Thursday, January 23, 2025

కింగ్ అయినా, కింగ్ మేకర్ అయినా బ్రహ్మణ సమాజం పాత్ర కీలకం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాటలు చెబుతున్నది ఎవరో…. చేతలు చేస్తున్నది ఎవరో గమనించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఇదం బ్రహ్మం… ఇదం క్షాత్రం అంటాము. అవసరమైనప్పుడు వేదం చదవాలి….అవసరమైతే గాండీవం ఎత్తాలి. అటువంటి సందర్భం, సమయం, అటువంటి స్పూర్తి మనం అలవర్చుకోవాలి. విజ్ఞత ప్రదర్శించాలి. ఎందుకంటే మాటలు చెబుతున్నదెవరు…చేతలు చేస్తున్నదెవరు అన్నది గమనించాలి. ఒక హంసలాగా పాలెంటి… నీళ్లేంటి అన్న విషయాన్ని విడగొట్టి చూడగలగాలి. అని వ్యాఖ్యానించారు.

తెలంగాణ స్పూర్తితో ఎన్ని రాష్ట్రాల్లో బ్రహ్మణులకు మంచి జరుగుతదన్న విషయాన్న ఆలోచించాలని కోరారు. విభ్రహిత భవనం ప్రారంభించుకున్న రోజు దాదాపు 20 రాష్ట్రాల నుంచి బ్రహ్మణులు ఆశీర్వాదం పంపించారని తెలిపారు. తమ తమ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి పథకాలను రాబట్టుకుంటామని ఆయా రాష్ట్రాల బ్రహ్మణులు అన్నారన్నారు. ఇంత స్పూర్తిదాయక ప్రభుత్వం నడుపుతున్న సీఎం కేసీఆర్ ను అశీర్వదించాలన్నారు.ఆదివారం నాడు హైదరాబాదులో జరిగిన బ్రహ్మ గర్జన కార్యక్రమంలో పాల్గొని ఆమె ప్రసంగించారు.

తమది సంస్కృతి , సంప్రదాయాలు కలిగిన కుటుంబమని తెలిపారు. అపారమైన జ్ఞానం, భాషపై పట్టు ఉన్నప్పటికీ తక్కువ మంది బ్రహ్మణుల వద్ద ఆస్తులు, భూములు ఉంటాయని, దాంతో కేవలం పౌరోహిత్యంపై ఆధాపడి జీవిస్తుంటారని వివరించారు. దేశ స్వతంత్ర ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో, విప్లవోద్యమాల్లోనూ కీలక పాత్ర పోషించినా రాజకీయ ప్రాతినిధ్యం తగ్గుతూ వస్తున్న విషయం వాస్తవమేనని చెప్పారు. కానీ బీఆర్‌ఎస్ పార్టీ మాత్రం ఎక్కడ అవకాశముంటే అక్కడ బ్రహ్మణులకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నామని, భవిష్యత్తలోనూ మరిన్ని అవకాశాలు కల్పించేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీని అశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా బ్రహ్మణులకు ఒక్క రూపాయి ఇచ్చిన పాపానపోలేదని విమర్శించారు. తెలంగాణ ఏర్పడడంలో బ్రహ్మణుల పాత్రను బీఆర్‌ఎస్ పార్టీ గుర్తించిందని, దైవ కృప, బ్రహ్మణుల ఆశీర్వాదం లేకపోతే రాష్ట్రం వచ్చేదికాదన్నది వాస్తమని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో గుడి బంద్ పెట్టడాన్ని తాము ఎన్నటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు. తమతో పాటు నిరాహార దీక్షల్లోనూ అర్చకులు పాల్గొన్నారని గుర్తు చేశారు.

