Monday, December 23, 2024

‘అన్ స్టాపబుల్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం

- Advertisement -
- Advertisement -

బిగ్ బాస్ విన్నర్ విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘అన్ స్టాపబుల్’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ లో రజిత్ రావు నిర్మించారు. నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జూన్ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ‘అన్ స్టాపబుల్’ టీజర్‌, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ.. అందరూ యంగ్ స్టర్స్ కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ కు నా వంతుగా ఉపయోగపడాలని ఈ వేడుకకు వచ్చాను. డైమండ్ రత్న బాబు అంటే నాకు చాలా ఇష్టం. మంచి కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుడు. నా కామెడీ అంటే తనకి చాలా ఇష్టం. ఈ సినిమాలో నన్ను పెట్టడానికి చాలా ప్రయత్నించారు కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. దాదాపు యాభై మంది నటీనటులతో ఈ సినిమా చేయడం ఆనందాన్ని ఇచ్చింది. సన్నీ, సప్తగిరి, బిత్తిరి సత్తి ,షకలక శంకర్, పృథ్వీ, పోసాని కృష్ణ మురళి, చమ్మక్ చంద్ర.. ఇలా ఎంతోమంది నటీనటులతో సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు.

జంధ్యాల గారు, రేలంగి నరసింహరావు గారు, ఈవీవీ గారు, ఎస్వీ కృష్ణారెడ్డి గారి సినిమాల్లో ఇలా తెర నిండుగా నటీనటులు ఉండటం చూశాను. మళ్ళీ ఇంతమందిని ఒక్క దగ్గరికి చేర్చి అన్ స్టాపబుల్ లాంటి మంచి ఎంటర్ టైనర్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది. యువ దర్శకులు, నటులు, నిర్మాతలని ప్రోత్సహించాలి. అప్పుడే పరిశ్రమకు కొత్త ప్రతిభ వస్తుంది. యువ నిర్మాతలు రజిత్ రావు, రఫీలకి ఆల్ ది బెస్ట్. చిత్ర బృందం అంతా కష్టపడి చేసిన ఈ ప్రాజెక్ట్ అద్భుతమైన విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నాను. ఇందులో వున్న నటులని చూస్తుంటే ముప్ఫై ఏళ్ల క్రితం ఇలానే ఉండేవాడని కదా అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళందరిని మీరందరూ ఆశీర్వదిస్తే పెద్దవాళ్ళు అవుతారు. గొప్ప వారు అవుతారు. తర్వాత ప్రతి ఒక్కరూ ఒక బ్రహ్మానందం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.

సప్తగిరి మాట్లాడుతూ.. అన్ స్టాపబుల్ సినిమాకి బ్రహ్మానందం గారి ఆశీస్సులు దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం. నిజానికి ఈ చిత్రంలో సన్నీ హీరో. సన్నీ పక్కన మరో కీలకమైన పాత్ర వుంటే అందులో నేను వుండాలని తీసుకున్నారు. ఈ సినిమాతో సన్నీకి మంచి విజయం రావాలి. నిర్మాత రజిత్ రావు ఎక్కడా రాజీ పడకుండా చాలా ప్యాషన్ తో సినిమాని నిర్మించారు. దర్శకుడు డైమండ్ రత్నబాబు గారు ఒక పట్టుదలతో ఈ సినిమా కోసం పని చేశారు. డైమండ్ రత్నబాబు గారు లాంటి దర్శకులు సక్సెస్ ఐతే మాలాంటి వాళ్లకు మరిన్ని సినిమాలు వస్తాయి. ‘అన్ స్టాపబుల్’ టైటిల్ దొరకడం అదృష్టం. ఈ సినిమాతో రత్నబాబు గారికి అదృష్టం మొదలైయింది. జూన్ 10 బాలకృష్ణ గారి బర్త్ డే కాబట్టి జూన్ 9న సినిమా విడుదల చేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సినిమాని ఆదరించాలి” అని కోరారు.

వి జె సన్నీ మాట్లాడుతూ.. ఈ రోజు చాలా ప్రత్యేకం. సినిమాల్లోకి వచ్చే ముందు నేను జర్నలిస్ట్ గా పని చేశాను. 12 ఏళ్ల క్రితం ఇదే రోజున షారుఖ్ ఖాన్ డాన్ 2 మూవీ ప్రమోషన్ ఇక్కడే జరిగింది. ఆయనతో ఫోటో కూడా తీసుకున్నాను. ఇప్పుడీ వేదికపై ఆయన్ని ఎదురుగా చూస్తున్న అనుభూతి కలుగుతోంది.బ్రహ్మానందం గారు ఈ వేడుకకు రావడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఇది నా జీవితంలో మర్చిపోను. ఈ చిత్రంతో మీ అందరినీ నవ్వించాలనే ప్రయత్నం చేశాం. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.

డైమండ్ రత్న బాబు మాట్లాడుతూ.. ‘అన్ స్టాపబుల్’ అన్ లిమిటెడ్ ఫన్ సినిమా. ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ నిలబెట్టాలనే ప్యాషన్ తో ఈ సినిమా చేశారు నిర్మాత రజిత్ రావు. సన్నీ గారికి కథ నచ్చడంతో సినిమా ఫుల్ ఫన్ తో మొదలైయింది. ఇందులో జిలానీ రామ్ దాస్ పాత్ర కోసం సప్తగిరి గారిని ఎంచుకోవడం జరిగింది. సన్నీ, సప్తగిరి జూన్ 9న థియేటర్ లో రచ్చలేపుతారు. ఇంతమంది నటీనటుల చూస్తే జంధ్యాల, ఈవీవీ గారి సినిమాని చూస్తున్నంత సంతోషంగా ఉందని అందరూ అభినందిస్తున్నారు. పండగ వాతావరణంలా ఈ సినిమా షూటింగ్ జరిగింది.

ఫస్ట్ కాపీ చూసిన తర్వాత చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు వచ్చారు. రిలీజ్ కి ముందే నాకు కారుని బహుమతిగా ఇచ్చారు నిర్మాత. ఈ సంస్థ నిలబడాలి, నాలాంటి దర్శకులకు అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రానికి పని చేసిన అందరూ ఎవరి భాద్యత వారు గొప్పగా నిర్వహించారు. జూన్ 9న ఈ సినిమా అందరినీ అలరిస్తుంది. ఒత్తిడికి ఒక మాత్రలా పని చేస్తుంది. రెండు గంటల పాటు ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటారు” అన్నారు.

నిర్మాత రజిత్ రావు మాట్లాడుతూ.. బ్రహ్మానందం గారికి కృతజ్ఞతలు. ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్. ఫ్యామిలీ అంతా హాయిగా కలిసి చూసే సినిమా. జూన్ 9న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని అందరూ థియేటర్ లో చూసి మమ్మల్ని ఆదరించాలి. వి జె సన్నీ, సప్తగిరి, డైమండ్ రత్నబాబు గారికి, ఈ చిత్రంలో పని చేసిన అందరికీ ధన్యవాదాలు” తెలిపారు. ఈ ఈవెంట్ లో అక్షా, శివన్య, సురేష్ కొండేటి, రఫీ తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News