నేటి నీతి ఆయోగ్ సమావేశాల బహిష్కరణ
ముఖ్యమంత్రి కెసిఆర్ సంచలన ప్రకటన..
బాధాతప్త హృదయంతోనే ఈ నిర్ణయమని వివరణ
నీతి సిఫార్సులకు కేంద్రమే విలువ ఇవ్వడం లేదు భగీరథ, కాకతీయ పథకాలకు
రూ.24వేల కోట్లు ఇవ్వాలని చెబితే.. ఇంతవరకు 24 పైసలివ్వలేదు నీతి అజెండా ఎవరు
ఖరారు చేస్తారో తెలియదు పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా సెస్‌లు తెచ్చిన
ఎన్‌డిఎ ప్రభుత్వం రూ.14లక్షల కోట్లు ఎగవేసిన దుర్మార్గం గాలి తప్ప అన్నింటిపై
పన్ను పాలు, చేనేత, బీడీలపై జిఎస్‌టి ఎత్తేయాలని డిమాండ్ ఎన్‌పిఎల
వ్యవహారంలో భారీ కుంభకోణం పేదలకు ఉచితాలు వద్దంటూనే కార్పోరేట్లకు
రూ.20లక్షల కోట్ల రుణమాఫీ ఎన్‌డిఎ హయాంలో 10రేట్లు పెరిగిన ఎన్‌పిఎలు
మోడీ ప్రభుత్వ అధ్వాన్నపు పనితీరుకు ఇదే నిదర్శనం మేకిన్ ఇండియాలో చైనా
నుంచి మాంజాలు దిగుమతి కేంద్రంపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి కెసిఆర్
ప్రణాళికా సంఘం ఎన్నో విప్లవాత్మకమైన అభివృద్ధి పథకాలు, అనేక సంస్కరణలను చేపట్టి దేశాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించింది. యూపిఎ ప్రభుత్వం పోయి, ఎన్‌డిఎ ప్రభుత్వం వచ్చి, ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్‌ను తీసుకొచ్చింది. సిఎంలను దానిలో భాగస్వాములు చేసి, దేశ రూపురేఖలు మార్చేస్తామని, ఇదో టీమిండియా అని చెప్పడంతో చాలా సంతోషించా. కాలక్రమంలో నీతి సిఫారసులను పట్టించుకోవడం మానేశారు.
ఈ సంస్థను ఎందుకూ పనికిరాని, అలంకారప్రాయ సంస్థగా మార్చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుంది.
నీతి ఆయోగ్ ఎజెండా రూపకల్పనలోకోఆపరేటివ్ ఫెడరలిజం ఎక్కడ పోయింది.. కాకి ఎత్తుకుపోయిందా? నీతి ఆయోగ్ ఎజెండా రూపకల్పనలో ఎవరికీ భాగస్వామ్యం లేదు. ఎవరు తయారు చేస్తరో, ఎక్కడ తయారు చేస్తరో ఎవరికీ తెలియదు. ఈసారి ప్రముఖమైన సమస్యలున్నాయ్? దేశంలో ఎందుకు ధరలు పెరుగుతున్నాయ్? ద్రవ్యోల్బణం ఎందుకు పెరుగుతుంది? రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది? అందరం కలిసి ఏం చేద్దాం అనే ముచ్చటే లేదు. ఇది చిల్లర రాజకీయం కాదు. ప్రజలకు తెలియాలని చెబుతున్నా.
దేనిపై పన్నులు విధిస్తారు? ప్రజలు భరించగలరా? ఈ విషయాన్ని నీతి ఆయోగ్‌లో చర్చించారా? ఇదేనా సహకార స్ఫూర్తి? మీద, శ్మశానాల మీద పన్ను, ఇదేనా టీమిండియా అంటే? గాలి మీద తప్ప అన్నింటి మీద పన్ను వేస్తున్నారు. ఈ కారణాల వల్లనే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా. ఇలాగైనా మెజార్టీ ప్రజల భావాలు ప్రధానికి అర్థమవుతాయని ఆశించి ఈ నిర్ణయం తీసుకున్నా. ప్రధాన మంత్రేమో నీతి ఆయోగ్ లోగోలో గాంధీ కళ్లద్దాలు పెడితే, బిజెపి సంఘాలేమో గాంధీని దూషిస్తుంటాయి. గాంధీకి లేని అవలక్షణాలు ఉన్నట్లు చెబుతుంటారు.
