బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్రం’ మొదటి భాగం శివ. అలియా భట్ హీరోయిన్. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోక్స్, స్టార్ లైట్ పిక్చర్స్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న ఈ భారీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈనెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ “కరణ్‌జోహార్, రాజమౌళి కలిసి మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏకం చేశారు. వారంటే ఎంతో గౌరవం.
ఈ సినిమాతో కరణ్ జోహార్ తన కెరీర్‌లో మరో మైల్‌స్టోన్‌ను సాధిస్తారని భావిస్తున్నాను. ‘బ్రహ్మాస్త్రం’ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఓ బ్రహ్మాస్త్రం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ”అని అన్నారు. అక్కినేని నాగార్జున మాట్లాడుతూ “ఈ సినిమా విజువల్‌గా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అందరికీ వండర్‌ఫుల్ జర్నీగా విజువల్ ట్రీట్‌గా అనిపిస్తుంది”అని పేర్కొన్నారు. ఈ చిత్ర సమర్పకుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ “బ్రహ్మాస్త్రం అనేది ఇండియన్ కథ. ఇండియన్ ఎమోషన్స్‌కు సంబంధించిన కథ. అయాన్ ముఖర్జీ ఈ సినిమా కథ చెప్పినప్పుడు నా చిన్ననాటి ఫాంటసీ విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి”అని చెప్పారు. రణబీర్ కపూర్ మాట్లాడుతూ “నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘బ్రహ్మాస్త్రం’. త్రీడీలో కూడా ‘బ్రహ్మాస్త్రం’ రాబోతోంది”అని పేర్కొన్నారు. దర్శక నిర్మాత కరణ్ జోహార్ మాట్లాడుతూ అయాన్ ముఖర్జీ కష్టం నుంచి వచ్చిన కలను ఈనెల 9న ఈ ప్రపంచం వీక్షింబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అలియా భట్, కె.మాధవన్, విక్రమ్ దుగ్గల్, అపూర్వ మెహతా, మౌనీ రాయ్, నమిత్ మల్హోత్రా తదితరులు పాల్గొన్నారు.
Brahmastra Movie Press Meet in Hyderabad