మనతెలంగాణ, హైదరాబాద్ : కుక్కలు దాడి చేయడంతో ఓ బాలుడు మృతిచెందిన సంఘటన నగరంలోని బహదూర్‌పుర, అసద్‌బాబానగర్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం….స్థానికంగా ఉంటున్న మోహినుద్దిన్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడి కుమారుడు అయాన్(8) స్నేహితుడితో కలిసి పొదలాంటి చెట్లల్లో ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా కుక్కలు దాడి చేయడంతో అయాన్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరో బాలుడు కుక్కల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
బేగంపేటలో వృద్ధురాలిపై దాడి…
ఈ నెల 28వ తేదీ రాత్రి 11.30 గంటలకు ఇంటి బయటికి వచ్చిన గడ్డం మాలతీ రెడ్డి(71)ని కుక్క దాడి చేసింది. దీంతో బాధితురాలి ముఖం, చెవులకు గాయాలయ్యాయి. బాధితురాలు బిఎస్ మక్తాలో ఉంటోంది. స్థానికంగా ఉన్న జయాగార్డెన్‌కు చెందిన వారి కుక్కలు తమపై దాడి చేశాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుక్కలతో ఇబ్బందులు పడుతున్నామని వారికి చెప్పినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.