దేశానికి ప్రగతికి బాటలు పరచాల్సిన నీతి ఆయోగ్ నిరర్ధకంగా మారిపోయిందని సిఎం కెసిఆర్ భగ్గుమన్నారు. కేంద్రం ముఖ్యంగా ప్రధాని మోడీ వైఖరి వల్లే ఈ దుస్థితి దాపురించిందని దుయ్యబట్టారు. నీతి ఆయోగ్ సిఫార్సులకే దిక్కులేనప్పుడు దాని సమావేశాలకు వెళ్లి సాధించేదేమిటని ప్రశ్నించారు. అందుకే ఆదివారం జరగనున్న సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దేశం ఎదుర్కొంటున్న తీవ్రతి తీవ్రమైన సమస్యలను ఇందులో చర్చించడం లేదని ఆరోపించారు.
మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ విధానాలపైన, ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నీతి ఆయోగ్ సంస్థను ఎందుకూ పనికిరాని సంస్థగా మార్చిన ఘనత ప్రధాని నరేంద్రమోడీకే చెల్లిందని ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తూర్పారబట్టారు. నీతి ఆయోగ్ సిఫారసులను కూడా పట్టించుకోకుండా సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ రాష్ట్రాలను అభివృద్ధి చెందనీయకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తూ అభివృద్ధి నిరోధకశక్తిగా కేంద్రం మారిపోయిందని ఆయన వాపోయారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న చిన్న లాజిక్‌ను తెలుసుకోకుండా కేంద్రం మూర్ఖంగా వ్యవహారి స్తోందని సిఎం మండిపడ్డారు. నీతిఆయోగ్‌ను నిరర్ధకమైన సంస్థగా మార్చినందుకు, నీతి ఆయోగ్ సిఫారసులను కేంద్రం పట్టించుకోనందుకు నిరసనగా ఈనెల 7వ తేదీన జరుగనున్న నీతి ఆయోగ్ సంస్థ నిర్వహించే సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు.
ఈ నిర్ణయం చాలా బాధాకరమే అయినప్పటికీ ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపేందుకు ఇది ఉత్తమమైన మార్గంగా భావించి తాను ప్రధానమంత్రికి ఈ బహిరంగ లేఖ ద్వారా తెలియజేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.దేశానికి స్వాతంత్య్రం రావాలని పోరాటం జరిగే రోజుల్లో ఒకానొక సందర్భంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్‌కు సారథ్యం వహించే సమయం నుంచి దేశానికి స్వాతంత్య్రం వస్తే ఏం చేయాలి, ఈ దేశాన్ని ఎలా ముందుకుపోవాలి, దేశంలో ఏం జరగాలి? అనే చర్చలు స్వాతంత్య్రానికి రాడానికి పూర్వమే జరిగాయని సిఎం కెసిఆర్ తెలిపారు. ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయ్ నౌరోజీ ఆయన కూడా దాంట్లో భాగస్వామ్యం వహించి అనేక చర్చోపచర్చలు జరిపారన్నారు.
రాష్ట్రం ఏర్పడే టైంలో కొందరు సన్నాసులు అట్లే మాట్లాడిన్రు
తెలంగాణ ఏర్పడే సమయంలో కూడా కొందరు సన్నాసులు అట్లే మాట్లాడారని ఆయన తెలిపారు. ఇది చరిత్రలో కనిపించేదని, అట్లాంటి వాళ్లకు తెలియజెప్పడానికి స్వాతంత్య్రం అనంతరం ఏ దేశమైనా, ఏ సమాజమైనా సరే ఒక ప్రణాళికబద్ధంగా వ్యవహారించాలని కెసిఆర్ సూచించారు. అది స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు అయి ఉండాలన్న ఉద్ధేశంతో ‘ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా’ ఒకటి ఉండాలని, దానికి ఒక కర్తవ్యాన్ని అప్పగించాలని, ఈ ప్లానింగ్ కమిషన్ చేసే అధ్యయనాల్లో, మేధోమథనాల్లో ప్రణాళికలు రూపొందించి కేంద్రం ఎలా వ్యవహారించాలి, రాష్ట్రం ఎలా వ్యవహారించాలన్న దానిపై అప్పట్లో ఒక నిర్ణయానికి వచ్చారని కెసిఆర్ తెలిపారు. ఆ నిర్ణయాలు, ఆలోచనలు, మేధోమథనాలే వాటి యొక్క స్వరూపమే గతంలో మనకున్న ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అని కెసిఆర్ తెలిపారు.
