‘చుట్టూరా ఆవరించి ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే, ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్నైనా వెలిగించడం ఎంతో మంచిది” అన్న ఒక మహాకవి మాటలు చాలా మందిమి అలవోకగా అనేస్తుంటాం. దానిని మాట వరసకే పరిమితం చేస్తాం. కానీ ఒక మహానుభావుడు తన చుట్టూ అలుముకున్న అంధకారాన్ని పారదోలి, ఒక అఖండ విజ్ఞాన జ్యోతిని వెలిగించి కోట్లాది మందికి వెలుగుబాట వేసి బతుకు బాట చూపాడు. ఆయన ఎవరో కాదు అంధుల చదువు కోసం ఒక ప్రత్యేకమైన లిపిని వృద్ధి చేసి, దానితో అంధులలో ఉన్న నిరాశను, నిరాసక్తతను పారదోలి మొత్తం మానవాళికే మహత్తర ఉపకారం చేసిన గొప్ప దార్శనికుడు.
లూయిస్ బ్రెయిలీ ఫ్రాన్స్‌లోని కూప్‌వ్రేలో 1809 జనవరి 4వ తేదీన జన్మించారు.
పారిస్‌కు ఇది 30 మైళ్ల దూరంలో ఉన్న పట్టణం. లూయిస్ బ్రెయిలీ కుటుంబానికి గుర్రాల జీనులను తయారు చేసే దుకాణం ఉండేది. నాలుగేళ్ల వయస్సులో ఉన్న బ్రెయిలీ ఒక రోజు జీనులను తయారు చేసే తోలు లోపలికి రంధ్రం చేయడానికి ఒక మొలతో ప్రయత్నం చేస్తుండగా, తన శక్తి సరిపోక ఎగిరి వచ్చి కన్నుకు తగిలింది. కన్ను మొత్తం రక్తమయమైపోయింది. అక్కడ ఆధునిక వైద్యశాల లేదు. ఆధునిక వైద్యం కోసం వెళ్లాలంటే చాలా దూరం పోవాలి. అక్కడ ఉన్న ఒక సాంప్రదాయక వైద్యుని దగ్గరికి వెళ్తే ఆయన కన్నులో పసరు పోసి కట్టుకట్టారు. అయితే వారాలు గడిచినా ఆ గాయం మానకపోగా, కన్ను ఇన్‌ఫెక్షన్ అయింది. అంతేకాకుండా ఆ ఇన్‌ఫెక్షన్ రెండో కంటికి పాకింది. పారిస్‌లో సర్జన్‌ను సంప్రదించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇట్లా గడిచి అయిదేళ్లు వచ్చేసరికి పూర్తిగా అంధుడయ్యాడు. తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన అంధత్వాన్ని తొలగించలేకపోయారు.
అదే అంధత్వంతో ఆయన చదువును సాగించాడు. పదేళ్ల వరకు బ్రెయిలీ తన గ్రామంలోనే చదువుకున్నారు. అయితే ఆ గ్రామంలోని స్థానిక ఉపాధ్యాయులు, మత గురువులు బ్రెయిలీని పారిస్‌లోని రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్లైండ్ యూత్‌లో చేర్చించారు. దానిని ఆ తర్వాత నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ బ్లైండ్ యూత్‌గా మార్చారు. అయితే ఆ స్కూల్ వ్యవస్థాపకులు వెలెంటెన్ హమ్ అంధుల కోసం తన జీవితాన్ని పూర్తిగా వెచ్చించారు. ఆయన ఒక విధానాన్ని తయారు చేశారు. పెద్ద పెద్ద కాగితాల మీద లాటిన్ అక్షరాలను ఎంబోజ్ చేసి చదివించేవాళ్ళు. అది చాలా కష్టంగా ఉండేది. లూయిస్ బ్రెయిలీ ఆ విధానంలోనే చదివారు.
అయితే నెపోలియన్ సైన్యంలో సైనికాధికారిగా పని చేసిన చార్లెస్ బార్ బెయిల్ తమ సైనికులు రాత్రిళ్లు వెలుగు లేకుండా చదవడం కోసం ఒక లిపిని రూపొందించారు. అది చుక్కల ద్వారా, సంజ్ఞలతో కూడుకొని ఉండేది. ఇది ఎక్కువ పేజీలు అవసరం లేకుండానే చేయవచ్చును అని రుజువైంది. దీనిని స్ఫూర్తిగా తీసుకొని లూయిస్ బ్రెయిలీ ఈ రోజు మనం చూస్తున్న బ్రెయిలీ లిపిని రూపొందించారు. అయితే దీనిని అంత తేలికగా ఆనాటి ప్రభుత్వం అంగీకరించలేదు. 1824 వరకు బ్రెయిలీ ఈ అక్షర విధానాన్ని రూపొందించారు.
