Monday, December 23, 2024

“క్రూయిజ్ బోటింగ్‌”కు బ్రేక్ …!

- Advertisement -
- Advertisement -

శ్రీశైలం నుండి సోమశిలకు, నాగార్జున సాగర్‌కు లాంచీలు వేద్దామనకున్న టిఎస్ టిడిసి
కృష్ణానదిలో 590 క్యూబిక్ మీటర్ల నీళ్లు ఉంటేనే పడవ ప్రయాణాలు
వర్షాలు లేక ప్రస్తుతం 530 కెఎం కే పరిమితం

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో తగినంత వర్షాలు లేక జలాశయాల స్థాయి అడుగంటుతోంది. సాధారణ వర్షాలు కురిసినా కనీస స్థాయిలో నీళ్లు నిలువ ఉండేవి. మళ్లీ వర్షాలు ఎప్పుడు వస్తాయా… కనీస నీటి మట్టాలు ఎప్పుడు పెరుగుతాయా.. అని రైతులే కాదు.. రాష్ట్రంలోని పర్యాటక శాఖ కూడా నిరీక్షిస్తోంది. ఇందుకు కారణం తాము అనుకున్న లాంఛీల ప్రయాణాలు కాస్త ఆలస్యమవుతుండడమే. నిజానికి గత రెండు నెలల క్రితమే శ్రీశైలం నుండి సోమశిలకు అలాగే శ్రీశైలం నుండి నాగార్జున సాగర్‌కు లాంఛీలు వేద్దామని అనుకుంది. ఇందుకోసం రెండు ప్రాంతాలకు రెండు క్రూస్ బోట్లను కూడా సిద్ధం చేసుకుంది. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఆర్‌టిసి లాంటి సంస్థలు అదనపు ఛార్జీలు లేకుండానే ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లుగానే తాము టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా క్రూస్ బోటింగ్ సదుపాయాలు కల్పించి అవసరమైతే ఇంకా తక్కువ ధరల్లోనే టూరిస్టులకు ప్రయాణ సదుపాయాలను కల్పించాలని భావించింది. ఇందుకోసం రెండు లాంఛీలను సిద్ధం చేసుకున్న టిఎస్ టిడిసి వర్షాల కోసం నిరీక్షిస్తూ వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం నుండి సోమశిలకు వెళ్లాలన్నా, లేదా నాగార్జున సాగర్‌కు వెళ్లాలన్నా కృష్ణా నదిలొ కనీసం 590 క్యూబిక్ మీటర్ల లెవల్‌లో నీరు ఉండాల్సి ఉంటుంది.

అయితే వర్షాలు లేని కారణంగా ప్రస్తుతం కేవలం 530 క్యూబిక్ మీటర్లకే పరిమితం అయ్యింది. కాగా శ్రీశైలంకు సమీపంలోనే ఒక చెక్‌డ్యాం ఉండడంతో పడవ ప్రయాణాలకు సరిపడా ఎత్తు లేక పోవడంతో పడవ ప్రయాణాలకు బ్రేక్ పడింది. నీరు సరిపడా లేక పోవడంతో బోట్ ప్రయాణాలు కుదరదంటూ అటు ఇరిగేషన్‌శాఖ అధికారులూ ఆర్డర్‌లు జారీ చేయడంతో ప్రస్తుతానికి చేసేది లేక టిఎస్ టిడిసి మిన్నకుండి పోయింది. వర్షాలు వస్తేనే పర్యాటకుల తాకిడి కాగా భారీ వర్షాలు గనుక వస్తేనే రాష్టంలో జలాశయాలు కళకళ లాడుతుండేవి. ముఖ్యంగా ఇతర ప్రాంతాలతో పాటు ఇటు శ్రీశైలంలోనూ కృష్ణమ్మ పరవళ్లు తొక్కేది . కిందటి సంవత్సరం అయితే…. వరుస వర్షాలతో వరద నీరు పోటెత్తేది కూడా. దాంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ తదితర జలాశయాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చే వారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశీ టూరిస్టులు కూడా శ్రీశైలం, నాగార్జున సాగర్ , సోమశిల సహా పలు ప్రాంతాలను చూసేందుకు భారీగా తరలి వస్తుంటారు.