ఆ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాకు వార్షిక ప్రణాళికలు ఉండాలన్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో అవలంభించాల్సిన మంచి, చెడు అలాగే పంచవర్ష ప్రణాళికలు, ఆ పంచవర్ష ప్రణాళికలను అనుసరించి ఈ వార్షిక ప్రణాళికలు ఉండాలని కెసిఆర్ సూచించారు. తద్వారా ఒక 20, 30 సంవత్సరాల ఒక విజన్ కూడా కలిగి ఉండాలన్న పద్ధతిలో అప్పట్లోనే ఆలోచనలు జరిగాయన్నారు. నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాక ఎగ్జిటెన్స్‌లోకి వచ్చిన ఈ దేశ ప్రగతి, దేశంలో మనం చూస్తున్న అనేక ప్రాజెక్టులు, పరిశ్రమలు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు కావచ్చు, జీవితబీమా సంస్థ ఎల్‌ఐసీ సంస్థలు, ఇండియన్ రైల్వేస్, ఇలా దేశంలో అనేక విషయాలు మనకు ఈ రోజు దేశంలో కనిపిస్తున్నాయ్ అని కెసిఆర్ తెలిపారు. ప్లానింగ్ కమిషన్ మెంబర్‌లో ఎందరో మహానుభావాలు మెంబర్లుగా పని చేశారని ఈ ప్లానింగ్ కమిషన్ అంటేనే ఎంతో గౌవరం ఉండేదని కెసిఆర్ తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆర్థికవేత్తలు, వివిధ రంగాల శాస్త్రవేత్తలు, నిష్ణాతులు వారి సూచనలు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో జరుగుతున్న ప్రణాళికలు, వాటి అమలు వాటి పరిణామాలు చాలా చక్కగా అన్ బయాస్డ్‌గా ఆలోచించి, విశ్లేషించి మన వాతావరణానికి, మన దేశానికి, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే వారని కెసిఆర్ తెలిపారు.
అప్పటి ప్రధానులు చెబితే వినే వారు
అప్పట్లో ఎవరు మంచి చెప్పినా వినే సంస్కారం ప్రధాన మంత్రులకు ఉండేద ని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన ఒకసారి అమెరికా వెళ్లారు. అప్పుడు ఐసెన్ హో వర్ ఆ దేశాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఎస్కే డే అనే వ్యక్తిని నెహ్రూకు పరిచయం చేశారు. ఈయన కూడా మీ భారతీయుడే అమెరికాకు చాలా అద్భుతమైన సేవ లు అందించారని హోవర్ పరిచయం చేస్తే నెహ్రూ మరుసటి రోజే ఎస్కే డేను భోజనానికి రావలసిందిగా ఆహ్వానించారు. ఆయన వచ్చినప్పుడు భారత్‌కు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎస్కే డే వంటి మేథావులు పరాయి దేశాల్లో ఉండిపోతే భారత్ పరిస్థితి ఏంటని నెహ్రూ ఆవేదన వ్యక్తం చే శారు. ఆయన్ను భారత్ వచ్చేయాలని పిలిచారు.
దానికి డే నిరాకరించారు. ఎందుకు? మీకు దేశంపై ప్రేమ లేదా? అని నెహ్రూ ప్రశ్నించగా మీ ప్రాధాన్యతలు సరిగా లేవని ఎస్కే డే ఖరాఖండీగా చెప్పేశారు. దేశంలో ఆకలితో ప్రజలు అలమటిస్తున్నారు, నదీజలాలు వృధా అవుతున్నాయి. ఇలాంటి సమయంలో మీరు మాత్రం మొద టి పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యతనిచ్చారంటూ డే విమర్శించారు. దాంతో రెండో పంచవర్ష ప్రణాళికలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చారు.ఎస్కే డే స్వదేశానికి వచ్చినప్పుడు రాజ్యసభ మెంబర్‌ను చేసి, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ పోర్ట్‌ఫోలియో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆయన్ను మంత్రిగా నియమించారని కెసిఆర్ తెలిపారు.