ఆ ప్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ అలెగ్జాండర్ రినే పిగ్నెయిర్ లూయిస్ బ్రెయిలీకి సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఆ తర్వాత ప్రిన్సిపాల్‌గా వచ్చిన యువ అధ్యాపకుడు పెయిర్రో అర్మాండ్ దీనిని వ్యతిరేకించారు. అయితే మరొక ఉపాధ్యాయుడు జోసఫ్ గేడెట్ లూయిస్ బ్రెయిలీకి అండగా నిలిచారు. దానితో 1844లో మళ్లీ బ్రెయిలీ అక్షర క్రమాన్ని బోధించడం ప్రారంభించారు. ఇంత ప్రయోజనం ఉన్నప్పటికీ అప్పటి ఫ్రెంచ్ ప్రభుత్వం దీనిని ప్రభుత్వ విధానంగా అంగీకరించలేదు. ఆ పాఠశాల వరకు వాళ్ళు అనుమతించారు. కానీ దీనిని జాతీయ విధానంగా ఒప్పుకోలేదు. అయితే చాలా మంది అంధులు, ఇతర సంఘ సేవకులు, కార్యకర్తల ఒత్తిడి ప్రతిఘటన వల్ల 1854లో ఫ్రెంచి ప్రభుత్వం దీనిని జాతీయ విధానంగా ప్రకటించారు. కాని అప్పటికి రెండు సంవత్సరాల క్రితం 1852లో లూయిస్ బ్రెయిలీ తుది శ్వాస విడిచారు. ఆయన జీవించిన కాలంలో దానికి ఆ గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఫ్రెంచి మాట్లాడే ప్రాంతమంతటికీ బ్రెయిల్ చదువు వ్యాపించింది.
ఆ లిపి ఫ్రెంచి మొత్తాన్ని ప్రభావితం చేసింది.
దానితో పాటు, 1873లో జరిగిన ప్రథమ యూరోపియన్ అధ్యాపకుల సదస్సులో దీనికి చాలా మద్దతు దొరికింది. దానితో యూరప్ అంతటికీ బ్రెయిలీ లిపి విస్తరించింది. దీనికి డా. థామస్ రోడెస్ కృషి మరువలేనిది. ఇది 1916లో అమెరికాలో కూడా ఆమోదించారు. అంతమంగా 1932లో ఇంగ్లీషు అక్షర మాలలో కూడా దీనిని రూపొందించడంతో ప్రపంచ వ్యాప్తమైంది. ఇప్పటికి ప్రపంచంలో 15 కోట్ల మందికి పైగా లూయిస్ బ్రెయిలీ లిపితో ప్రయోజనం పొందుతున్నారు.
బ్రెయిల్ ఎన్నో పుస్తకాలను రచించారు. ఇందులో “మెథడ్ ఆఫ్ వర్డ్, మ్యూజిక్ అండ్ ప్లెయిన్‌సాంగ్”, లిటిల్ సినాప్సిస్ ఫర్ బెగినర్స్”తో పాటు, అంధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన “డాట్స్ ది ఫామ్ ఆఫ్ లెటర్స్, మ్యాప్స్, జియోమెట్రిక్ ఫిగర్స్, మ్యూజికల్ సింబల్స్”ను రచించి ప్రపంచానికి తన విజ్ఞాన జ్యోతిని అందించారు. ఆయన జన్మస్థలం కూప్‌వ్రేలో ఆయన రచించిన రాత ప్రతులు మ్యూజియంలో ఉన్నాయి. కేవలం 43 సంవత్సరాలు మాత్రమే జీవించిన లూయిస్ బ్రెయిలీ ఈ ప్రపంచం మనుగడలో ఉన్నంత కాలం బ్రెయిలీ లిపి రూపంలో ఒక ప్రచండ జ్యోతిగా, అద్భుత శక్తిగా ప్రజల మనస్సుల్లో కొలువై ఉంటాడనడంలో సందేహం లేదు.
