న్యూఢిల్లీ : రైల్వే సరకుల రవాణా లో లంచం పుచ్చుకుని రాక్‌ల కేటాయింపులో పాధాన్యం ఇచ్చారన్న రాకెట్‌కు సంబంధించి ముగ్గురు సీనియర్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐఆర్‌టిఎస్) అధికారులను, మరో ఇద్దరిని సిబిఐ సోమవారం అరెస్టు చేసింది. హాజిపూర్ కేంద్రంగా గల ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఈసీఆర్) అధికారులు ఈ వ్యవహారాన్ని తెలియజేశారు. అరెస్టయిన వారిలో సంజయ్ కుమార్ (1996 బ్యాచ్), ఇసిఆర్‌లో చీఫ్ ఫ్రెయిట్ ట్రాన్స్‌పొర్టేషన్ మేనేజర్‌గా నియామకమయ్యారు. రూపేష్ కుమార్ (2011 బ్యాచ్) సమస్తిపూర్‌లో నియామకమయ్యారు. సచిన్ మిశ్రా (2011 బ్యాచ్) సోన్‌పూర్‌లో నియామకమయ్యారు. సరకుల రవాణాకు ర్యాక్‌ల కేటాయింపులో రెగ్యులర్‌గా లంచాలు వసూలు చేస్తున్నారని వీరిపై నేరారోపణలు ఉన్నాయి. కోల్‌కతా కేంద్రమైన అభ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన నవాల్ లధాను, ఈ కేసుతో సంబంధం ఉన్న మరో వ్యక్తి మనోజ్‌కుమార్ సాహాను సిబిఐ అరెస్టు చేసింది. సోదాల్లో రూ. 46.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.