ఉన్నతమైన ఆలోచనల నుంచే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా
ప్రజల విశాలమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అప్పట్లో ఎన్నో నిర్ణయాలు తీసుకునేవారని సిఎం పేర్కొన్నారు. కమ్యూనిటీ డెవలప్‌మెంట్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎస్కే డే నేరుగా హైదరాబాద్‌కు వచ్చారని, ఆ సమయంలోనే రాజేంద్రనగర్‌లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (ఎన్‌ఐఆర్‌డి) అనే సంస్థను ఏర్పాటు చేశారని, ఆ తర్వాతనే కమ్యూనిటీ డెవలప్‌మెంట్ శాఖ కాలక్రమంలో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ మంత్రిత్వశాఖగా మారిందని కెసిఆర్ వివరించారు. దేశం సర్వతోముఖాభివృద్ధిని సాధించేందుకు కేవలం రాజకీయపరమైన నిర్ణయాలు మాత్రమే తీసుకుంటే సరిపోదని, నిపుణులు, మేధావులు, శాస్తవేత్తలు కలిపి ఒక అభివృద్ధి ప్రణాళికలను రచించే ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని ని ర్ణయించారని, అలాంటి ఉన్నతమైన ఆలోచనల నుంచే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థను ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. ఈ ప్రణాళికా సం ఘం వివిధ రంగాలకు చెందిన మేధావులు, నిపుణులు సభ్యులుగా ఉండేవారని, ఈ ప్రణాళికా సంఘానికి ప్రధానమంత్రి చైర్మన్‌గా వ్యవహారించే వారు.
నీతి ఆయోగ్ సిఫారసు బుట్టదాఖలైతే దానికున్న విలువేంటి?
‘ఇవాళ నీతి ఆయోగ పరిస్థితి ఏంటంటే.. మేం అడుగలే.. మేం సిఫారసు చేయ లే.. వాళ్లంతట వాళ్లే తెలంగాణలోని రెండు స్కీమ్‌లు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని తెలిపిందన్నారు. మిషన్ కాకతీయ పథకం చాలా మంచిదని, భూగర్భజలాలు, బయోడైవర్సిటీని, జీవవైవిధ్యాన్ని పెంచుతుందని ఆలోచించి ఒక రూ. 5వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేసిందని కెసిఆర్ తెలిపారు. అలా గే మిషన్ భగీరథ కూడా చాలా మంచి కార్యక్రమని, ప్రతి ఇంటికీ ఐదుసంవత్సరాల కాలపరిమితి లోపల ట్రీటెడ్ పోర్టెబుల్ డ్రింకింగ్ వాటర్ అందించవచ్చని, ఇది మంచి ప్రోగ్రామ్ అని తెలంగాణ ప్రభుత్వం తీసుకుందన్నారు. దీనికి రూ.19వేలకోట్ల రూపాయలు ఇవ్వండి, రెండింటికి కలిపి రూ.24వేలకోట్లు ఇవ్వాలని నీతియోగ్ సుమోటోగా ప్రధానమంత్రికి స్వయంగా సిఫారసు చేసిందన్నారు. వాళ్లు చేసి ఆరేళ్లు గడిచిపాయే, రూ.24వేలకోట్లు ఇవ్వమంటే 24 పైసలు కూడా ఇవ్వలేదని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మరి నీతి ఆయోగ్ సిఫారసు బుట్టదాఖలైతే దానికున్న విలువేంటి? ఇది నీతి ఆయోగ్‌కు అవమానం కాదా? అంటూ కెసిఆర్ మండిపడ్డారు.
ఉప సంఘాలు వేయమంటే పట్టించుకోలే..
నీతి ఆయోగ్‌కు కొన్ని ఉపసంఘాలు వేయమని చెప్పాం. చాలా లోతైన అధ్యయనం జరగాలి. దేశాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలి. చాలా ప్రధానమైన బాధ్యతల్లో ఉన్న నీతి ఆయోగ్ గొప్ప ఆలోచన చేయాలని చెప్పి ఉప సంఘాలు వేసి ముఖ్యమంత్రుల బృందాలు వేయాలని చెప్పామని ఆ ప్రయత్నం జరగలేదని కెసిఆర్ ఆరోపించారు. ఒక బృందం వేస్తే గాచారం బాగలేక నేను కూడా దాంట్లో మెంబర్‌గా ఉన్నా. పైసలు ఖర్చుపెట్టుకొని అప్పటి చీఫ్ సెక్రటరీ రాజీవ్‌శర్మ కలిసి భోపాల్‌కు వెళ్లి అక్కడ సమావేశంలో పాల్గొన్నాం. చాలా గంటల సమయం వెచ్చించి మంచి సలహాలు ఇచ్చాం.