సమాజానికి జ్ఞానజ్యోతిని పంపించే బ్రహ్మణుల ప్రకాశాన్ని మరింత పరివ్యాప్తం చేయడానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని స్పష్టం చేశారు. అర్చకులకు జీతాలు ఇవ్వడం, ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు దూపదీప నైవేధ్యానికి రూ. 2500 నుంచి రూ. 10 వేలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం పెంచిందని వివరించారు. దూపదీప నైపధ్యం కింద 6 వేల దేవాలయాలకు డబ్బు ఇస్తున్నారని, వాటిని 8 వేల దేవాలయానికి విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వెల్లడించారు.దేవాలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని తీసుకొని ప్రభుత్వాలు తిరిగి దేవాలయాలకు ఇవ్వవని దేశవ్యాప్తంగా అనేక మంది ఆవేదన చెందుతుంటారని, కానీ తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక చిన్న చిన్న దేవాలయలకు కలిపి రూ. 2242 కోట్ల డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. పెద్ద పెద్ద దేవాలయాల విషయంలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి రూ. 1200 కోట్ల, కొండగట్టు అంజన్న స్వామి దేవాలయానికి రూ. 500 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. హైదరాబాద్ లో దాదాపు 1600 దేవాలయలకు రూ. 10 వేల నుంచి రూ. 5 లక్షల వరకు బోనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు.

ఎంత చేసినా చేయాల్సింది చాలా ఉంటుందని, కాబట్టి భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం బ్రహ్మణ విద్యార్థులను ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సివిల్ సర్విస్ పరీక్షలకు సన్నద్ధమయ్యే బ్రహ్మణ విద్యార్థుల కోసం కోచింగ్ ఇచ్చే ఏర్పాట్లను ప్రభుత్వం చేసిందని, విదేశీ విద్య కొసం ఒక్కో విద్యార్థికి రూ. 20 లక్షలు ఇస్తోందని, దాదాపు 750 మంది విద్యార్థులు ఇప్పటికే లబ్దీపొందారని అన్నారు. ఫీజు రియింబర్స్ మెంట్ పథకాన్ని ఇతర రాష్ట్రాల్లో ఐఐటీ, ఐఐఎం సీట్లు సాధించిన విద్యార్థులకు కూడా వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆ మేరకు ప్రభుత్వంలో పని జరుగుతోందని పేర్కొన్నారు.

రాజకీయంగా అత్యంత చైతన్యం కలిగి ఆలోచన చేయగలిగే సమూహం బ్రహ్మణులదని, సమర్థరామ దాస్ లేకపోతే శివాజీ లేడని, వశిష్టుడు, విశ్వామిత్రుడు లేకపోతే శ్రీరామచంద్రుడు ధర్మంపట్టుకొని నిలబడేవాడు కాదని, కాబట్టి గురువు లేనిదే మన దేశంలో ఒక్కరు కూడా నాయకుడు, రాజు కాలేరని వివరించారు. కింగ్ అయినా, కింగ్ మేకర్ అయినా బ్రహ్మణ సమాజం పాత్ర కీలకంగా ఉంటుందని చరిత్ర చెబుతోందన్నారు.బ్రహ్మణులను హేళన చేయడం, ఇబ్బంది పెట్టడం వంటి సంఘటనలు తమ పార్టీ నాయకుల దృష్టికి వస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరు ఎవరినీ కూడా హేళన చేస్తే సహించే ప్రభుత్వం కాదని, అందరి రక్షణ తమ బాధ్యత అని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ భాషను, యాసను అవహేళన చేసినప్పుడు తెలంగాణ జాగృతి గళమెత్తిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సత్యానంద భారతీ స్వామి, ఎమ్మెల్సీ వాణి , టిఎస్‌ఐడిసి ఛైర్మన్ వేణగోపాల చారి, ఎమ్యేల్యేలు సుదీర్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, బ్రాహ్మణ పరిషత్ ఛైర్మన్ రమణాచారి, సర్వస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ, సినీ నటుడు కాదంబరి కిరణ్, మాజీ ఎమ్మెల్సీలు రామచందర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News