Sunday, December 29, 2024

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ శీతాకాల సెషన్‌లో రెండవ రోజు చెప్పుకోదగిన కార్యక్రమం ఏదీ చేపట్టలేకపోయింది. అదానీ గ్రూప్‌పై అవకతవక ఆరోపణలు, సంభాల్ హింసాకాండ, ఇతర సమస్యలపై చర్చల కోసం పట్టుబట్టుతున్న ప్రతిపక్ష సభ్యుల నిరసనలు బుధవారం లోక్‌సభ, రాజ్యసభలను కుదిపివేశాయి. ప్రతిపక్ష సభ్యుల గలభా మధ్య ఉభయ సభలు ఉదయం ఒకసారి, ఆ తరువాత పూర్తిగా వాయిదా పడ్డాయి. లోక్‌సభ సమావేశమైన వెంటనే స్పీకర్ ఓమ్ బిర్లా ప్రశ్నోత్తరాల సమయం చేపట్టారు, కానీ ప్రతిపక్ష సభ్యుల నినాదాల దృష్టా సభా కార్యకలాపాలను వాయిదా వేశారు. అదానీ గ్రూప్‌పై వచ్చిన అవకతవకల ఆరోపణలపైన, సంభాల్‌లో మసీదులో ఇటీవల కోర్టు ఆదేశిత సర్వే సమయంలో చోటు చేసుకున్న హింసాకాండపైన చర్చించాలని వారు కోరారు. సభ మధ్యాహ్నం 12 గంటలకు సమావేశమైన వెంటనే వారు సభా మధ్యంలోకి మూకుమ్మడిగా దూసుకుపోయారు. సభాధ్యక్ష స్థానంలో ఉన్న బిజెపి సభ్యుడు దిలీప్ సైకియా సభకు అధికార పత్రాల సమర్పణ అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు.

రాజ్యసభలో అదానీ వివాదంపై జెపిసి దర్యాప్తునకు డిమాండ్‌తో సహా వివిధ సమస్యలను చేపట్టేందుకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలను సస్పెండ్ చేయడానికి సభ నిబంధన ఒకదాని కింద దాఖలైన 18 నోటీసులను చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తిరస్కరించడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షాల నిరసన కారణంగా సభా కార్యక్రమాలను కొద్ది సేపు వాయిదా వేశారు. ఉదయం 11.30 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు అవే దృశ్యాలు పునరావృతమయ్యాయి. దీనితో చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ‘సభలో పరిస్థితి సవ్యంగా లేదు’ అంటూ కార్యకలాపాలను గురువారానికి వాయిదా వేశారు. ‘ఇతర ప్రాధికార సంస్థలతో కుమ్మక్కై అదానీ గ్రూపుపై వచ్చిన అవినీతి, లంచగొండితనం, ఆర్థికి అవకతవకలు సహా దుష్ప్రవర్తనపై దర్యాప్తునకు జెపిసి ఏర్పాటు’, ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్‌లో హింసాకాండ, దేశ రాజధానిలో ‘పెరుగుతున్న’ నేర ఘటనలకు సంబంధించిన డిమాండ్లతో ప్రతిపక్షాలు ఆ నోటీసులు ఇచ్చాయి.

అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తునకు జెపిసి ఏర్పాటుపూ సభా కార్యక్రమాలను నిలిపివేసి 267 నిబంధన కింద చర్చించాలని కాంగ్రెస్ సభ్యులు మాత్రమే కోరారు. ఇతర ప్రతిపక్షాలు వేరే సమస్యలపై అటువంటి నోటీసులు ఇచ్చాయి. సభ నిబంధన 267 కింద నోటీసులను ధన్‌ఖడ్ తిరస్కరిస్తూ, ‘సభాధ్యక్షుని రూలింగ్ ప్రస్తావననే కోరుతుంది తప్ప విభేదాలకు కారణం కారాదన్న సత్సంప్రదాయాలను ఎగువ సభ ప్రతిబింబించవలసిన, అనుసరించవలసిన అగత్యం ఉంది. ఈ పరిస్థితుల్లో నోటీసులను ఎందుకు అంగీకరించడం లేదోనేను కారణాలనే వివరించాను’ అని తెలియజేశారు. గడచిన 30 ఏళ్లలో సభ ప్రతిసారి 267 నిబంధనకు సంబంధించి ఏకగ్రీవ దృక్పథాన్ని ప్రతిబింబిందని కూడా చైర్మన్ చెప్పారు, ‘నేను పలు సందర్భాల్లో పునరుద్ఘాటించినట్లుగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన శతాబ్ది చివరి త్రైమాసికంలోకి మనం ప్రవేశిస్తున్న పరిస్థితి దృష్టా దృష్టిని కేంద్రీకరించడం మంచిదని భావించాను’ అని ఆయన తెలిపారు. ధన్‌ఖడ్ నోటీసులను తిరస్కరిస్తూ, నిబంధనల ప్రకారం ఈ సమస్యలను ప్రస్తావించే సందర్భాలు ఉంటాయని కూడా నొక్కిచెప్పారు.

267 నిబంధన కింద ఇచ్చిన 18 వాయిదా నోటీసుల్లో కనీసం తొమ్మిది అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ సభ్యుల నుంచి వచ్చినవి కాగా, ఇతర నోటీసులు మణిపూర్, ఉత్తర ప్రదేశ్ సంభాల్‌లో హింసాకాండపై చర్చను కోరాయి. నోటీసులు ఇచ్చిన కాంగ్రెస్ సభ్యుల్లో జిసి చంద్రశేఖర్, రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, సయ్యద్ నసీర్ హుస్సేన్, నీరజ్ దంగి, రేణుకా చౌదరి, రాజీవ్ శుక్లా, ప్రమోద్ తివారి, అఖిలేశ ప్రసాద్ సింగ్, జెబీ మథెర్ హిషమ్ ఉన్నారు. అయితే, ‘ఢిల్లీలో పెరుగుతున్న నేరాల’పై చర్చించేందుకు సభ ఇతర కార్యక్రమాలను వాయిదా వేయాలని కోరుతూ ఆప్ సభ్యుడు సంజయ్ సింగ్ నోటీస్ ఇచ్చారు. మణిపూర్‌లో హింసాకాండపై చర్చ కోసం ఇదే నిబంధన కింద సుష్మితా దేవ్ (టిఎంసి), తిరుచ్చి శివ (డిఎంకె), రాఘవ్ చడ్డా (ఆప్), సందోష్ కుమార్ పి (సిపిఐ) వేర్వేరు నోటీసులు ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్ సంభాల్‌లో ఇటీవలి హింసాకాండపై చర్చ కోసం జాన్ బ్రిట్టాస్ (సిపిఐ ఎం), ఎఎ రహీమ్ (సిపిఐ ఎం), రామ్ గోపాల్ యాదవ్ (ఎస్‌పి), అబ్దుల్ వాహబ్ (ఐయుఎంఎల్) నోటీసులు ఇచ్చారు. తొలుత చైర్మన రాజ్యసభ సభ్యులు బికాష్ రంజన్ భట్టాచార్య, వన్‌వెయ్‌రాయ్ ఖర్లుఖి, ధర్మ్‌శిల గుప్తాలకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News