Saturday, November 9, 2024

వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడి మృతి (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలుడిని వీధికుక్కలు చంపేశాయి. అత్యంత దారుణమైన ఈ విషాద సంఘటన ఆదివారం నాడు హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో జరిగింది. ఆదివారం సెలవుకావడంతో ఒక ప్రైవేట్ కారు సర్వీస్ సెంటర్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న గంగాధర్ తన నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్‌ను, ఆరేళ్ల కుమార్తెను తీసుకుని తన సర్వీస్‌సెంటర్‌కు తీసుకువచ్చాడు. కుమార్తెను అక్కడే ఉన్న క్యాబిన్‌లో ఉంచి కుమారుడిని తనతోపాటు సర్వీస్ సెంటర్ లోపలకు తీసుకెళ్లాడు. కుమారుడు అక్కడే ఆడుకుంటుండగా గంగాధర్ మరో సెక్యూరిటీ గార్డుతో కలసి బయటకు వెళ్లాడు.

అక్కను వెదుక్కుంటూ బయటకు వచ్చిన ప్రదీప్‌పై ఐదు వీధికుక్కలు విరుచుకుపడ్డాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు ఆ బాలుడు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆ బాలుడి ఆర్తనాదాలు విని పరుగున అక్కడకు చేరుకున్న అతని సోదరి అదిలించినా కుక్కలు బెదరలేదు. దీంతో ఆ బాలిక బయటకు పరుగులు తీసి తండ్రికి సమాచారం అందించింది. గంగాధర్ వచ్చి గటిగా అదిలించడంతో అవి బాలుడిని వదిలేశాయి. తీవ్రంగా గాయపడిన ప్రదీప్‌ను అతని తండ్రి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. బాలుడిపై కుక్కల దాడి దృశ్యాలు అక్కడి సిసిటివి కెమెరాలలో రికార్డయ్యాయి.

కెటిఆర్ సంతాపం:

వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతిచెందిన హృదయా విదారక సంఘటనపై రాష్ట్ర మంత్రి కెటి రామారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలుడి కుటుంబానికి ఆయన సానుభూతి ప్రకటించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో కుక్కల బెడదను నివారించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన ట్వీట్ చేశారు. జంతు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి స్టెరిలైజేషన్ సెంటర్లను కూడా నెలకొల్పినట్లు ఆయన చెప్పారు. ఇటువటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News