Wednesday, January 22, 2025

మెడికల్ ప్రవేశాలకు బ్రేకులు పడటం

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంబిబిఎస్, బిడిఎస్ అడ్మిషన్ల ప్రక్రియకు బ్రేకులు పడటం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. విద్యార్థులను ఆగం చేసి.. ఇంకెంత కాలం దీన్ని సాగదీస్తారని అడిగారు.వైద్య విద్యను అభ్యసించాలని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థుల జీవితాలతో ఏమిటీ చెలగాటమని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంటే.. తెలంగాణలో మాత్రం ఇంకెంత కాలం ఈ సందిగ్ధమని నిలదీశారు. తెలంగాణ బిడ్డలను నాన్ లోకల్స్‌గా మార్చి, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు పెద్దపీట వేసే జిఒ 33 అమలు కోసం కాంగ్రెస్ సర్కారు ఎందుకింత మొండిపట్టు పడుతోందని అడిగారు.

స్థానికతను నిర్ధారించే విషయాన్ని ప్రభుత్వం ఎందుకింత వివాదాస్పదం చేస్తోందని, రోజురోజుకూ ఇంకా ఎందుకు న్యాయపరమైన చిక్కుల్లోకి నెడుతోందని ప్రశ్నించారు. తమ పిల్లల్ని డాక్టర్లుగా చూడాలని కలలు కంటున్న వేలాది మంది తల్లిదండ్రుల ఆకాంక్షలను దెబ్బతీసే గొడ్డలిపెట్టు లాంటి నిర్ణయాలను ప్రభుత్వం ఇకనైనా వెనక్కి తీసుకోవాలని సూచించారు. సమైక్యరాష్ట్రంలో 5 కేవలం మెడికల్ కాలేజీలు ఉంటే.. స్వరాష్ట్రంలో 29 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుని వాటి సంఖ్యను 34కు పెంచుకున్నది ఇందుకేనా..? అని ప్రశ్నించారు.

జిల్లాకో మెడికల్ కాలేజీ నినాదాన్ని బిఆర్‌ఎస్ హయాంలో నిజం చేస్తే.. కాంగ్రెస్ సర్కారు రాగానే దారుణంగా నీరుగారుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఎంబిడిఎస్ సీట్లను ఏకంగా 8915కు పెంచుకుని రాష్ట్రాన్ని డాక్టర్ల ఫ్యాక్టరీగా తీర్చిదిద్దితే, ఆ సమున్నత లక్ష్యానికి కాంగ్రెస్ సర్కారు తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు. నాటి కెసిఆర్ విజన్‌కు.. నేటి కాంగ్రెస్ సర్కారు వైఫల్యంతో గ్రహణం పట్టిందని కెటిఆర్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News