Monday, December 23, 2024

నలు దెసలా పొద్దు పొడుపు

- Advertisement -
- Advertisement -

విశ్వంలోని అనంతమైన శక్తి బ్రాహ్మీ ముహూర్త సమయంలో జీవకోటిలో అంతః చైతన్యాన్ని ప్రేరేపిస్తుందన్నది ఆయుర్వేదమే కాక ఆధునిక విజ్ఞాన శాస్త్రము ఆమోదించిన విషయం. జీవ గడియారాన్ని అస్తవ్యస్తం చేస్తున్న నేటి జీవన విధానంలో మనిషి ఎన్నో అద్భుతాలను కోల్పోతున్నాడు. అందులో ప్రధానమైనది అమృతకాలంగా విశ్వసించే వేకువ జాము. ప్రాతః కాలంలోని ప్రకృతి రమణీయత, సవ్వడి, సౌందర్యం, అరుణోదయ కిరణాల స్పర్శ తాదాత్మకత పులకరింతలకు దూరమవుతున్న వారిని ఆ దిశగా ప్రబలంగా ప్రేరేపించేదే వేకువ కువకువ.పద్య కవి అవధాని చరిత్రకారులు అయిన శాస్త్రుల రఘురామ శర్మ గారు రచించిన వచన కవితా సంపుటి వేకువ కువకువ. ప్రాచీన కాలం నుండి నేటి వరకు ప్రభాత వర్ణన సందర్భోచితంగా సాహిత్యమంతా ఆవరించే ఉంది. ఒకే వస్తువుపై వివిధ కవుల రచనల సంకలనాలు రావడం ఈమధ్య జరుగుతున్నదే.

