సెమీస్‌లో ఓడిన భారత యువ బాక్సర్
టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత్ మూడో పతకం సాధించింది. మహిళల బాక్సింగ్ (69 కిలోలు) విభాగంలో యువ బాక్సర్ లవ్లీనా బొర్గొహెన్ కాంస్య పతకం సొంతం చేసుకుంది. బుధవారం టర్కీ బాక్సర్ సుర్మెనెలితో జరిగిన సెమీస్ పోరులో లవ్లీనా ఓటమి పాలైంది. దీంతో బాక్సింగ్‌లో ఫైనల్‌కు చేరాలనే యువ సంచలనం లవ్లీనా కల సాకారం కాలేదు. సెమీస్‌లో ఓడినా లవ్లీనా అసాధారణ ఆటతో కాంస్య పతకం సాధించి భారత ఖ్యాతిని ఇనుమడింప చేసింది. 9 ఏళ్ల తర్వాత బాక్సింగ్‌లో భారత్‌కు పతకం అందించింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా టోక్యో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన లవ్లీనా ఏకంగా పతకం సాధించి పెను ప్రకంపనలు సృష్టించింది. భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టినా యువ సంచలనం లవ్లీనా సెమీస్‌కు చేరడం ద్వారా పతకం ఖాయం చేసింది. ఇక టర్కీ స్టార్ సుర్మెనెలితో జరిగిన పోరులో ఓడినా లవ్లీనా అద్భుత పోరాట పటిమతో ఆకట్టుకుంది.
ఆడిన మొదటి ఒలింపిక్స్‌లోనే ఏకంగా కాంస్యం సాధించి చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మూడో భారత బాక్సర్‌గా లవ్లీనా అరుదైన ఘనత సాధించింది. గతంలో వీజేందర్ సింగ్, మేరీకోమ్‌లు మాత్రమే ఒలింపిక్స్‌లో పతకాలు సాధించారు. ఇదిలావుండగా ఒలింపిక్స్‌కు ముందు కరోనా బారిన పడిన లవ్లీనా అనూహ్యంగా పుంజుకుంది. విపరీత పోటీ ఉండే ఒలింపిక్స్‌లో సంచలన విజయాలతో సెమీస్‌కు చేరి పతకం ఖాయం చేసింది. అయితే బాక్సింగ్‌లో స్వర్ణం సాధించాలనే లవ్లీనా కల ఈసారి నెరవేరలేదు. అయితే ఎంతో భవిష్యత్తు ఉన్న లవ్లీనా రానున్న రోజుల్లో పసిడి సాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇదిలావుండగా టోక్యో ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకు భారత్ సాధించిన మూడు పతకాలు కూడా మహిళలే సాధించడం విశేషం. వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను రజతం నెగ్గగా, బ్యాడ్మింటన్‌లో తెలుగుతేజం సింధుకు కాంస పతకం లభించింది. తాజాగా బాక్సింగ్‌లో లవ్లీనా కంచు పతకం సాధించింది. అయితే పురుషుల రెజ్లింగ్‌లో రవికుమార్ దహియా ఫైనల్‌కు చేరడం ద్వారా ఇప్పటికే రతజం ఖాయం చేశాడు.