రణ్‌బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని, కరణ్ జోహార్, అలియా భట్, అయాన్ ముఖర్జీ కాంబినేషన్‌లో ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌లో వస్తున్న అద్భుతమైన సినిమా బ్రహ్మాస్త్ర. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రాజమౌళి సమర్పిస్తున్నారు. శనివారం ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్బంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజమౌళి, నాగార్జున అక్కినేని, రణబీర్ కపూర్, అలియా భట్, కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ.. “బ్రహ్మాస్త్ర విజన్ చాలా ప్రత్యేకమైనది. ఇది దాని కథ, కథనంలో ప్రతిబింబిస్తుంది.
అనేక విధాలుగా ఇది నాకు ‘బాహుబలి’ని గుర్తు చేస్తుంది. ‘బాహుబలి’కి నేను చేసినట్లే అయాన్ ముఖర్జీ కూడా ‘బహ్మాస్త్ర’ను రూపొందించడంలో సమయాన్ని వెచ్చించడం చూశాను. అయాన్‌తో మాట్లాడినప్పుడు సినిమా పట్ల అతనికున్న ప్రేమ చూసి ‘ఇతనెవరో నాకంటే పిచ్చోడులా ఉన్నాడు’ అనుకున్నా. ఎందుకంటే అతనికి సినిమాపై నాకంటే ఎక్కువ ఇష్టం ఉంది”అని అన్నారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ.. “బ్రహ్మాస్త్ర చిత్రం నా కల. ఇది మూడు భాగాలుగా చేస్తున్న ప్రతిష్టాత్మకమైన సినిమా. ఇప్పటి వరకు చేసిన ప్రయాణం ఎంతో అద్భుతం. రాజమౌళి ఈ సినిమాలో భాగం కావడం ధైర్యాన్నిచ్చింది” అని తెలిపారు.