సమగ్రమైన దృక్పథంతో ఆలోచించాలని చెప్పాం
కశ్మీర్, హిమాచల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లోని ప్రాంతాలు, ఉత్తరాఖండ్ కావొచ్చు. ఇట్ల శీతల ప్రాంతాలున్న రాష్ట్రాలున్నయ్. అలాగే సముద్రతీరమున్న ప్రాంతాలున్నాయ్. ల్యాండ్ లాక్‌డ్ స్టేట్స్ మధ్యప్రదేశ్, తెలంగాణ ఏ తీరం లేకుండా చుట్టూ భూమిచేతనే ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నయ్. కొన్ని ఉష్టోగ్రత లు ఉండే ప్రాంతాలున్నయ్. భిన్నమైన ఆగ్రో క్లైమెటిక్ కండిషన్స్ ఉన్నయ్. ఖని జం అంతటా దొరకదు. కర్ణాటక కోలార్ జిల్లాలో బంగారు గనులు ఉన్న య్. అలాగే బొగ్గు నిక్షేపాలు అంతటా ఉండవ్. ఇలా రకరకలుగా ఉంటయ్ వాటిని దేశ ప్రగతికి ఉపయోగపడేలా ఉండాలంటే అన్నింటిని దృక్పథంగా పెట్టుకొని సమగ్రమైన దృక్పథంతో ఆలోచించాలని చెప్పామని కెసిఆర్ తెలిపారు.
కేంద్రం నిధులు మహత్తరంగా ఉండవ్..?
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఏమైతే ఉంటాయో అవి మహత్తరంగా ఉండవ్. అతి తక్కువ ఉంటయ్. అవి రాష్ట్రాలకే ఇవ్వాలే. ఎందుకంటే రాష్ట్రాలు స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్. స్టేట్స్ స్పెసిఫిక్ ఇష్యూలు ఉంటయ్. సముద్రతీరం ఉన్న వద్ద ఒక సమస్య. కోల్ వాతావరణం ఉన్న కాడ ఒక రకమైన సమస్యలుంటయ్. హీట్ వెదర్ ఉన్న కాడ మరోరకమైన సమస్యలుంటయ్. రాజస్థాన్‌లాంటి ఎడారి రా ష్ట్రం ఉంటే వారి సమస్య ఒక రకంగా ఉంటుంది. వాళ్ల ప్రాధాన్యతలు అందరి కంటే వాళ్లకు ఎక్కువ తెలుస్తయ్. ఒక చోట బోధకాల వ్యాధి, మరోచోట టిబి వ్యాధి ఎక్కువ ఉంటది. అన్నింటికీ ఒకటే మందంటే కలువది కదా..? ఇలా స్టే ట్స్ స్పెసిఫిక్‌గా ఉండాలని చెబితే మంచి ప్రతిపాదన అంగీకరిద్దామన్నారు ప్ర ధాని. కానీ, ఆచరణలో సున్నా అది మొత్తం బంద్‌పెట్టి మేం చెప్పిందే చెయ్యా లి లేకుంటే మీ కథ చూస్తాం అనే కాడికి వచ్చిందని కెసిఆర్ ధ్వజమెత్తారు.
అంతర్జాతీయ స్థాయిలో పరువు రోజురోజుకు పోతుంది
‘కో ఆపరేటివ్ ఫెడరలిజం పోయింది.. ఇంపరేటివ్ డిక్టేటరిజమ్ వచ్చింది. చివరికు ఎక్కడికీ వచ్చిందంటే ముఖ్యమంత్రులే బుల్డోజర్లు పెట్టి కూలగొడుతమ్ మీ ఇండ్లను అంటున్నరు.. కూలగొడుతూనే ఉన్నరు కొందరు.. రాష్ట్రాల్లో మంత్రులుగా ఉండే వాళ్లు ఎన్‌కౌంటర్లు చేసేందుకు వెనుకాడం అని మాట్లాడే పరిస్థితులు నెలకొన్నాయి.
భగవంతుని పేరిట జరిగే ఉత్సవాల్లో దేశ రాజధానిలో కత్తులు, గదలు, కటార్లు పట్టుకొని తిరిగే పరిస్థితి వచ్చింది. గత హనుమాన్ జయంతి రోజున ఢిల్లీ నడిబొడ్డులో పట్ట పగలు 11 గంటలకు కత్తులు పట్టుకొని కొందరు స్వైర విహారం చేశారు. ఇదేనా నీతి ఆయోగ్ ఇచ్చిన సందేశం. ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సందేశం ఏమిటీ ? ఏం జరుగుతుంది ? ఈ దేశం అన్ని రంగాల్లో సర్వనాశనమయ్యింది. ఇండియా చాలా వెనుకబడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో మన పరువు రోజురోజుకు పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రాలకు రూ. 14లక్షల కోట్లు ఎగవేసిన కేంద్రం
దేశ భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది. రోజు రోజుకు పన్నులు వసూలు చేసే పద్ధతులను రాజ్యాంగం నిర్ధేశించింది. ఈ పన్నులు కేంద్రం వసూలు చేయాలి. ఈ పన్నులు రాష్ట్రాలు వసూలు చేయాలని ఎవరి బాధ్యతలు వారికి పెట్టింది. కొన్ని రకాల పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి.