కానీ శృంగారము ప్రేమ అభ్యుదయం భక్తి భావనలతో పాటు అనేక కోణాలను శర్మగారు ఒకే వస్తువుతో కవిత్వీకరించడంలో వారి పరిశీలనా దృష్టి ఊహా శక్తి కవికి గల స్వేచ్ఛ స్పష్టంగా ప్రకటితమైనాయి. ఇందులో భావనా వైవిధ్యంతో పాటు భాషా వైవిధ్యమూ ఆసక్తికరంగా ఉంటుంది. ఉత్తమ చిత్రకారుడు త్రిగుళ్ళ మురళి గారు ప్రతి కవితకూ కవిత్వం ఒలుకుతున్న అందమైన ఒక చిత్రాన్ని అందించడంతో ఈ సంకలనం మరీ ప్రత్యేకంగా సచిత్ర కవితా సంపుటి అయింది. సాహితీ విమర్శకులు ఏనుగు నరసింహా రెడ్డి గారు ‘ఆధునిక కవిత్వం లోని ప్రధాన లక్షణం ఊహ‘ అని ప్రతిపాదిస్తారు. పిల్లలు విసిరిన చిర్రగోనె తాకి మేఘాలు రక్తాన్ని చిందించడం .ఆ ఎర్రదనాన్ని సూర్యోదయంగా భావించడం ఒక గొప్ప ఊహ. ఊహలను సంతరించుకున్న ఇటువంటి కవితలు ఈ సంకలనాన్ని ఆధునిక కవిత్వంగా నిలబెట్టినాయి.
పోరగాల్లు ఆడుకుంటూ ఇసిరిన సిర్రగోనె / రివ్వున వొయ్యి / మొగుల్ను గుమ్మింది / మొయిల కెల్లి ఎల్లిన నెత్తురు తోటి /ఆడంత ఎర్ర గైంది/ ప్రౌఢ పద్య రచన చేసే శర్మ గారు అసలు సిసలైన తెలంగాణ గ్రామీణుడుగా ఇందులోని కవితలలో బయటపడతారు.
అత్తలు పొయ్యి రాజేసి / కొప్పెర్ల నీల్లు నింపిన్రు/ కొట్టంల కోల్యాగల/ మెడగంటలు / గల్లుమంటున్నయి/ కొడుకు సేతుల సాంటకర్ర / సుర్రుమన్నది/ పెద్దోళ్ల పిల్లలు పెద్దెర్సులు ఎక్కాలు నేరుస్తున్రు/ సావుకారు పటేలింట్ల బుడ్డి తోటి/ లాభం రెండోనే మూడోనె అంటూ….
రఘురామ శర్మ గారి రచనల్లో ఎక్కువ భాగం సంప్రదాయ కవిత్వమే ఉన్నా ఈ సంపుటిలో వారిలోని అభ్యుదయ భావాలు కవిత్వీకరించబడినాయి.
చిమ్మ చీకటి కమ్మిన నల్ల మబ్బులు/మొద్దు నిద్దట్లో అమాయక జీవాలు/ ఎవరైనా తలెత్తితే తాయిలాల జోకొట్లు/ నలుగురిలో మెరిసే చుక్కలు/ నల్ల బజారు నాయకులు/ …. మెరుపు వీరుడు పుట్టుకొస్తాడు/ చీకట్లను పటాపంచలు చేస్తాడు/ లోకం అంతా మేలుకొంటుంది/ చైతన్యాన్ని వెల్లి విరుస్తుంది అంటారు.
మరొక కవితలో
పక్షపాతం లేని వెలుగు కావాలని/ జీవరాశి మేల్కొనాలని అంటారు. రఘురామ శర్మ గారి ప్రాచీన కవిత్వ సమగ్ర అధ్యయన శీలతను కవి సమయాల పాటింపును పట్టి చూపుతూనే చాలా కవితలు ప్రేమ శృంగార భావనలు వర్ణనలు అంతర్లీనంగా ఉండి చదివే వారిలో రసస్పూర్తిని కలిగిస్తాయి. ఆత్మీయతకు దూరా భారం తెలియదు/ ప్రేమకు కాలమానం/ కొలమానం కాదు/ ముడుచుకుపోవడం మునిగిపోవడం/ ఎడబాటుకు అలవాటు /కరాలుసాపి కవోష్ణాన్నీ యడం/ప్రేమకు సంకేతం/ విచ్చుకోవడం విప్పుకోవడం/ విరహానంతర లక్షణం/ పరపరాగ సంపర్కం/ ప్రకృతి ధర్మం/ పద్మిని భాస్కర పరస్పర సంయోగం /ప్రపంచానికే సహకారం / ఆదిపరాశక్తిని జగన్మోహినిగా సంబోధించి ఆమె దంత కాంతులే రవి కిరణాలు అంటారు ఈ కవితలో
జగన్మోహిని దంతకాంతులు/ అరుణగిరి అధరాలు చీల్చుక /నీలికొండల చాటుదాగి / పయోధర వీధులను దాటి / సరగున పరుగున సరసాలాడగ/ సరోజతో కరగ్రహణం సలుపే / మిత్రునికి ఇప్పుడు స్వాగత గీతిక/ నీళ్ళాడటం, సాంటకర్ర, పోరగాళ్లు, సిర్రగోనె, పొయి రాజేసుడు, పెద్దెర్సు వంటి తెలంగాణ మాండలిక పదాలు అందమైన పదబంధాలతోపాటు తాత్విక భావనలు కొన్ని కవితల్లో కనిపిస్తాయి.
రాత్రి పగలను/ రాట్నచక్రములోన/ రాతి బొమ్మల చేసి రంగులాడించు/ రవి కుమారుని రాసలీల విలాసము/ ఒకచోట కవోష్ణపు కౌగిలింత తన్మయత్వాన్నిస్తుంది/ కార్యాచరణకు మార్గమేస్తుంది/ అని కవి అన్నట్టుగా కవితల్లో చిత్రాలను చూపి చిత్రాలలో కవితలని చదివించి ప్రభాత వేళలలో ప్రకృతితో పరిష్వంగాన్ని కోరుకునే విధంగా పాఠకులకు దారి చూపుతుంది వేకువ కువకువ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News