భోపాల్: బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ ఇంచార్జ్ పి.మురళీధర్‌రావు చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో దుమారం రేపాయి. బ్రాహ్మణులు, బనియాలు తన జేబుల్లో ఉన్నారంటూ రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. రావు తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. కాగా, తన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ వక్రీకరించిందని రావు అన్నారు. మురళీధర్‌రావు తెలంగాణకు చెందినవారన్నది తెలిసిందే. ఎబివిపి నేతగా ఆయన ఆ పార్టీలో ఎదిగివచ్చారు. సోమవారం భోపాల్‌లోని బిజెపి ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సబ్‌కాసాత్, సబ్‌కా వికాస్‌లో భాగంగా తమ పార్టీ ఎస్‌సి, ఎస్‌టిలపై దృష్టి సారించిందని చెప్పిన రావు, తన కుర్తా జేబులను చూపిస్తూ బ్రాహ్మణులు, బనియాలు తన జేబుల్లో ఉన్నారని అన్నారు. తమ పార్టీని బ్రాహ్మణులు, బనియాల పార్టీగా విమర్శలు చేస్తారు. ఆ వర్గాల్లో తమకు అధిక ఓటుబ్యాంక్ ఉండటం వల్లే అలా అంటున్నారని రావు సమర్థించుకున్నారు. సమాజంలోని అన్ని వర్గాల విశ్వాసం పొందాలన్న లక్షంతోనే తాము ఎస్‌సి, ఎస్‌టిలపై దృష్టి సారించామన్నారు. ప్రస్తుతం ఆ వర్గాల ప్రాతినిధ్యం తమ పార్టీలో తక్కువగా ఉన్నదన్నారు.