ముంబై : ఢిల్లీలో శ్రద్ధావాకర్ దారుణ హత్య సంఘటనే తాను సహనటి తునీషా శర్మకు బ్రేకప్ చెప్పేలా చేసిందని పోలీసుల విచారణలో నిందితుడు షీజాన్ ఖాన్ చెప్పాడు. సహజీవనం చేస్తున్న వ్యక్తే శ్రద్దను దారుణంగా హతమార్చి 35 ముక్కలుగా కోసిన ఘటన తనను కలచివేసిందని తెలిపాడు. అందుకే తాను బాగా ఆలోచించి తునీషాకు బ్రేకప్ చెప్పానని తెలిపాడు. తనమతం, వయసు కూడా బ్రేకప్ అవ్వడానికి కారణంగా పేర్కొన్నాడు. తునీషాను ఆత్మహత్యకు పురికొల్పాడన్న ఆరోపణలపై వాలివ్ పోలీసులు ఆదివారం తెల్లవారు జామున షీజాన్ ఖాన్‌ను అదుపు లోకి తీసుకున్నారు.
అనంతరం కోర్టులో హాజరు పర్చగా, ముంబై లోని వాసాయ్ కోర్టు అతనికి నాలుగు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. దాంతో తొలిరోజైన ఆదివారమే పోలీస్‌లు షీజాన్ ఖాన్‌ను పలు విధాలుగా ప్రశ్నించారు. మరణానికి కొన్ని రోజుల ముందు ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించగా తాను రక్షించానని చెప్పాడు. తాము విడిపోవడం గురించి తునీషా తల్లికి తెలియజేశానని, తునీషాను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించానని తెలిపాడు. ఇందులో వాస్తవాలు ఎంత అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇండియా టుడే తరువాత ఎఫ్‌ఐఆర్ కాపీ సంపాదించింది. తునీషా శర్మ, షీజాన్‌ఖాన్ వీరిద్దరూ దంపతులుగానే అనుబంధం పెంచుకున్నారని, ఆమె ఆత్మహత్యకు 15 రోజుల ముందు విడిపోయారని ఎఫ్‌ఐఆర్‌లో వివరించి ఉంది.