Monday, December 23, 2024

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై బహిష్కరణం

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్, డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా,ఆప్, శివసేన (UBT), కేరళ కాంగ్రెస్ (మణి), విదుతలై చిరుతైగల్ కట్చి, ఆర్‌ఎల్‌డి, జెడియు, ఎన్‌సిపి, టిఎంసి, సీపీఐ, సీపీఎం, నేషనల్ కాన్ఫరెన్స్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఎండిఎంకే, ఆర్జేడీ, ఐయుఎంఎల్.

న్యూఢిల్లీ: ఈ నెల 28న జరగబోయే కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు విపక్ష పార్టీలు ప్రకటించాయి. రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనుండడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని, పార్లమెంటులో ఆత్మలాంటి ప్రజాస్వామ్యానికే చోటు లేనప్పుడు కొత్త భవనానికి ఎలాంటి విలువా లేదని పేర్కొంటూ 19 ప్రతిపక్ష పార్టీలు బుధవారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. సంయుక్త ప్రకటన చేసిన పార్టీల్లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో పాటుగా ఆమ్ ఆద్మీ పార్టీ , తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, సమాజ్‌వాది పారీ ్టతదితర పార్టీలు ఉన్నాయి.‘ కొత్త పార్లమెంటు భవనం ప్రారంభమవుతుండడం ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశం. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని బెదిరిస్తున్నా, విపక్షాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా నిరంకుశ ధోరణిలో వ్యవహరిస్తూ వెళ్తున్నా ఆ విభేదాలన్నిటినీ పక్కన పెట్టి ఈ కార్యక్రమానికి హాజరు కావాలనుకొన్నాం.

అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పూర్తిగా పక్కన పెట్టి ప్రధాని తానే పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనుండడం ప్రజాస్వామ్యంపై నేరుగా జరిపే దాడిగా మేము భావిస్తున్నాం. రాష్ట్రపతి రాజ్యాంగ అధినేతే కాకుండా పార్లమెంటు నిర్వహణలో కీలక బాధ్యతలు కలిగి ఉంటారు. పార్లమెంటును సమావేశపరచడం, ప్రోరోగ్ చేయడం, ఉభయసభలనుద్దేశించి ప్రసంగించడం వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తుంటారు. పార్లమెంటు చేసిన చట్టం అమలు కావాలన్నా రాష్ట్రపతి సమ్మతి అనివార్యం. సంక్షిప్తంగా చెప్పాలంటే రాష్ట్రపతి లేకుండా పార్లమెంటు పని సాగించలేదు. అయినప్పటికీ రాష్ట్రపతి(ద్రౌపది ముర్ము) లేకుండా పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాలని ప్రధాని మోడీ నిర్ణయించారు. నిస్సందేహంగా ఇది అత్యున్నత రాష్ట్రపతి కార్యాలయాన్ని అవమానించడమే. తొలి మహిళా ఆదివాసీని రాష్ట్రపతిగా ఎన్నుకున్నందుకు దేశం గర్వపడుతున్న తరుణంలో ఆ స్ఫూర్తిని నీరుగార్చడమే అవుతుంది’ అని ఆ సంయుక్త ప్రకటనలో విపక్షాలు పేర్కొన్నాయి.

‘అప్రజాస్వామిక చర్యలు ప్రధానికి కొత్తేమీ కాదు. పార్లమెంటులో విపక్ష నేతలు దేశ ప్రజల సమస్యలను లేవనెత్తినప్పుడు వారిపై అనర్హత వేటు వేశారు. సస్పెండ్ చేశారు. వారి మాటలను మ్యూట్ చేశారు. మూడు సాగు బిల్లులతో సహా అనేక వివాదాస్పద చట్టాలను ఎలాంటి చర్చా లేకుండా పార్లమెంటులో ఆమోదించారు. పార్లమెంటు కమిటీలను మూలన పెట్టేశారు. ఏడాదిన్నర కరోనా మహమ్మారి సమయంలో భారీ ఖర్చుతో భారత ప్రజలతోకానీ, ఎంపీలతో కానీ సంప్రదించకుండా నిర్మాణం సాగించారు.పార్లమెంటునుంచి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పక్కన పెట్టినప్పుడు ఇక కొత్త భవనంలో మాకు ఎలాంటి విలువా కనిపించడం లేదు. నిరంకుశ ప్రధాని, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని సమష్టిగా నిర్ణయం తీసుకోవడం ద్వారా ఈ విషయాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం’ అని విపక్షాలు ఆ సంయుక్త ప్రకటనలో తెలిపాయి.

కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన 19 పార్టీల్లో కాంగ్రెస్, డిఎంకె, ఆప్, శివసేన(యుటిబి), సమాజ్‌వాది పార్టీ, సిపిఐ, సిపిఎం, జార్ఖండ్ ముక్తిమోర్చా( జెఎంఎం), కేరళ కాంగ్రెస్( మణి), విడుదలై చిరతుగళై కచ్చి, రాష్ట్రీయ లోక్‌దళ్, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్( యునైటెడ్), ఎన్‌సిపి, తృణమూల్ కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, ఎండిఎంకె ఉన్నాయి.
దురహంకార ఇటుకల నిర్మాణం కాదు.
రాజ్యాంగ విలువల దేవాలయం: రాహుల్
నూతన పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము కాకకుండా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించ బోతుండడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా మోడీపై విరుచుకు పడ్డారు.‘ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభింప జేయకుండా, కనీసం ఆమెను ఆహ్వానించకుండా ఈ కార్యక్రమం నిర్వహించడం దేశ సర్వోన్నత రాజ్యాంగ పదవిని అవమానించడమే. పార్లమెంటు భవనం దురహంకారపు ఇటుకలతో నిర్మించినది కాదు, రాజ్యాంగ విలువలతో నిర్మించిన దేవాలయం’ అని హిందీలో చేసిన ట్వీట్‌లో రాహుల్ దుయ్యబట్టారు.
పునరాలోచించండి: ప్రహ్లాద్ జోషీ
పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరించనున్నట్లు విపక్షాలు చేసిన సంయుక్త ప్రకటనపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందించారు. ఆ పార్టీలు తమ నిర్ణయంపై పునరాలోంచాలని కోరారు. జాతీయ స్ఫూర్తి, దేశ పురోగతిపై గర్వించడమనేది కాంగ్రెస్ పార్టీకి కొరవడిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి విమర్శించారు. పార్లమెంటు అనుబంధ భవనాన్ని 1975 అక్టోబర్ 24న ఇందిరాగాంధీ ప్రారంభించారని, ఆమె తనయుడు రాజీవ్ లైబ్రరీ భవనానికి శంకుస్థాపన చేశారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News