న్యూఢిల్లీ: భారత్ బయోటెక్‌కు చెందిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌ను బ్రెజిల్ నిలిపివేసింది. అవినీతి ఆరోపణలు, రాజకీయ విమర్శల కారణంగా బ్రెజిల్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించిన నేపథ్యంలో బ్రెజిల్ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా బ్రెజిల్‌లో ఈ ఏడాది ఫిబ్రవరిలో 2 లక్షల మందికి పైగా మరణించడంతో అధ్యక్షుడు జైరో బోల్సొనారోపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో త్వరితగతిన వ్యాక్సిన్ సరఫరా కోసం ఆయన మన దేశానికి చెందిన భారత్ బయోటెక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ బ్రెజిల్‌లో విడుదల చేసేందుకు బోల్సొనారో మధ్యవర్తిగా ప్రముఖ ఫార్మాసంస్థ ప్రెసిసా మెడికామెంటోస్, ఎన్విక్సియా ఫార్మాస్యూటికల్‌ను అనుమతించారు.
ఒక్కో డోసు 15 డాలర్ల చొప్పున 300 మిలియన్ డాలర్ల విలువైన 20 మిలియన్ డోసులను తెప్పించుకునేందుకు బొల్సొనారో స్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే ఈ వ్యాక్సిన్ ఒప్పందంలో బోల్సొనారోపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. తన సన్నిహితులకు చెందిన ఫార్మాసంస్థ ప్రెసిసా మెడికామెంటోస్‌కు అప్పగించడం ద్వారా ఏకంగా 10 కోట్ల డాలర్లు ముడుపులు అందుకొన్నారని ఆయనపై విమర్శలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అక్కడి సుప్రీంకోర్టు కూడా దీనిపై విచారణకు ఆదేశించింది. దీంతో బ్రెజిల్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు భారత్ బయోటెక్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బ్రెజిల్ ఆరోగ్య రెగ్యులేటర్ అన్విసా ఒక ప్రకటన జారీ చేసింది.