Sunday, January 19, 2025

మంచి సంకేతాలు

- Advertisement -
- Advertisement -

దక్షిణాఫ్రికా రాజధాని జోహెన్నస్‌బర్గ్‌లో మూడు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ (భారత్, బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా) దేశాల అధినేతల సమావేశం ఆశాజనకమైన సంకేతాలను ఇచ్చింది. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా పెత్తనాన్ని ఎదిరించి ప్రత్యామ్నాయ అంతర్జాతీయ సంస్థలను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్న బ్రిక్స్ భవిష్యత్తులో దేశాల మధ్య మెరుగైన సంబంధాలను నెలకొల్పే సూచనలు లేకపోలేదు. మరి ఆరు దేశాల(అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)ను బ్రిక్స్‌లో చేర్చుకోవాలని తీసుకొన్న నిర్ణయం చెప్పుకోదగినది. వచ్చే జనవరి నుంచి ఈ దేశాలు బ్రిక్స్‌లో చేరనున్నాయి. చైనా ఆధ్వర్యంలో ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య చరిత్రాత్మకమైన మైత్రి కుదిరిన సంగతి తెలిసిందే. అమెరికాకు భిన్నంగా పరస్పర ప్రయోజనాల ప్రాతిపదికగా దేశాల మధ్య మైత్రిని నెలకొల్పడం చైనా విధానంగా దీనితో వెల్లడైంది. అంతర్జాతీయ రంగంలో ప్రభావవంతమైన పాత్ర పోషించాలని బ్రిక్స్ గట్టిగా సంకల్పిస్తున్నదని అర్థమవుతున్నది.

జోహెన్నస్‌బర్గ్ సమావేశాలు బ్రిక్స్ అధినేతల మధ్య అనుబంధాన్ని పెంచింది. ఈ సమావేశాలకు హాజరైన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య సామరస్య వాతావరణం గుబాళించడం మరో హృద్యమైన పరిణామం. రెండు దేశాల మధ్య సరిహద్దుగా పరిగణన పొందుతున్న వాస్తవాధీన రేఖ వద్ద మోహరించి వున్న తమ సైన్యాలను వెనక్కు తీసుకోవాలని వీరిద్దరి మధ్య కుదిరిన అంగీకారం గణనీయమైనది. వాస్తవాధీన రేఖ వద్ద పశ్చిమ రంగంలో అపరిష్కృతంగా వున్న సమస్యలను పరిష్కరించుకొని ఆ రేఖను శాంతియుత సరిహద్దుగా గౌరవించాలని రెండు దేశాలూ సంకల్పం చెప్పుకొన్నాయని తెలుస్తున్నది. 2020 జూన్ 15న లడఖ్‌లోని గాల్వాన్ లోయ వద్ద రెండు దేశాల సైన్యాల మధ్య సంభవించిన బాహాబాహీ ఘర్షణలో 20 మంది భారత సైనికులు, లెక్క తెలియనంత మంది చైనా జవాన్లు మరణించారు. ఆయుధాలు ప్రయోగించరాదన్న నిబంధన వున్నందున రెండు దేశాల సైన్యాలు మేకులు కొట్టిన కర్రలతోనూ, రాళ్ళతోనూ తలపడ్డారు.

ఆ ఘర్షణల్లో చైనా ముందుకు చొచ్చుకొచ్చి 2000 చ.కి.మీ మేర భారత భూభాగాన్ని ఆక్రమించుకొన్నదని సమాచారం. అయితే ఈ సమస్య పరిష్కారానికి రెండు దేశాల సైన్యాల మధ్య వెంటనే చర్చలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 19 సార్లు జరిగాయి. కాని చైనా సేనలు కీలక ప్రాంతాల నుంచి ఇంకా వైదొలగవలసి వుంది. ఇంత వరకు జరిగిన చర్చల్లో బొత్తిగా పురోగతి లేదనడానికి వీల్లేదు. కాని ముఖ్యమైన ప్రాంతాల నుంచి చైనా సేనలు వెనుకకు జరగవలసి వుంది. గాల్వాన్ లోయ, పాంగాంగ్ సో, గోగ్రా, హాట్ స్ప్రింగ్స్ అనే నాలుగు ప్రాంతాల నుంచి ఉభయ సేనల ఉపసంహరణ జరిగినప్పటికీ ఇంకా రెండు వైపులా వేలాది సైన్యాలు వాస్తవాధీన రేఖ వద్ద మోహరించి వున్నాయి. దౌలత్ బేగ్ ఓల్డీ సెక్టార్, ఛార్డింగ్ నల్లా జంక్షన్ వద్ద సమస్యలు అపరిష్కృతంగా వున్నాయి. చర్చలు జరుగుతున్నప్పటికీ ఇక్కడి నుంచి సైన్యాలను ఖాళీ చేయడం లేదు. పర్యవసానంగా రెండు వైపులా చెరి 50 వేల మంది సైనికులను భారీ ఆయుధాలతో కొనసాగించవలసి వస్తున్నది. ఖర్చు పరంగా ఇది రెండు దేశాలకు భారమైనది.

అంతేకాకుండా ఇంత భారీ సైన్యాలు అతి దగ్గరగా మోహరించడం వల్ల ఎప్పుడు, ఏ సమస్య తలెత్తుతుందో తెలియని అయోమయావస్థ కొనసాగుతుంది. 18వ రౌండ్ సైనిక స్థాయి చర్చలు జరిగిన తర్వాత నాలుగు మాసాలకు గాని 19వ రౌండ్ చోటుచేసుకోలేదు. అయితే 18వ రౌండ్ చర్చల అనంతరం విడుదల కాని సంయుక్త ప్రకటన ఇటీవలి చర్చల అనంతరం విడుదల కావడం మంచి సంకేతాలను పంపించింది. అలాగే 19వ రౌండ్ చర్చలు వరుసగా రెండు రోజులు సాగడం శుభసూచకమనిపించింది. రాజకీయంగా చూస్తే భారత దేశం అటు అమెరికా వున్న క్వాడ్ ఒప్పందంలోనూ, ఇటు బ్రిక్స్‌లోనూ వున్నది. దీనిని చైనా ఏ దృష్టితో చూస్తున్నదనేది ముఖ్యం. అయితే ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా ప్రధాని మోడీ ప్రభుత్వం అమెరికాను కాదని రష్యాతో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకొన్నది. ఇండియా, చైనాలు రెండూ రష్యా నుంచి చవకగా క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకొంటున్నాయి.

విదేశాంగ విధానంలో స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాననే సంకేతాన్ని దీని ద్వారా ఇండియా అమెరికాకు పంపించింది. అయితే చైనాతో సరిహద్దు పేచీ వున్న ఇండియాను తమ వైపు తిప్పుకోవచ్చునని అమెరికా ఇప్పటికీ భావిస్తున్నది. పసిఫిక్ సముద్ర జలాల్లో చైనా పెత్తనాన్ని ఎదిరించడం కోసం ఇండియా సహకారాన్ని పొందాలని ఆశిస్తున్నది. ఈ సంక్లిష్ట పరిస్థితి నేపథ్యంలో భవిష్యత్తు ప్రపంచ రాజకీయాలు ఎలా వుండబోతున్నాయనేది ఆసక్తిదాయకమైన అంశం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News