బ్రిక్స్ సదస్సులో న్యూఢిల్లీ తీర్మానం
న్యూఢిల్లీ : అఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితిని శాంతియుతంగా, సామరస్యంగా పరిష్కరించాల్సి ఉందని ఐదు దేశాల బ్రిక్స్ సదస్సులో పిలుపు నిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ కీలక సదస్సు జరిగింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి కల్లోలంగా ఉండటం పట్ల బ్రిక్స్ సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. బ్రెజిల్, రష్యా, ఇండియా చైనా, దక్షిణాఫ్రికా దేశాలతో కూడిన ఈ బృందం సదస్సు ముగింపు దశలో న్యూఢిల్లీ డిక్లరేషన్ పేరిట తీర్మానం ఆమోదించారు. అఫ్ఘన్‌లో తలెత్తిన మానవీయ సంక్షోభం కీలక అంశం అయింది. అక్కడ మహిళలు, పిల్లలు, మైనార్టీల సంరక్షణకు వెంటనే సకల చర్యలు తీసుకోవల్సి ఉందని తెలిపారు. ముందు అక్కడ సుస్థిరత, పౌరుల శాంతియుత జీవనక్రమం నెలకొనాల్సి ఉంది. శాంతిభద్రతలు మెరుగుపడాలి. ఈ దిశలో సమీకృత అప్ఘన్ అంతర్గత సంప్రదింపులు జరగాల్సి ఉందని తెలిపారు. ప్రధానంగా అఫ్ఘనిస్థాన్‌నే కేంద్రీకృతం చేసుకుని ఈ బ్రిక్స్ సదస్సు జరిగింది. ఉగ్రవాదం నిర్మూలనకు కీలక చర్యలు తీసుకోవాలని బ్రిక్స్ సదస్సు కోరింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తుత అవకాశాలను వాడుకుని అఫ్ఘన్‌ను ఉగ్రవాద స్థావరంగా ఏ శక్తులూ వాడుకోకుండా చూడాల్సి ఉందని తెలిపారు.