రాజ్యాంగబద్ధమైన హక్కు ఇది అని కెసిఆర్ పేర్కొన్నారు. కానీ మోడీ మాత్రం రాష్ట్రాల పన్నుల వాటా ఎంత తెలివిగా ఎగ్గొట్టొచ్చని, ఆలోచన చేసి టాక్స్‌లకు సెస్ అని పేరు పెట్టి, రాష్ట్రాలకు రావాల్సిన దాదాపు రూ.12- నుంచి రూ.13 లక్షల కోట్లను ఎగ్గొడుతున్నారని కెసిఆర్ ఆరోపించారు. ఇప్పటి వరకు రూ.13 నుంచి రూ.-14లక్షల కోట్ల పన్నును ఎగ్గొట్టారని, ఇదేనా కో ఆపరేటివ్ ఫెడరలిజం, ఇదేనా సహకార సమాఖ్య స్ఫూర్తి? అని ఆయన మోడీని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకు సంక్రమించిన హక్కులను ఒక ట్వీట్ చేసి రాష్ట్రాలకు రావాల్సిన వాటాను కొల్లగొడుతున్నారని సిఎం కెసిఆర్ మండిపడ్డారు.
ఎన్ని నిమిషాలు మాట్లాడాలని లెక్కపెట్టి బెల్లు….
‘దీన్ని కో ఆపరేటివ్ ఫెడరలిజం అంటారా? ఇది టీమ్ ఇండియేనా? దీనిని టీమ్‌ఇండియా అంటారా? ఇది ధర్మమేనా? దీనిని కో ఆపరేటివ్ ఫెడరలిజం అంటారా? ఇది టీమ్ ఇండియా చేసే పనేనా? ఏ నీతి ఆయోగ్ మీటింగ్‌లో దీనిపై చర్చ పెడతారా? అసలు చర్చకు ఆస్కారం ఉంటుందా? ఆ మీటింగ్‌కు పోతే అదో భజనమండలిగా మారిపోతుంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు ఎన్ని నిమిషాలు మాట్లాడాలని లెక్కపెట్టి బెల్లు కొడుతరు, మూడు రోజులు కాకపోతే నాలుగు రోజులు పెండండి, ఇంతకంటే పెద్ద పనులేముంటాయని కెసిఆర్ ప్రధానిని ప్రశ్నించారు.
రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడితే నవ్వుతారు…
ఎవరన్నా రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడితే మిగతా వాళ్లు నవ్వుతుంటరు. ఈ విషయాన్ని అందుకే బాధపడి చెబుతున్నానని ఆయన తెలిపారు. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు ఎట్లా ఉండే అంటే రాష్ట్రాల బడ్జెట్ల ఆమో దం కోసం పోతే రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు, సెక్రటరీలు, అవసరమైన సం దర్భాల్లో సిఎంలు వెళ్లి ఢిల్లీలో వారం రోజులుంటే రోజుల తరబడి ప్రణాళిక సంఘం చర్చలు జరిపేదని ఆయన పేర్కొన్నారు. ఏదైనా తప్పుంటే మా పరిస్థితి? మా ప్రాధాన్యత ఇది అని చెప్పి ప్లానింగ్ కమిషన్‌ను ఒప్పించి నిధులు విడుదల చేయించుకునేది, అంత వెసులుబాటు ఉండేదని కెసిఆర్ అన్నారు.
ఆ రోజు 15 రాష్ట్రాల సిఎస్‌లు నన్ను అభినందించారు…
ఇప్పుడు ఎజెండా ఎవరు తయారు చేస్తారో? పాలసీ ఎవరు తయారు చేస్తారో, ఎవరు ఆర్డర్లు ఇస్తరో తెలియని పరిస్థితి. నీతి ఆయోగ్ తనకు తానుగా ఆలోచిం చి సిఫారులకు కనీస గౌరవం ఉంటుందా? అదీ లేదని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ కేంద్ర చేసే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాల ప్రగతిని మొత్తం దెబ్బతీస్తున్నాయని ఆయన ఆరోపించారు.
