న్యూస్ డెస్క్: పెళ్లి మండపానికి స్కూటర్‌పై వచ్చి అందరికీ షాక్ ఇవ్వాలనుకుందో పెళ్లి కూతురు. అయితే ఆమెకే షాక్ ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. హెల్మెట్ లేకుండా నడపడం, డ్రైవింగ్ లైసెన్సు లేకుండా టూవీలర్ డ్రైవ్ చేయడం వంటి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు భారీగానే ఆమెకు జరిమానా విధించారు.
పెళ్లి దుస్తుల్లో ఒక నవ వధువు హెల్మెట్ లేకుండా తానే టూవీలర్ నడుపుతూ కళ్యాణ మండపానికి చేరుకుంటున్న దృశ్యానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. హనీమూన్ ట్రావెల్స్ చిత్రంలోని వారీ వారీ జవాన్ అనే పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తుంటే ఆ యువతి వేగంగా స్కూటర్ నడుపుతున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు.
అయితే..ఈ వీడియో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసుల కంటపడింది. వెంటనే అదే వీడియోను రీ ఎడిట్ చేసి తమ ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ట్రాఫిక్ నబంధనలను ఉల్లంఘిస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో కూడా వారు నెటిజన్లకు హెచ్చరించారు. వారి వారి జవాన్ అని పాడుకుంటూ హెల్మెట్ లేకుండా రోడ్డుపైన వాహనం నడిపితే మీ భద్రత ఆపదలో పడుతుందని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. బేవకూఫియా చర్యలకు పాల్పడవద్దని, సురక్షితంగా డ్రైవ్ చేయండంటూ వారు సూచిస్తూ తమ వీడియోకు చలాన్ జతచేశారు.
రెండు నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ పెళ్లి కుమార్తెకు రూ. 6,000 జరిమానా విధించారు. ఒకటి హెల్మెట్ లేకుండా టూవీలర్ నడిపినందుకు రూ. 1,000 జరిమానా, రెండు డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు రూ. 5,000 జరిమానా విధించారు.
Going 'Vaari Vaari Jaaun' on the road for a REEL makes your safety a REAL WORRY!
Please do not indulge in acts of BEWAKOOFIYAN! Drive safe.@dtptraffic pic.twitter.com/CLx5AP9UN8
— Delhi Police (@DelhiPolice) June 10, 2023