ప్రపంచంలోనే అత్యంత స్ఫూర్తి, ఎంతో ప్రయోజనం అందించిన లూయిస్ బ్రెయిలీ జయంతిని ప్రతి సంవత్సరం జనవరి 4వ తేదీన ప్రపంచమంతా జరుపుకుంటారు. మన దేశంలో కూడా అటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి.
లూయిస్ బ్రెయిలీని స్మరించుకొని, ఆయన సేవలను, కృషిని ప్రశంసించడమంటే కేవలం బ్రెయిలీ లిపిని గుర్తించడమొక్కటే కాదు. ప్రస్తుతం దృష్టి లోపం ఉన్న ఎన్నో కోట్ల మంది జీవితాల్లో మార్పులు తేవాలి. అంతేకాకుండా దృష్టిలోపం కలుగకుండా ఉండడానికి చర్యలు తీసుకోవాలి. చికిత్స మాత్రమే కాదు, నివారణ కూడా రోగానికి, సమస్యకు చాలా ముఖ్యం. మన దేశంలో సంపూర్ణంగా సంపూర్ణ దృష్టిలోపం ఉన్నవాళ్లు దాదాపు పది మిలియన్లు ఉంటారని అంచనా. ప్రపంచంలోనే అంధుల సంఖ్యలో మనమే టాప్. రెండవ స్థానంలో చైనా 9 మిలియన్లుగా చెబుతున్నారు. మూడవ స్థానంలో ఇండోనేషియా, వరుసగా రష్యా, బ్రెజిల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, నైజీరియా, అమెరికా, మెక్సికో ఉన్నాయి. సంఖ్యలోనే కాక దృష్టి లోపం జనాభాలో శాతాన్ని బట్టి లెక్క వేసినా మనం అయిదవ స్థానంలో ఉన్నాం. ప్రపంచంలో ఉన్న ముగ్గురు అంధులలో మన దేశంలో ఒకరు ఉన్నారు.
మన దేశంలో దృష్టి లోపాన్ని మూడు రకాలుగా చూస్తున్నారు. ఒక సంపూర్ణం, రెండోది మధ్యస్తం, మూడోది పాక్షికం. పిల్లల్లో కూడా దృష్టి లోపం ఎక్కువగానే ఉన్నది. పదహారు సంవత్సరాల లోపు ఉన్నవాళ్లు 3.2 మిలియన్లు ఉన్నారు. ఇందులో కేవలం అయిదు శాతం మాత్రమే చదువుకోగలుగుతున్నారు. ఇందులో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారు. వీరికి విద్య, వైద్య సౌకర్యాలు లేవు. దేశంలో 40 వేల మంది నేత్ర వైద్యులు అవసరముండగా, కేవలం ఎనిమిది వేల మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. ప్రతి సంవత్సరం 2.5 లక్షలు నేత్రాలు దానం అవసరం కాగా, కేవలం 25 వేలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంటే చాలా మందికి నేత్ర దానం మీద అవగాహన లేకపోవడం దీనికి కారణం. అంధత్వాన్ని గాని, పాక్షిక దృష్టి లోపం దాదాపు 86 శాతం వరకు నివారించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఇందులో సామాజిక, ఆర్థిక, మతపరమైన అడ్డంకులున్నాయి.
దృష్టి లోపం ఏర్పడడానికి అవగాహన లోపంతో పాటు, సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం, పేదరికం, సామాజిక మూఢ నమ్మకాలు, సాంప్రదాయక వివాహాలు కారణమని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకే కుటుంబంలో పెళ్ళిళ్ళు, కులం లోపలే సంబంధాలు, మతంలోనే వివాహాలు అన్నీ కూడా అన్ని రకాల శారీరక లోపాలతో పాటు అంధత్వానికి కూడా కారణమవుతున్నాయి. లూయిస్ బ్రెయిలీకి నివాళులర్పించడమంటే దృష్టి లోపం ఉన్న వాళ్లందరికీ బ్రెయిలీ లిపిలో విద్యను అందుబాటులోకి తేవాలి. అదే విధంగా పేదరికం నిర్మూలనతోపాటు, సామాజిక కట్టుబాట్లు పాత సాంప్రదాయాలను ప్రజలు విడనాడే విధంగా చైతన్యం కల్పించాలి. ఇందుకు ప్రభుత్వాలు మొదటి బాధ్యతగా వ్యవహరించాలి. ఇతర సంస్థలను, వ్యక్తులను కలుపుకొని అంధత్వ నిర్మూలన ఒక మహోద్యమంగా సాగించాలి.
మల్లేపల్లి లక్ష్మయ్య
దర్పణం