నీతి ఆయోగ్ తొలి సమావేశం నుంచి మొదలుకొని ప్రతి సమావేశంలో తాను నొక్కి వక్కానించానని, ఈ దేశంలో ఏ ఇంచులో జరిగే ప్రగతిని ఆపినా ఈ దేశ ప్రగతికి గొడ్డలి పెట్టు తెలి వి తక్కువతనం అవుతుందని ఆయన తెలిపారు. బాగా దూసుకుపోతున్నా, మంచి నైపుణ్యంతో పని చేస్తున్న రాష్ట్రాల కాళ్లలో కట్టెలు పెట్టకండి, వాళ్లను ప్రో త్సహించండని తద్వారా దేశం బాగుపడుతుందని చెప్పామని అయినా ఎవరూ పట్టించుకోలేదని కెసిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక సమావేశంలో 25 నిమిషాలు మాట్లాడుతానని ముందే చెప్పి తెలంగాణ ఒక గురించి ఒకటి రెండు నిమిషాలు, మిగతా అంతా దేశం గురించి చెప్పా. దేశంలో 24 గంటల కరెంటు ఎలా ఇవ్వచ్చో, దేశంలో ప్రతి ఎకరానికి నీళ్లు ఎలా ఇవ్వచ్చో సోదహరణంగా అధికారిక లెక్కలతో చెప్పా? సమావేశమైన తర్వాత పదిహేను రాష్ట్రాల సిఎస్‌లు తనను అభినందించారని తెలిపారు.
గాంధీజీపైనా బిజెపి సంఘాల అవాకులు చవాకులు
ప్రజలపై పెరిగిన పన్నుల భారంపై కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేనిపై పన్నులు విధిస్తారు? ప్రజలు భరించగలరా? ఈ విషయాన్ని నీతి ఆయోగ్‌లో చర్చించారా? ఇదేనా సహకార స్ఫూర్తి? అని ఆయన మండిపడ్డారు. దేనిపై జీఎస్టీ వేశారో కూడా తమకు తెలియదని, బయటకు వచ్చాక తెలిసిందని, పాల మీద పన్ను, స్మశానాల మీద పన్ను, ఇదేనా టీమిండియా అంటే? ఈ కారణాల వల్లనే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నానన్నారు. ఇలాగైనా మెజార్టీ ప్రజల భావాలు ప్రధానికి అర్థమవుతాయని ఆశించి ఈ నిర్ణయం తీసుకున్నానని కెసిఆర్ వివరించారు.
ఏ దేశంలోనైనా ‘జాతి పిత’ అని పేరు పెట్టుకున్న వ్యక్తిని అహింసామార్గంలో స్వాతంత్య్రం తెచ్చిన వ్యక్తిని అవమానిస్తారా అని అడిగారు ? ప్రధాన మంత్రేమో నీతి ఆయోగ్ లోగోలో గాంధీ కళ్లద్దాలు పెడితే, బిజెపి సంఘాలేమో గాంధీని దూషిస్తుంటారు, గాంధీకి లేని అవలక్షణాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇలా ఎక్కడైనా ఉంటుందా? అని సిఎం కెసిఆర్ ప్రశ్నించారు. ఇష్టమొచ్చినట్లు ధరలు పెంచి ప్రజలపై భారం మోపిందే కాకుండా ఇప్పుడు కొత్తగా ఉచితాలు బంద్ చెయ్యాలని చెబుతున్నారు. రైతాంగం బాధలో ఉందని, ఒక ఎకరమో గుంటనో భూమి ఉన్న రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుందన్న ఉద్దేశ్యంతో రైతుబంధు ఇస్తే అది ఉచితమా? అని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి ఉచితాలు అయితే ఎన్పీయేలు ఎందుకు ఇస్తున్నారని కెసిఆర్ ప్రశ్నించారు. ఈ విషయాన్ని బహిర్గతం చేయాలని మోడీని సిఎం కెసిఆర్ డిమాండ్ చేశారు. భారత్ లో 83 కోట్ల ఎకరాలైతే అందులో 40 కోట్లపైగా వ్యవసాయయోగ్యమైనదన్నారు.
పంద్రాగస్టు నుంచి కొత్తగా 10లక్షల మందికి పెన్షన్లు
కొత్త పెన్షన్లపై సిఎం కెసిఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొత్తగా 10లక్షల మందికి పెన్షన్లు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం 36లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సం దర్భంగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో మొత్తం పింఛన్‌దారుల సంఖ్య 46లక్షలకు చేరుకుంటుందన్నారు. 57 సంవత్సరాలున్న వారికి పింఛన్లు మంజూరు చేస్తున్నామని, దీంతోపాటు కొత్తగా డయాలసిస్ పేషెంట్లకు సైతం పింఛన్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. డయాలసిస్ పేషెంట్లకు రూ.2016 పింఛన్ ఇవ్వనున్నట్లు సిఎం ప్రకటించారు.
