు పడింది. రాజ్యసభలో ఆప్ ఎంపి రాఘవ చద్దాను బహిష్కరిస్తూ తీర్మానం వెలువరించారు. ఈ విషయాలను సభా హక్కుల కమిటీ పరిశీలనకు పంపించారు. లోక్‌సభ సమావేశాల దశలోనే రాహుల్ గాంధీ ఎంపి సభ్యత్వ పునరుద్ధరణ జరిగింది. దీనితో ఆయన తిరిగి సభకు హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానంపై ప్రతిపక్షాల తరఫున ఘాటుగా మాట్లాడారు. తొలుత శుక్రవారం మధ్యాహ్నం రాజ్యసభ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. సభను నిరవధికంగా వాయిదావేశారు. శుక్రవారం రాజ్యసభలో ప్రతిపక్షాలు మణిపూర్ పరిస్దితిపై ప్రధాని మోడీ సభలో మాట్లాడాలని పట్టుపట్టాయి. దీనితో లంచ్‌కు ముందు రెండుసార్లు వాయిదా పడ్డ సభ ఆ తరువాత భోజనానంతరం సమావేశం అయింది.

ఎంపి రాఘవ చద్ధాపై సస్పెన్షన్ తీర్మానాన్ని కూడా సభ ఆమోదించింది. ఈ ప్రక్రియలు ముగియగానే సభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ ఆనవాయితీ ప్రసంగం తరువాత సభను నిరవధికంగా వాయిదా వేశారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ 20 గంటల పాటు జరిగింది. ఇందులో 60 మంది సభ్యులు పాల్గొన్నారు. తరువాత చర్చకు ప్రధాని మోడీ సమాధానం ఇచ్చారు. సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపిన స్పీకర్ ఈసారి సెషన్‌లో 17 సిట్టింగ్‌లు జరిగాయని, మొత్తం మీద 44 గంటల 13 నిమిషాల పాటు సమావేశాలు సాగినట్లు వివరించారు. 20 ప్రభుత్వ బిల్లులు ప్రవేశపెట్టారు. 22 ముసాయిదా ప్రతిపాదనలను సభ ఆమోదించింది. దిగువసభలో ఆమోదం పొందిన బిల్లుల్లో మల్టీ కో ఆపరేటివ్ సొసైటీల బిల్లు, డిజిటల్ పర్సనల్ డేటా బిల్లు, జన్‌విశ్వాస్ బిల్లు, ఐఐఎంల అటానమీ బిల్లు, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఆర్గనైజేషన్ బిల్లు ఉన్నాయి. సభల చివరి రోజు శుక్రవారం ఐపిసి, సిఆర్‌పిసి, ఎవిడెన్స్ చట్టాల స్థానంలో కొత్తవి తీసుకువచ్చే బిల్లులు మూడింటిని సభలో ప్రవేశపెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News