Thursday, February 13, 2025

‘బ్రహ్మా ఆనందం’ను అందరూ ఆదరించాలి: చిరంజీవి

- Advertisement -
- Advertisement -

మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హ్యాట్రిక్ హిట్ల తరువాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ‘బ్రహ్మా ఆనందం’ అనే చిత్రం రాబోతోంది. ఈ చిత్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సావిత్రి, ఉమేష్ కుమార్ సమర్పణలో రూపొందించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ఆర్‌విఎస్ నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు. విజయవంతమైన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

నాగ్ అశ్విన్, అనిల్ రావిపూడి వంటి దర్శకులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “బ్రహ్మానందం తన కొడుకుతో కలిసి చేసిన ఈ బ్రహ్మా ఆనందం మూవీని అందరూ ఆదరించాలి. ఈ మూవీని తీసిన నిఖిల్, నిర్మాత రాహుల్‌కు ఆల్ ది బెస్ట్. రఘు బాబు, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల వంటి వారు నటించడంతో పరిపూర్ణత చేకూరినట్టు అయింది. ప్రియ, ఐశ్వర్య, దివిజలకు ఆల్ ది బెస్ట్‌”అని అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ .. “నిర్మాత రాహుల్‌కు ఎంతో ప్యాషన్ ఉంది. సినిమాను ఎలా తీయాలా? అని నిత్యం ఆలోచిస్తూనే ఉంటాడు. అలాంటి వ్యక్తులతో పని చేయడం నాకు గర్వంగా అనిపిస్తోంది. డైరెక్టర్ నిఖిల్ ప్రారంభంలో నన్ను, రఘుబాబు, రాజీవ్ కనకాల వంటి వాళ్లను చూసి కాస్త తడబడేవాడు. తాత, మనవడు కలిసి చేసే ప్రయాణమే ఈ మూవీ. ఈ కథను నిఖిల్ ఎంతో అద్భుతంగా రాసుకున్నాడు. అంతే అద్భుతంగా తీశాడు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాం”అని తెలిపారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ “రాజా గౌతమ్ తనని తాను సొంతంగా నిరూపించుకుంటూ వస్తున్నాడు. ఆయన ఈ మూవీతో పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. కొడుకు సక్సెస్‌తో బ్రహ్మానందం మనసు నిండిపోవాలని ఆశిస్తున్నాను” అని తెలియజేశారు. దర్శకుడు ఆర్‌విఎస్ నిఖిల్ మాట్లాడుతూ .. “బ్రహ్మానందం లాంటి గొప్ప నటుడితో నేను సినిమాను చేశాను. ఆయన లేకపోతే ఈ సినిమాను చేసేవాడిని కాదు. ఈ మూవీ ఇంత వరకు వచ్చేది కూడా కాదు. వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, సంపత్, రఘు బాబు అద్భుతంగా నటించారు.

రాజా గౌతమ్ చక్కగా నటించారు”అని అన్నారు. నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ “బ్రహ్మా ఆనందం అనే టైటిల్‌తో బ్రహ్మానందంతో సినిమా అనేది చాలా పెద్ద బాధ్యత అనిపించింది. రాజా గౌతమ్, వెన్నెల కిషోర్ ఎంతగానో సపోర్ట్ చేశారు. నిఖిల్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. బ్రహ్మానందం కోసం థియేటర్‌కు వస్తారు.. కానీ రాజా గౌతమ్‌ను ఇంటికి తీసుకెళ్తారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజా గౌతమ్, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య, దివిజ, శాండిల్య, క్రాంతి ప్రియం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News