డయాలసిస్ పేషెంట్లకు ఆసరా కార్డులు
దేశంలో ఎక్కడా లేని విధంగా బోధకాలు పేషెంట్లకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కెసిఆర్ తెలిపారు. మొ త్తం 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులుంటే వాళ్లకు కూ డా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటోందని ఆయన వివరించారు. అలాగే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సిఫారసు మేరకు డయాలసిస్ పేషెంట్లకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు కెసిఆర్ చెప్పారు. ఇప్పటికే వాళ్లకు బస్‌పాసులు ఇస్తున్నామని, ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని, ఇటీవల డయాలసిస్ కేంద్రా లు కూడా పెంచామని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో 10 వేలకు పై చిలుకు డయాలసిస్ పే షెంట్లు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వాళ్లకు ఇప్పటివరకు ఇస్తున్న సేవలతో కలిపి కొత్తగా ‘ఆసరా’ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయ న తెలిపారు. తద్వా రా వారికి నెలకు రూ.2016 ఆర్థిక సాయం అందుతుందని సిఎం చెప్పారు.
75 మంది ఖైదీల విడుదల
అలాగే దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఇది తమ ప్రభుత్వ పాల సీ అన్నారు. అనాథ పిల్లలను ‘స్టేట్ చిల్డ్రన్’గా ప్రకటించాలని నిర్ణయించామని, దీనిపై కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు కూడా ఇచ్చిందని, ఆ నివేదికలు కూడా తనకు అందుతాయని కెసిఆర్ పేర్కొన్నారు. దీంతోపాటు అనాథ శరణాలయాలను కూడా ఆదుకొని, ఆ పిల్లల కోసం ప్రత్యేకంగా కేజీ నుంచి పిజి వరకు స్కూళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. అనాథ పిల్లలను చదివించి, ఉద్యోగాల్లో కూడా వాళ్లకు కొంత రిజర్వేషన్ కల్పించడంతో పాటు గ్రాంట్లు కూడా పెంచాలని నిర్ణయించామన్నా రు. విధి వంచితులకు ప్రభుత్వమే అండగా ఉం డాలన్న మానవీయ కోణంలో ఆలోచించి ఈ నిర్ణ యం తీసుకున్నామని కెసిఆర్ చెప్పారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఇవన్నీ కూడా ఉచితా ల కిందకే వస్తాయా? అని ఆయన ప్రశ్నించారు.
ఎన్‌పిఎ కింద రూ.20 లక్షల కోట్లా?
2004-05లో నాన్ పర్ఫామెన్స్ అసెట్స్ (ఎన్పీయే)లు రూ.58వేల కోట్లు ఉండేవని, 2014 నాటికి 2 లక్షల 63 వేల కోట్ల రూపాయలకు చే రిందని, ఇప్పుడు ఇది రూ. 20 లక్షల 7 వేల కోట్ల రూపాయలని కెసిఆర్ పేర్కొన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వంలో ఇదో దందా అయిందని, ప్రభుత్వ పెద్దలు, ఎన్పీయే వాళ్లు చే తు లు కలిపి పెద్ద స్కాం చేస్తున్నారని కెసిఆర్ ఆరోపించారు. ఎన్పీయే డిక్లేర్ చెయ్యగానే ప్రభుత్వం నుంచి భారీ గా నిధులు మంజూరు చేస్తున్నారని,ఇప్పటి వరకు రూ.12లక్షల కోట్లు ఇచ్చిందనితెలిపారు.
లక్షల కోట్లకు బ్యాంకుల్లో రుణ ఎగవేతలు
మేకిన్ ఇండియా, నీతి ఆయోగ్ మేధో సంపత్తి, మహత్తరమైన ప్రభుత్వ విధానాలు ఉంటే ఎన్పీయేలు తగ్గాలి కదా. వీళ్ల పాలనలో పది రెట్లు ఎలా పెరిగింది? ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం కాదా? అని కెసిఆర్ ఎ ద్దే వా చేశారు. బ్యాంకుల్లో రుణ ఎగవేతలు లక్షల కోట్లకు చేరాయి. ఇది ప్ర గతికి సంకేతమా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. మేకిన్ ఇండి యా అని ప్రధాని చెప్తారు. కానీ గాలిపటాలు ఎగరేసే మాంజా నుంచి షేవింగ్ చేసుకునే బ్లేడ్లు, దీపావళి టపాసులు అన్నీ చైనా నుంచి వస్తున్నాయి. మేకిన్ ఇండియా అంటే ఇదేనా? అని కెసిఆర్ విమర్శలు గుప్పించారు.