ఆ క్రమంలో పర్యాటకులను ఆకర్షిస్తూనే తనకూ ఆదాయ మార్గం చూసుకుంటూ తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చాలా ప్రణాళికతో ముందుకు వెళ్లేది. పర్యాటకులకు బోటింగ్ లాంటి సదుపాయాల కల్పన ద్వారా పర్యాటకులను ఆకర్షించాలని భావించేది. బోటింగ్ ద్వారా అటు పర్యాటకులకు టూర్ సదుపాయం కల్పించడం ఒకటైతే.. తద్వారా టిఎస్ ఆర్‌టిసి తరహాలో టిక్కెట్లతో టిఎస్ టిడిసి సంస్థ ఆదాయం కూడా సమకూరేది. ఈ డబ్బులను పర్యాటకులకు మేలైన సదుపాయాలు కల్పించేందుకు ఉపయోగించుకుంటున్న పర్యాటకాభివృద్ధి సంస్థ ఏటా ఏఏ చోట్లకు టూరిస్టుల తాకిడీ ఉండనుందో అక్కడ బోటింగ్ సదుపాయలతో పాటు వారు కోరే ఇతర సౌకర్యాలు.. సదుపాయాలు కల్పించి తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూసేది.
రెండు నెలల క్రితమే …
రెండు నెలల క్రితమే శ్రీశైలం కేంద్రంగా రెండు చోట్లకు బోటింగ్ ప్రయాణాలకు ఏర్పాట్లు చేసింది. సోమశిల నుండి శ్రీశైలంకు ఒకటి అయితే.. నాగార్జున సాగర్ నుండి శ్రీశైలంకు మరో బోటింగ్ సదుపాయాన్ని కల్పించాలని ప్లాన్ చేసింది. శ్రీశైలానికి వాటర్ లెవల్స్ పెరగగానే “క్రూయిజ్ బోటింగ్‌” ప్రయాణాలకు ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ భావిస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా 175 బోట్ల షికారు
కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 175 బోట్లను తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ( టిఎస్ టిడిసి ) నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్, దుర్గం చెరువుతో పాటు నిజామాబాద్ జిల్లా అలీసాగర్ వరంగల్ జిల్లా రామప్ప, కోటిలింగాల, లక్నవరం, కరీంనగర్ జిల్లాలోని ఎల్‌ఎండి.. ఇలా ఆయా చోట్ల ఈ బోట్లన్నింటికి కూడా పర్యాటకుల నుండి తాకిడి ఉంటోంది. ఒక రకంగా భారత దేశం మొత్తంలో గోవా, ఏపి తరువాత ..తెలంగాణలోనే అత్యధికంగా బోట్లు నడుస్తుంటాయని పర్యాటకాభివృద్ది సంస్థ వర్గాలు చెబుతున్నాయి. వర్షాలు సమృద్ధిగా వస్తే…ఈ నూతన బోటింగ్‌కు డబ్బులు ఎంత ఛార్జ్ చేయాలనే దానిపైనా పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, రేటింగ్ కూడా పొరుగు రాష్ట్రాల కంటే తక్కువగా ఉండేలా చూస్తామని అధికారులు తెలియజేస్తున్నారు. ఒక వేళ వర్షాలు సమృద్ధిగా వస్తే గనుక ఇక సోమశిల నుండి శ్రీశైలం, అలాగే నాగార్జున సాగర్ నుండి శ్రీశైలంకు బోటింగ్‌ను ప్రారంభించుకుందామని టిఎస్ టిడిసి అధికారులు చెబుతుండడం విశేషం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News