Friday, December 20, 2024

ఆ రెండు పథకాలూ 27నే ప్రారంభం: సిఎం రేవంత్ ప్రకటన

- Advertisement -
- Advertisement -

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాటిలో రెండు కీలకమైన హామీల అమలును ఈ నెల 27వ తేదీ సాయంత్రం ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంతోపాటు రూ. 500కు గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఆ రోజునుంచే అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన శుక్రవారం మధ్యాహ్నం హెలికాప్టర్లో  మేడారానికి వచ్చి సమ్మక్క- సారలమ్మలను దర్శించుకున్నారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ములుగు జిల్లాతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వనదేవతలను కోరుకున్నట్లు చెప్పారు.

మేడారం జాతర పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. కుంభమేళాకు వందల కోట్లు విడుదల చేసిన కేంద్రం, మేడారం జాతరకు మూడు కోట్లే కేటాయించిందన్నారు. మేడారం జాతరకు మోదీ, అమిత్ షా వచ్చి వన దేవతలను దర్శించుకోవాలని కోరారు. మేడారానికి రాకపోవడంవల్లే కేసీఆర్ భారీ మూల్యం చెల్లించుకున్నారని చెబుతూ త్వరలో మీకూ అదే పరిస్థితి వస్తుందని కిషన్ రెడ్డిని ఉద్దేశించి రేవంత్ అన్నారు. కేంద్రం ఉత్తర భారతం, దక్షిణ భారతం అంటూ వివక్ష చూపడం మంచిది కాదన్నారు.

ఆదివాసీల పట్ల, బడుగుల పట్ల సమ్మక్క సారలమ్మ పోరాడి నేలకొరిగారనీ, అందువల్లనే వందల ఏళ్లయినా వారిని దేవతలుగా కొలుస్తున్నామని రేవంత్ అన్నారు. పేద ప్రజల పక్షాన పోరాడినవారు విజయం సాధిస్తారని ఈ దేవతల నుంచే నేర్చుకున్నామనీ, పదేళ్లుగా పాలకుల నిరంకుశ ధోరణులపై కొట్లాడి, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News