Monday, December 23, 2024

మళ్లీ బ్రీత్ అనలైజర్ పరీక్షలు ….డిజిసిఎ కీలక నిర్ణయం

- Advertisement -
- Advertisement -

Breath tests for flight crew reinstated

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో విమానయానం మళ్లీ సాధారణ స్థాయికి చేరుకుంది. దీంతో కేంద్ర పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసిఎ) కీలక నిర్ణయం తీసుకుంది. విమాన సిబ్బందికి శ్వాస పరీక్షలు (బ్రీత్ అనలైజర్) పునరుద్ధరించింది. అక్టోబర్ 15 నుంచి పైలట్లు, క్యాబిన్ సిబ్బంది సహా ప్రతి ఉద్యోగికి ఈ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. విమాన సిబ్బంది మద్యం సేవించారా లేదా అన్నది తెలుసుకోడానికి రోజువారీ బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. అయితే కొవిడ్ మహమ్మారి విజృంభణ తర్వాత ఈ నిబంధనపై కొన్ని పరిమితులు విధించారు. ఎయిర్‌క్రాఫ్ట్ సిబ్బందిలో 50 శాతం మందికి మాత్రమే ఈ శ్వాస పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత 2021 మే నెలలో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు గంటకు ఆరు పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు.

అయితే ఈ ఆదేశాలను న్యాయస్థానం ఇటీవల సవరించింది. దీంతోపాటు కరోనా కేసులు కూడా తగ్గుముఖం పట్టడం, ప్రయాణికుల రద్దీ పెరగడంతో బ్రీత్ అనలైజర్ పరీక్షలను మళ్లీ పునరుద్ధరిస్తున్నట్టు డీజీసీఎ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఆదేశాల ప్రకారం ప్రతి విమాన , క్యాబిన్ సిబ్బందికి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించాలని డీజీసీఎ స్పష్టం చేసింది. పెద్ద బహిరంగ ప్రదేశంలో ఈ పరీక్షలు నిర్వహించాలని అక్కడ సీసీటీవీలు కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ పరీక్షలు నిర్వహించే వైద్యులు, నర్సులు ముందుగా విమాన సిబ్బందికి కరోనా లక్షణాలు ఉన్నాయా లేదా అన్నది పరీక్షించాలని తెలిపింది.

ఒకవేళ ఏ సిబ్బందికైనా కొవిడ్ పాజిటివ్‌గా తేలితే ఆ వ్యక్తికి బ్రీత్ అనలైజర్ పరీక్ష నుంచి మినహాయింపు కల్పించి విధుల నుంచి సెలవు ఇవ్వాలని సూచించింది. అలాంటి కేసుల రికార్డులను తప్పనిసరిగా భద్రపర్చాలని పేర్కొంది. శ్వాస పరీక్షల కోసం ఉపయోగించే పరికరాలను తప్పనిసరిగా శానిటైజ్ చేయాలని తెలిపింది. విమానయాన సంస్థలు , ఎయిర్‌పోర్టులు ఈ పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకునేందుకు అక్టోబర్ 15 వరకు గడువు కల్పిస్తున్నట్టు వెల్లడించింది. ఆ తేదీ నుంచి తప్పనిసరిగా ప్రతి విమాన సిబ్బందికి శ్వాసపరీక్షలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News