న్యూఢిల్లీ: ప్రముఖ తెలుగు దర్శకులు ఎస్‌ఎస్ రాజమౌళిపై బ్రెజిల్ అధ్యక్షులు లూయిజ్ ఇనాషియో లూలా డ సిల్వా ప్రశంసలు కురిపించారు. తాను ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చూసి థ్రిల్ల్ అయ్యానని తెలిపారు. లూలా ఢిల్లీలో జి20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చారు. దర్శకులు రాజమౌళి ఈ సినిమా బాగా తీశారని, రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టిఆర్ అత్యద్భుతంగా నటించారని తెలిపిన బ్రెజిల్ నేత ఈ దశలో నాటునాటు పాటను ప్రస్తావించారు. డాన్స్ నచ్చిందని, మూడు గంటల ఈ సినిమా ప్రతి సీన్‌ను తాను ఎంజాయ్ చేశానని తెలిపారు.
ఆర్‌ఆర్‌ఆర్ అంటే తన దృష్టిలో రివోల్ట్ రిబెలియన్ రెవల్యూషన్ అని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా నేపథ్యం స్వాతంత్య్రోద్య మం కావడం కీలకమని వివరించారు. బ్రెజిల్ అధ్యక్షుడి మెచ్చుకోలుపై రాజమౌళి స్పందించారు. ఓ గొప్పనేత స్పందన ఆనందాన్ని ఇంచ్చిందని, ఆయన భారతీయ సినిమాను ప్రస్తావించడం, తమ ఆర్‌ఆర్‌ఆర్ టీంను అభినందించడం తనకే కాకుండా అందరికి గర్వకారణం అన్నా రు. భారత్‌లో ఈ నేత పర్యటన ఘననీయం కావాలని ఆకాంక్షించారు.