యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం గోవర్ధనగిరిధారి, రాత్రి సింహవాహన అలంకార రూపిడుగా భక్తకోటికి స్వామివారు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో నిత్యారాధనలు అనంతరం గోవర్ధనగిరిధారిగా శ్రీలక్ష్మీనరసింహుని అలంకరించి అర్చకులు, పండితులు, పారాయణికులు ఆగమ శాస్త్రరీత్యా వేద మంత్రాలను ఉచ్ఛరిస్తూ మేళతాళాల మధ్య శ్రీవారి సేవను ఊరేగించగా భక్తులు, స్థానికులు దర్శించుకున్నారు. సాయంత్రం శ్రీస్వామి వారిని సింహ వాహన సేవలో అలంకరించి మేళతాళాల నడుమ
వేదమంత్రాలు ఉచ్ఛారణ చేస్తూ ఆలయ మాడవీధులలో ఊరేగించి మండపంలో స్వామివారి సేవను కొలువుదీర్చగా భక్తులు దర్శించుకొని తరించారు. అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి స్వామి వారి బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వేడుకల్లో అనువంశిక ధర్మకర్త నరసింహ్మమూర్తి, ఆలయ ఇన్‌చార్జి ఇఒ రామకృష్ణారావు, యజ్ఞాచార్యులు, ప్రధాన అర్చకులు నల్లంధిగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాడూరి వెంకటాచార్యులు, వేద పండితులు, అర్చకుల బృందం, ఆలయ ఉద్యోగ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.