గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై నెలల తర్వాత..!!
బరేలీ: అత్తగారి గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికైన కోడలు స్థానికంగా ఉండకుండా నెలల తర్వాత తిరిగి వచ్చిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. హెలికాప్టర్‌పై గ్రామానికి చేరుకున్న ఆమె కోసం స్థానికులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఆరు నెలల విరామం తర్వాత మరోసారి పెళ్లి కూతురిగా అత్తగారింట్లోకి అడుగుపెట్టారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. బదౌన్ బిజెపి ఉపాధ్యక్షుడు వేద్రమ్‌లోధి కూతురు సునీతవర్మ గతేడాది డిసెంబర్‌లో బరేలీ జిల్లా ఆలంపూర్‌కోట్ గ్రామానికి చెందిన ఓమేంద్రసింగ్‌ను రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నారు.
ఆ గ్రామంలో ఓటర్‌గా నమోదై ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేయడానికి వీలుగా ముందస్తుగా జరిపిన వివాహంగా భావిస్తున్నారు. నామినేషన్ వేసిన తర్వాత ఆమె ఆ గ్రామంలో ఉండకుండా బదౌన్‌లోని తల్లిగారింటికి తిరిగి వెళ్లారు. ప్రచారం కూడా నిర్వహించలేదని గ్రామస్తులు తెలిపారు. భర్తే ఆమె తరఫున ప్రచారం చేసి గెలిపించారు. శనివారం అత్తగారింట్లో అడుగుపెట్టిన వర్మ మరోసారి హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఆ గ్రామానికి ఆమె అత్తగారు కూడా గతంలో రెండుసార్లు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.