Sunday, December 22, 2024

యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/యాదాద్రి : తెలంగాణ మహాక్షేత్రం ఆధ్యాత్మిక నిలయం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవ వేడకలకు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారము అత్యంత వైభవంగా ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుని వార్షిక బ్రహ్మోత్సవాలను పాల్గుణ శుద్ద పాడ్యమి మొదలుకొని పాల్గుణ శుద్ద ఏకాదశి వరకు 11 రోజుల పాటూ జరుగు ఉత్సవాలను మంగళవారం శాస్త్రనుసార పూజలతో తొలిరోజు యజ్ఞచార్యులు, అర్చకులు, పండితులు శ్రీకారం చుట్టారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయం పునర్ నిర్మాణంలో తొలిసారి నవ క్షేత్రంలో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ఆలయంలో నిత్యారాధనల అనంతరము శ్రీ విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధన పూజమహోత్సవాలను సాయంత్రము మృత్సంగ్రహణము, అంకురారోపణ పూజలను శ్రీపంచరాత్ర ఆగమ శాస్త్ర్రానుసారము నిర్వహించారు.

శ్రీవిష్వక్సేన ఆరాధన……

శ్రీవారి బ్రహ్మోత్సముల ప్రారంభం సందర్బంగా శ్రీ స్వామివారి ఆలయంలో ఉత్సవములు నిర్విఘ్నముగా కొనసాగాలని, లోకములకు శుభములుకలగాలని వేదమంత్రములు పఠిస్తూ శాస్త్రానుసారము శ్రీ విష్వక్సేన ఆరాధన పూజలను గావించారు.ఈ వేడుకద్వార భగవథనుగ్రహముతో విశ్వశాంతి లోక కల్యాణం కలుగునని అర్చకులు తెలిపారు.

స్వస్తివాచనము..

లోకమంత సుభిక్షంగా ఆయురారోగ్యములతో ఉండాలని స్వస్తివాచన మంత్రములతో భగవంతుడుని వేడుకోని ఉత్సవ సామాగ్రి, ఆలయ ప్రాంతము అన్నికూడ శుద్ది గావించుటకు మంత్రజలములతో శుద్ది పరిచారు.

రక్షాబంధనము..

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఎటువంటి ఆవరోదాలు ఆటంకాలు కల్గకుండా ఉత్సవ మూర్తి అయిన శ్రీలక్ష్మీనరసింహుడికి రక్షాబందన్ గావించి, ఉత్సవ నిర్వాహకులైన అర్చకులు, అధికారులు, భక్తులకు రక్షాబంధనము చేశారు.

మృత్సంగ్రహణము, అంకురారోపణ…

శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవములలో భాగంగా సాయంకాలం ఆలయంలో నిత్యారాధనల అనంతరము మృత్సంగ్రహణము,అంకురారోపణ వేడుకలను నిర్వహించారు. భూసూక్తములతో భూదేవిని అర్చించి మృత్తికను సేకరించి పాకలలో నింపిపూజించారు. మంత్రములతో నవధాన్యములను మంత్రించి పాలికలో నింపిన పవిత్రజలములతో ఉత్సవాంతము వరకు ప్రతిరోజు పూజించి లోకమంతా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలని భగవానిడిని వేడకునుట ఈ వేడుకగా తెలిపారు. ఈ బ్రహ్మత్సోవ ప్రారంభ వేడుకలను ఉత్సవ యజ్ఞచార్యలు కాడూరి వెంకటచార్యలు, ఆలయ ప్రధానార్చకులు నల్లంతీగల్ శ్రీలక్ష్మీనరసింహ చార్యులు,ఉపప్రధానార్చకులు సురేంద్రచార్యలు, అర్చకులు మాదవచారి, రాఖేషచార్యులు,శ్రీకాంత్,వేణు వేడుక పూజలను నిర్వహించగా ఈవేడుకలలో ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహ్మమూర్తి, ఆలయ ఈవో గీత, సహాయ కార్యనిర్వహణ అధికారులు భాస్కరశర్మ, రఘు, పర్యవేక్షకులు సురెందర్‌రెడ్డి, నరేష్, ఆలయ అధికారి సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News