న్యూఢిల్లీ: నౌకాదళంలో ఉపయోగించే ఆధునీకరించిన సూపర్‌సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిని మంగళవారం భారత నౌకాదళానికి చెందిన స్టీల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్‌నుంచి విజయవంతంగా ప్రయోగించి పరీక్షించారు. ఈ క్షిపణి నిర్దేశించిన లక్షాన్ని కచ్చితంగా ఢీకొట్టి ధ్వంసం చేసిందని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డిఆర్‌డిఓ) తెలిపింది. ‘ఆధునీకరించిన సముద్రంనుంచి సముద్రంపై లక్షాలపైకి ప్రయోగించే వేరియంట్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిని మంగళవారం ఐఎన్‌ఎస్ విశాఖపట్నంనుంచి పరీక్షించడం జరిగింది. ఈ క్షిపణి నిర్దేశించిన లక్షాన్ని కచ్చితంగా ఢీకొట్టింది’ అని డిఆర్‌డిఓ ఒక ప్రకటనలో తెలియజేసింది. క్షిపణి ప్రయోగం విజయవంతం కావడం భారత నౌకాదళ యుద్ధ సన్నద్ధతను మరోసారి రుజువు చేసిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక ట్వీట్‌లో తెలియజేశారు. జలాంతర్గాములు, నౌకలు, విమానాలు లేదా ల్యాండ్ ప్లాట్‌ఫామ్‌లనుంచి ప్రయోగించగల బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత్ , రష్యాల జాయింట్‌వెంచర్ అయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ తయారు చేసింది. శబ్దానికి దాదాపు మూడు రెట్ల వేగంతో ఈ బ్రహ్మోస్ క్షిపణి ప్రయాణిస్తుంది.