Sunday, December 22, 2024

మణిపూర్‌పై పార్లమెంటులో ఆగని గొడవ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. మణిపూర్ అంశంపై ఉభయ సభల కార్యకలాపాలకు ప్రతిరోజూ అంతరాయం కలుగుతోంది.ప్రధాని సమక్షంలోనే మణిపూర్ అంశంపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో గురువారం కూడా ఉభయ సభలు గందరగోళం మధ్యలోనే శుక్రవారానికి వాయిదా పడ్డాయి.గొడవ మధ్యలోనే లోక్‌సభ రెండు బిల్లులకు ఆమోదం తెలిపింది. ప్రతిపక్షాల నినాదాలు, ప్లకార్డుల ప్రదదర్శన మధ్యలోనే జనవిశ్వాస్ సవరణ బిల్లుకు, అలాగే కాలం చెల్లిన బిల్లుల రద్దుకు సంబంధించిన మరో బిల్లును సభ ఆమోదించింది. మణిపూర్ అంశంపై లోక్‌సభ గురువారం మూడు సార్లు వాయిదా పడింది.తొలుత సభ సమావేశం ప్రారంభం కాగానే విపక్షాల ఆందోళనకారణంగా స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.

సభ తిరిగి సమావేశమైన తర్వాత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గొడవ మధ్యలోనే భారత విదేశాంగ విధానంలో ఇటీవలి పరిణామాలపై ఒక ప్రకటన చేశారు. అయితే జైశంకర్ ప్రకటనకు ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించడంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్, కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. పాయిట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తడానికి చౌదరి ప్రయత్నించడా, మంత్రి పీయూష్ గోయల్ లేచి విదేశాంగ మంత్రి ప్రకటనకు అడ్డంకులు సృష్టించినందుకు నిరసనగా ఆయన మాట్లాడడానికి తాను అనుమతించనని చెప్పారు. ప్రతిపక్షాలు, అధికార పక్షం మధ్య గొడవతో పాటుగా మణిపూర్ అంశంపై విపక్ష సభ్యులు నినాదాలు కొనసాగుతుండడంతో సభను 20 నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ వాయిదా పడే సమయంలో కాంగ్రెస్ సభ్యుడొకరు చింపేసిన కాగితాలను స్పీకర్ స్థానం వైపు విసిరేశారు.

మధ్యాహ్నం 3 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ అ సంఘటనను ప్రస్తావిస్తూ ఆ సభ్యుడిపై చర్య తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. అనంతరం జనవిశ్వాస్ బిల్లుపై చర్చ చేపట్టారు. చర్చ సందర్భంగా మంత్రి పీయూష్ గోయల్ విపక్ష సభ్యులు నల్లదుస్తులు ధరించి సభకు రావడాన్ని విమర్శించారు. ‘తీవ్రమైన విషయాలపై కూడా రాజకీయాలు చేయడం దురదృష్టకరం.అంతర్జాతీయంగా భారత్‌కు పెరుగుతున్న ప్రతిష్ఠను ఈ నల్లదుస్తులు ధరించిన వ్యక్తులు అర్థం చేసుకోలేకపోతున్నారనుకుంటా. వారి గతం, వర్తమానం, భవిష్యత్తు అంధకారంలో ఉంది.కానీ మేం వారి జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుంటున్నాం’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. స్వల్ప చర్చ అనంతరం బిల్లుకు సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.

కాగా ఉదయం సభ ప్రారంభం కాగానే నల్లదుస్తులు ధరించి వచ్చిన విపక్ష ఎంపీలు మణిపూర్ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని,దీనిపై పూర్తిస్థాయి చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. రాజ్యసభ కూడా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News