కేంద్రపర (ఒడిశా) : ఒడిశాలో ప్రాచీన మున్సిపాలిటీగా చెప్పుకునే కేంద్రపర మున్సిపాలిటీలో స్మశాన వాటిక లోనూ కులతత్వం పాటించడంపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మున్సిపాలిటీ లోని హజరీబగిచా ప్రాంతంలో దహనవాటిక ప్రవేశం లోనే బ్రాహ్మిణ్ స్మశాన వాటిక అని సూచిస్తూ ప్రత్యేకించి బోర్డు పెట్టారు. ఈ స్మశాన వాటిక గత కొన్నేళ్లుగా బ్రాహ్మణుల దహనవాటికగా ఉపయోగపడుతోంది. అయితే ప్రభుత్వ నిధులతో ఇటీవలనే సౌకర్యాలతో పునరుద్ధరించిన తరువాత ప్రత్యేకించి బోర్డు పెట్టడం విమర్శలకు దారి తీస్తోంది.
ఇతర కులాల వారు తమ బంధువులు ఎవరైనా చనిపోతే సమీపాన ఉన్న మరో స్మశాన వాటికలో అంత్యక్రియలు చేస్తుంటారు. ఆ స్మశాన వాటిక కూడా పునరుద్ధరించడమైంది. ప్రత్యేకించి బ్రాహ్మణులకే ఈ దహనవాటిక అని బోర్డు పెట్టి కులతత్వం పాటించడం స్థానికంగా మిగతా కులాల వారు మండిపడుతున్నారు. కేంద్రపర మున్సిపాలిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రఫుల్ల చంద్ర బిస్వాస్ ఈ వివాదంపై మాట్లాడుతూ ఈ విచక్షణ లేకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. దళిత హక్కుల ఉద్యమనేతలు, రాజకీయ నాయకులు దీనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విధంగా చేయడం కులవిభేదాలను రెచ్చగొట్టడమేనని ధ్వజమెత్తుతున్నారు.